
సాక్షి, హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్, షీటీమ్స్, సీసీకెమెరాలు వంటివాటితో మంచి ఫలితాలతోపాటు ప్రజల అభిమానాన్ని చూరగొన్న పోలీసు శాఖ అతివకు అండగా మరో కార్యక్రమం చేపట్టింది. చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులు, మానవ అక్రమరవాణా వంటి కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐజీపీ స్వాతి లక్రా నేతృత్వంలో ‘వుమెన్ సేఫ్టీ వింగ్’ను ఏర్పాటు చేసింది. శుక్రవారం మహిళా దినోత్సవం సందర్భంగా లక్డీకాపూల్‌లోని ఈ విభాగం కార్యాలయాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కె.కవిత, డీజీపీ మహేందర్‌రెడ్డి పాల్గొంటారు. షీటీమ్స్ పోలీసులు, భరోసా కేంద్రాలు (మహిళలు, చిన్నారులకు న్యాయ, వైద్య సాయం అందించే కేంద్రాలు) ఈ విభాగం కింద ఉంటాయి. ఈ కార్యాలయంలో పనిచేసే వారిలో ఇద్దరు ఎస్పీ స్థాయి అధికారులు, నలుగురు డీఎస్పీ, ఒక ఏఎస్పీ ర్యాంకు అధికారి, ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు ఉంటారు. కార్యాలయంలోని అత్యాధునిక సదుపాయాలతో కూడిన సీసీటీఎన్‌ఎస్ (క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్) సాయంతో ప్రతీ స్టేషన్ డేటాను అనుసంధానిస్తారు. ఫలితంగా వివిధ కేసుల స్థితిగతులను సులభంగా తెలుసుకోవచ్చు. కేసుల పురోగతి, ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ కూడా రూపొందించారు. రోజూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విభాగానికి సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయన్న విషయాలను డీఎస్‌ఆర్ (డెయిలీ సిట్యువేషన్ రిపోర్ట్) ద్వారా పర్యవేక్షిస్తారు. దీంతోపాటు ప్రతీనెలా కేసులపై సమీక్ష నిర్వహిస్తారు. తద్వారా కేసులను వీలైనంత త్వరగా విచారణ జరపడం, చార్జిషీట్ దాఖలు చేయడం సాధ్యమవుతాయి. ఫలితంగా బాధితులకు సత్వర సాయం అందే వీలుంటుంది.
నేడు మహిళా ఉద్యోగులకు సెలవు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం (మార్చి 8) రాష్ట్రంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గురువారం సచివాలయంలో మహిళా ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment