కరోనా నేర్పుతున్న పాఠం | Scrap Dumping Down From Houses in Hyderabad | Sakshi
Sakshi News home page

..ఇంకా తగ్గాలి

Published Wed, Apr 22 2020 9:41 AM | Last Updated on Wed, Apr 22 2020 9:41 AM

Scrap Dumping Down From Houses in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ ప్రజలందరికీ వివిధ పాఠాలు నేర్పుతోంది. ప్రస్తుతం మే 7 వరకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. అప్పటి వరకు ముప్పు లేకుండా బతికేందుకు ఉప్పు, పప్పులతో సహ అన్నింటినీ పొదుపుగా వాడుతున్నారు. ఆహార పదార్థాలతోపాటు వివిధ వస్తువుల విషయంలోనూ జాగ్రత్తగా ఉంటున్నారు. దీంతో గ్రేటర్‌ నగరంలో వెలువడే వ్యర్థాల మొత్తం తగ్గింది. రోజుకు సగటున దాదాపు 1800 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు తగ్గాయి.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లు, 150 డివిజన్లలోని ఇంటింటిచెత్తతోపాటు ఆయా ప్రాంతాల్లోని డంపర్‌బిన్ల నుంచి సేకరించిన వ్యర్థాలను  సమీపంలోని చెత్త ట్రాన్స్‌ఫర్‌ కేంద్రాలకు.. అక్కడి నుంచి జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డుకు తరలిస్తారు. గతంలో లాక్‌డౌన్‌ అమల్లోకి రాకముందు నెలరోజుల్లో రోజుకు సగటున 6453 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు డంపింగ్‌యార్డుకు తరలించగా, లాక్‌ డౌన్‌ అమల్లోకి వచ్చిన మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 20వరకు రోజుకు సగటున 4657 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు మాత్రమే తరలించారు.

జాగ్రత్తలో కుటుంబాలు..
లాక్‌డౌన్‌లో భాగంగా హోటళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, ఫంక్షన్‌హాళ్లు వంటివి మూతపడటంతో వాటినుంచి వెలువడే ఆహారవ్యర్థాలు తగ్గాయి. వాటితోపాటు ముఖ్యంగా దిగువ మధ్యతరగతి ప్రజలు ఆచితూచి వంటలు చేసుకుంటున్నారు.  ఏమాత్రం వ్రుథా కాకుండా ఆహారపదార్థాలు వినియోగిస్తున్నారు. నిత్యావసరాలు ఎన్ని రోజులపాటు అవసరాలకు సరిపోతాయోనని లెక్కలు వేసుకుంటూ వంటలు చేస్తున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. పేదలు, రెక్కాడితే డొక్కాడని కూలీలు గతంలో ఏరోజుకోరోజు వచ్చిన డబ్బుతోనే కోరుకున్నవి వండుకునే వారు. బార్లు, హోటళ్లలోనూ భారీగా ఖర్చు చేసేవారు. ప్రస్తుతం వారికి ఆదాయమే లేకపోవడంతో చాలా మంది పస్తులుంటున్నారు. వివిధ సంస్థలు, ప్రభుత్వ సాయం అందని వారు ఎందరో ఉన్నారు.  క్యారీ బ్యాగ్‌ల వినియోగం తగ్గింది. కాస్త పాతవైపోయిన వాటి స్థానే కొత్తవి కొనుక్కునే వారు సైతం కొనుగోళ్లు నిలిపేశారు. జీతాల్లో కోతలతోనూ చాలామంది నిత్యావసరాలు తప్ప ఇతరత్రా దృష్టి పెట్టడం లేదు.  ఆహార పదార్థాలు తప్ప ఇతర దుకాణాల లాక్‌డౌన్‌ ప్రభావం కూడా వీటిపై ఉంది. ఇలా వివిధ కారణాలతో నగరంలో వ్యర్థాలు తగ్గాయి.

లాక్‌డౌన్‌ రోజుల్లో వ్యర్థాలు దాదాపుగా..(మెట్రిక్‌ టన్నులు)  
తేదీ      వ్యర్థాలు(మెట్రిక్‌టన్నులు)

15 మార్చి    6107
16మార్చి    6027
17 మార్చి    6635
18 మార్చి    6756
19 మార్చి    6530
20 మార్చి    6554
11 ఏప్రిల్‌    4753
12 ఏప్రిల్‌    3762
13 ఏప్రిల్‌    5050
14 ఏప్రిల్‌    4590
15 ఏప్రిల్‌    4616
16 ఏప్రిల్‌    4552
17 ఏప్రిల్‌    4392
18 ఏప్రిల్‌    4682
19 ఏప్రిల్‌    3722
20 ఏప్రిల్‌    4990

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement