- ముందస్తు సమాచారం ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్యం
- పూర్తి స్థాయిలో హాజరు కాని బీసీ సంచార జాతులు
ఇందూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచార జాతుల కోసం ఏర్పాటు చేస్తున్న సమీక్షలు, సమావేశాలు తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. సమీక్షలు, సదస్సులే ఇలా ఉంటే ఇక సంచార జాతుల స్వావలంబన ఎలా ఉంటుందో మంగళవారం స్థానిక న్యూ అంబేద్కర్ భవన్‌లో చేపట్టిన సదస్సును చూస్తే తెలుస్తుంది. సంచార జాతుల అభివృద్ధికి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై సదస్సు నిర్వహించి వారికి అవగాహన కల్పించాలని ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించింది.
ఈ బాధ్యతను జిల్లా స్థాయి అధికారి తీసుకుని, సంచార జాతుల వారికి, సంబంధిత అధికారులకు, ముఖ్య అతిథులకు ఒకటి రెండు రోజుల ముందు సమాచారం అందించాలి. ఒక రోజు ముందే కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. అరుుతే మంగళవారం నిర్వహించిన సదస్సు గురించి ముందస్తుగా సమాచారం ఇవ్వలేదు. దీంతో సదస్సు విషయం తెలియక జిల్లాలోని బీసీ సంచార జాతుల వారికి తెలియక చాలా మంది సదస్సుకు హాజరు కాలేదు. దాదాపు 36 బీసీ సంచార జాతుల కుస్తులుంటే పది జాతుల లోపే హాజరయ్యారు. దీంతో కుర్చీలన్నీ ఖాళీగా బోసిపోయి కనిపించాయి.
బ్యానరు లేదు... ముఖ్య అతిథికి గౌరవం లేదు
ఉదయం 10:30 గంటలకు సదస్సు ప్రారంభం కావాలి. కాని సమాచారం లేకపోవడంతో చాల మంది సమయానికి హాజరు కాలేదు. దీంతో సమావేశాన్ని 1 గంటకు వాయిదా వేశారు. ఏజేసీ రాజారాంకు కూడా ఆలస్యంగా సమాచారం ఇవ్వడంతో సదస్సు చాల ఆలస్యంగా ప్రారంభమయింది. అలాగే ప్రభుత్వం తరపున సదస్సు నిర్వహిస్తున్నట్లు కనీసం బ్యానరు కూడా ఏర్పాటు చేయలేదు.కనీసం ప్రభుత్వ పథకాలు తెలిపే విధంగా కర పత్రాలు పంచకుండా సదస్సులో చేతులు దులుపుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
సంచార జాతుల వారికి ప్రత్యేక పథకాలు
సంచార జాతుల వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ రాజారాం సూచించారు. ఆర్థికాభివృద్ధికి బీసీ కార్పోరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను అందజేస్తున్నట్లు తెలిపారు. బీసీలకు కళ్యాణ లక్ష్మి, సబ్‌ప్లాన్ విషయంలో ప్రభుత్వం ఆలోచించి త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులు, సంచార జాతుల కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.
సదస్సు విఫలం
Published Wed, May 13 2015 4:48 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM
Advertisement