సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ కేంద్రంగా బొగ్గు వెలికితీస్తున్న సింగరేణి సంస్థ తొలిసారిగా ఇతర రాష్ట్రాల్లోనూ ఉత్పత్తికి సిద్ధమైంది. ఒడిశాలోని నైనీ బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తికి తాజాగా సింగరేణికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. గతేడాది డిసెంబర్ 1న కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ(ఎంఓఈఎఫ్) నుంచి నైనీ బ్లాకుకు పర్యావరణ అనుమతులు లభించగా, తాజాగా బుధవారం అటవీ అనుమతులు సైతం లభించాయి.
ఒడిశాలోని చెండిపాడ, కంకురుపల్ రిజర్వ్ ఫారెస్టుతో పాటు విలేజ్ ఫారెస్టుకు సంబంధించిన 783.275 హెక్టార్ల అటవీ భూములను ఈ గనికి కేంద్ర పర్యావరణ శాఖ కేటాయించింది. దీంతో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించేందుకు కీలక అనుమతులన్నీ లభించినట్టయింది. మరో మూడు నెలల్లో నైనీలో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి ప్రారంభించనుంది.
తెలంగాణ బయట శ్రీకారం..
దక్షిణ భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ఏకైక సంస్థగా వందేళ్లకుపైగా రికార్డు సింగరేణి సంస్థ సొంతం. బ్రిటీష్ హయాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లెందులో మొదలైన బొగ్గు ఉత్పత్తి.. ఆ తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగ ర్, వరంగల్ జిల్లాలకు విస్తరించింది. పెరుగుతున్న అవస రాలను దృష్టిలో ఉంచుకుని ఇ తర రాష్ట్రాల్లోని బొగ్గు నిక్షేపాలపై సింగరేణి దృష్టి సారించింది.
912 హెక్టార్లలో తవ్వకాలు
మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకును 2016లో కేంద్రం కేటాయించింది. ఒడిశాలోని అంగూల్ జిల్లాలో చంఢీపాద, కంకురూప గ్రామాల సమీపంలోని 912 హెక్టార్లలో నైనీ బొగ్గుబ్లాకు విస్తరించి ఉండగా, అందులో 783.275 హెక్టార్ల అటవీ భూములున్నాయి. నిబంధనల ప్రకారం ఒడిశాలోని అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా.. తెలంగాణలోని ఖమ్మం, కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 794.63 హెక్టార్ల భూమిని అటవీ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉంది.
ఏడాదికి పది మిలియన్ టన్నులు..
నైనీ బ్లాకులో మొత్తం 340 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. తొలిదశలో సర్ఫేస్ మైనర్ యంత్రాలతో ఓపెన్ కాస్ట్ మైనింగ్ విధానం ద్వారా బొగ్గు వెలికి తీయనున్నారు. ఈ ఓపెన్ కాస్ట్ గనుల జీవితకాలం 38 నుంచి 40 ఏళ్ల పాటు ఉంటుందని అంచనా. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం పది మిలియన్ టన్నులుగా ఉంది. బొగ్గు ఉత్పత్తి కోసం సింగరేణి సంస్థ నుంచి 100 మంది ఉద్యోగులను నైనీకి తీసుకెళ్తారు. మరో 2,400 మందిని అక్కడ కాంట్రాక్టు పద్ధతిలో నియమించనున్నారు. స్థానికంగా పరిస్థితులు అనుకూలిస్తే మరో ఉపరితల గని కూడా ఏర్పాటు చేసే యోచనలో సింగరేణి ఉంది.
శుభ పరిణామం..
– ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్(పా), సింగరేణి సంస్థ
ఆరేళ్లుగా నైనీ బ్లాక్‌లో స్టేజీ–1, 2 అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. ఎట్టకేలకు బుధవారం పర్యావరణ శాఖ అనుమతి లభించడం శుభ పరిణామం. మరో 3–4 నెలల్లో నైనీబ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తాం. 2023 మార్చి 31 నాటికి సుమారు 3 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసేలా ప్రయత్నిస్తాం. కేంద్ర ప్రభుత్వం, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే రానున్న కాలంలో అక్కడ మరికొన్ని బ్లాక్‌లు ప్రారంభిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment