అరుణాచల్‌ప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో నడుస్తున్న ఓ బస్సు
సాక్షి, హైదరాబాద్: రవాణా చట్టాల అమలు ఎంత నాసి రకంగా ఉందో ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం బట్టబయలు చేసింది. ఆ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ జరుపుకొని పర్మిట్లు పొంది తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న బస్సుల బండారం బయటపెట్టింది. దీంతో కంగుతిన్న తెలంగాణ ప్రభుత్వం.. ఆ బస్సులపై తాత్కాలికంగా నిషేధం విధించింది. అంటే ఆ బస్సులు రోడ్డెక్కితే జప్తు చేయాల్సిన బాధ్యత రవాణా శాఖ ది. కానీ రాజధాని నగరం హైదరాబాద్‌లో ఆ బస్సులు దర్జాగా ప్రయాణికులను ఎక్కించుకుని పరుగుపెడుతున్నాయి. రవాణా చట్టాల అమల్లోని డొల్లతనాన్ని అరుణాచల్‌ప్రదేశ్ బట్టబయలు చేస్తే, ఇప్పుడు మన రవాణా శాఖ ‘గుడ్డి దర్బారు’ వ్యవహారాన్ని ఆ బస్సులే బహిర్గతం చేస్తున్నాయి. ఆ బస్సులను సీజ్ చేయొద్దని, చూసీచూడనట్టు వదిలేయా లని కొందరు పెద్ద నేతలు అధికారులపై ఒత్తిడి చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో.. కొన్ని రోజులుగా అక్కడి రిజిస్ట్రేషన్‌తో ఉన్న బస్సులు యథేచ్ఛగా నడుస్తున్నాయి.
రోజూ రాత్రి 7 తర్వాత మియాపూర్, లింగంపల్లి, చందానగర్, కేపీహెచ్‌బీల నుంచి బయలుదేరుతున్నాయి. ఆంధ్ర, బెంగళూరు, షిర్డీ, ముంబై వంటి ప్రాంతాలకూ తిరుగుతున్నాయి. నిబంధనలను పాటిస్తున్నదీ లేనిదీ పరిశీలించేందుకు రవాణా శాఖ అధికారులతోపాటు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రధాన రహదారుల మీదుగా వెళ్తున్నా వాటిని ఎవరూ ఆపటం లేదు. నేతల ఒత్తిడికి తలొగ్గి అధికారులు వాటికి స్వేచ్ఛ ప్రసాదించారో, కమీషన్లకు కక్కుర్తిపడి చూడకుండా కళ్లకు గంతలు కట్టుకున్నారో తెలియటం లేదు.
రవాణా శాఖ ద్వంద్వ వైఖరి: అరుణాచల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అక్కడి కోర్టు స్టే విధించినప్పటికీ, ఇతర చట్టాలను ఉల్లంఘించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ బస్సులపై నిషేధం విధించింది. దీంతో ఇక్కడ అవి తిరిగేందుకు వీలు లేదు. ఈ విషయాన్ని రవాణా శాఖ ఉన్నతాధికారులే స్పష్టం చేస్తున్నారు. తమ బస్సులను జప్తు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ బస్సుల నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. రవాణా శాఖ అధికారులు వాటికి అనుమతి ఇవ్వటానికి నిరాకరించారు. నిషేధం విధించిన సమయంలో రోడ్లపై కనిపించిన అరుణాచల్ రిజిస్ట్రేషన్ ఉన్న బస్సులను సీజ్ చేశారు. చెక్‌పోస్టుల వద్ద జప్తు చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లోనే టికెట్లు బుక్ చేయించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నా పట్టించుకోకపోవటం రవాణా శాఖ ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. వెరసి ఆదిలో హడావుడి చేసి నిబంధనలు, చట్టాలను ఠంచన్‌గా అమలు చేస్తున్నామని చెప్పుకునేలా కఠినంగా వ్యవహరించి.. తర్వాత పాతబడి పోగానే నీరు గార్చటం పరిపాటిగా మారింది.
ఆ బస్సులకు అనుమతి లేదు
అరుణాచల్ బస్సులపై నిషేధం కొనసాగుతోంది. ఆ రిజిస్ట్రేషన్ ఉన్న బస్సులు రోడ్డెక్కటానికి కుదరదు. వాటి నుంచి పన్నులు కూడా వసూలు చేయటం లేదు. ఎలాంటి కారణాలతోనూ బస్సుల్లో ఒక్కదానికి కూడా అనుమతి మంజూరు చేయలేదు. అవి రోడ్డెక్కటం నిబంధనలకు విరుద్ధమే’
– సునీల్ శర్మ, రవాణా శాఖ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment