తాగునీటి ఎద్దడి లేకుండా చూడండి
► ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ
► కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్
హన్మకొండ : వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రాజీవ్ శర్మ, కలెక్టర్ వాకాటి కరుణను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో కలిసి కలెక్టర్‌లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. తాగు నీటి ఎద్దడి నివారణకు గ్రామాలు, ఆవాస ప్రాంతాలవారీగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అమలుచేయూలన్నారు.
నిధులను సక్రమంగా వినియోగించాలన్నారు. కొత్తగా బోర్లను వేయొద్దని రాజీవ్ శర్మ సూచించారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు పాటించాల్సిన ఆరోగ్య నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామగ్రామాన విసృ్తతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
రూ.8.94 కోట్లు అడిగితే రూ.3.10 కోట్లే ఇచ్చారు : కలెక్టర్
ఈ సందర్భంగా కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ 6 సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు రూ.2.15 కోట్లు మంజూరు చేయాలని కోరారు. తద్వారా 215 గ్రామాల దాహార్తి తీరుతుందన్నారు. దీనిపై సీఎస్ రాజీవ్ శర్మ స్పందిస్తూ జిల్లా నుంచి ప్రతిపాదనలు పంపిస్తే నిధులు విడుదల చేస్తామన్నారు. పట్టణ ప్రాంతాల నీటి అవసరాలను తీర్చేందుకు రూ.8.94 కోట్లు విడుదల చేయాలని కోరగా ఇప్పటిదాకా రూ.3.10 కోట్లే మంజూరు చేశారన్నారు. మిగతా నిధులను అందించాలని కోరారు.
దేవాదుల నుంచి గోదావరి జలాల పంపింగ్ పనులకు సంబంధించిన టెండర్‌ను ఖరారు చేసేందుకు పంపిన ప్రతిపాదనలకు చీఫ్ ఇంజినీర్ ఆమోదం లభించాల్సి ఉందని కలెక్టర్ ఈసందర్భంగా సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ రాంచంద్, డీఆర్‌ఓ శోభ, డీఎంఆండ్‌హెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు, డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్ శేఖర్‌రెడ్డి, ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ మధుసూదన్ పాల్గొన్నారు.