
సాక్షి, హైదరాబాద్: స్థానిక ఎన్నికల నేపథ్యంలో గతంలో లెక్కలు చూపని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఆశావహులకు చేదువార్త. గతంలో గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చుల లెక్కలు చూపనివారు ఈసారి ఎన్నికల్లో పోటీచేయకుండా రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్‌ఈసీ) అనర్హత వేటు వేసింది. మొత్తం 12,745 మంది (గెలిచిన, ఓడిన అభ్యర్థులు కలిపి)పై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ నిర్ణయించింది. గతంలో జరిగిన పంచాయతీ (ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కాకుండా), జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపోటములతో నిమిత్తం లేకుండా పోటీ చేసిన అభ్యర్థుల్లో నిర్ణీత గడువులోగా (ఫలితాలు ప్రకటించాక 45 రోజుల్లో) లెక్కలు చూపనివారిపై చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల ప్రచారం ప్రారంభించిన రోజు నుంచి పోలింగ్ ముగిసే వరకు అభ్యర్థులు ఎంత వ్యయం చేశారన్న దానిపై అభ్యర్థులంతా సంబంధిత అధికారులకు (ఎంపీడీవోలు, సీఈవోలకు) తప్పనిసరిగా వివరాలు, బిల్లులు సమర్పించాలి.
నోటీసులిచ్చినా స్పందన కరువు...
గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించాలని పలువురు అభ్యర్థులకు ఎస్‌ఈసీ పలు పర్యాయాలు నోటీసులు జారీ చేసినా వారి నుంచి స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది జనవరి వరకు సమయమిచ్చి తుది నోటీసులిచ్చినా పలువురు గెలిచిన, ఓడిన అభ్యర్థులు ఎలాంటి బిల్లులు సమర్పించలేదు. దీంతోపాటు పరిమితికి మించి ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేసి గెలిచారంటూ పలువురిపై ఎస్‌ఈసీ ఫిర్యాదులు కూడా వచ్చాయి. జిల్లాల వారీగా నిషేధానికి గురైన అభ్యర్థుల వివరాలు తెలియజేస్తూ జిల్లా కలెక్టర్లు, సీఈవోలకు ఆదేశాలిచ్చింది.
జిల్లాలవారీగా చూస్తే...
ఎస్‌ఈసీ అనర్హత వేటుకు గురైనవారిలో ఎక్కువగా నల్లగొండ జిల్లా నుంచి 81 మంది జెడ్పీటీసీ, 199 మంది ఎంపీటీసీ అభ్యర్థులు ఉన్నారు. వరంగల్ అర్బన్‌లో ఏడుగురు జెడ్పీటీసీ, 69 మంది ఎంపీటీసీ అభ్యర్థులున్నారు. సిద్దిపేటలో 8 మంది జెడ్పీటీసీ, 67 ఎంపీటీసీ, జయశంకర్ భూపాలపల్లి 8 మంది జెడ్పీటీసీ, 76 మంది ఎంపీటీసీ, జనగామలో నలుగురు ఎంపీటీసీ అభ్యర్థులు, సూర్యాపేటలో 55 మంది జెడ్పీటీసీ, 63 మంది ఎంపీటీసీ, యాదాద్రి భువనగిరిలో 32 మంది జెడ్పీటీసీ, 104 మంది ఎంపీటీసీ, రాజన్న సిరిసిల్లలో 13 మంది జెడ్పీటీసీ, 89 మంది ఎంపీటీసీ, కరీంనగర్‌లో 32 మంది జెడ్పీటీసీ, 282 మంది ఎంపీటీసీ, పెద్దపల్లిలో 31 మంది జెడ్పీటీసీ, 185 మంది ఎంపీటీసీ, జగిత్యాల జిల్లాలో 24 మంది జెడ్పీటీసీ, 141 మంది ఎంపీటీసీ అభ్యర్థులపై అనర్హత వేటు పడింది.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులపై వేటు
2013 గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీచేసిన 1,265 మంది సర్పంచ్ అభ్యర్థులు, 8,528 మంది వార్డు మెంబర్ అభ్యర్థులపై ఎస్‌ఈసీ చర్యలు తీసుకుంది. 2014లో పోటీ చేసిన 311 మంది జెడ్పీటీసీ, 1,331 మంది ఎంపీటీసీ అభ్యర్థులపై అనర్హత వేటు పడింది. వీరిలో పలువురు ఎంపీటీసీలు కూడా ఉన్నారు. ఎన్నికల వ్యయవివరాలు వెల్లడించనివారిని మూడేళ్లపాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. 2021 జనవరి 23 వరకు వీరు పోటీకి దూరం కానున్నారు.