సాక్షి, హైదరాబాద్ : వ్యాపార విస్తరణలో భాగంగా ఇతర రాష్ట్రాల్లో బొగ్గు బ్లాకుల కోసం సింగరేణి సంస్థ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఒడిశాలో ఇప్పటికే 3,500 లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్న ‘నైనీ’ బ్లాకును పొందిన సింగరేణి, తాజాగా దీనికన్నా 3 రెట్లు పెద్దదైన ‘న్యూ పాత్రపాద’అనే కొత్త బ్లాకును దక్కించుకుంది. ఒడిశాలో తమకు కేటాయించిన నైనీ బొగ్గు బ్లాకుతో పాటు మరికొన్ని కొత్త బ్లాకులు కేటాయించాలని సింగరేణి సంస్థ విజ్ఞప్తి చేయగా కేంద్ర బొగ్గు శాఖ సానుకూలంగా స్పందించింది. ‘న్యూ పాత్రపాద’బ్లాకును వారం రోజుల కింద సింగరేణికి కేటాయించింది. ఛండిపడ తహశీల్ పరిధిలోని అనేక బొగ్గు బ్లాకుల్లో ‘న్యూ పాత్రపాద’ఒకటి. నైనీ బ్లాకుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనుమతులన్నీ లభించిన తర్వాత బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తే దేశంలోని అతిపెద్ద గనుల్లో ఒకటిగా నిలవనుంది. సింగరేణి సంస్థ తన 48 గనుల నుంచి ఏటా 680 లక్షల టన్నుల బొగ్గు తీస్తుండగా, ఈ ఒక్క గని నుంచి 200 లక్షల టన్నుల బొగ్గు తీసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment