జిల్లా..ఏర్పాటు పక్కా
- మెదక్ కేంద్రంగా ప్రత్యేక జిల్లా
- అరవై ఏళ్ల కల సాకారం!
- మెతుకుసీమకు పూర్వ వైభవం
- భూముల ధరలకు రెక్కలు
మెదక్ : నిజాం నవాబుల ఖిల్లాగా.. కాకతీయుల దుర్గంగా.. చారిత్రక రాజకీయాలకు కేంద్రబిందువులా నిలిచిన మెతుకుసీమ పూర్వ వైభవం సంతరించుకోనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో మెదక్ ప్రజల కలలు సాకారం కానున్నాయి. ప్రస్తుత మెదక్ జిల్లాలో సిద్దిపేట, సంగారెడ్డి కేంద్రాలుగా మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయనే సమాచారంతో మెదక్ పట్టణంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. సీఎం కేసీఆర్ 17 డిసెంబర్, 2014లో మెదక్‌లో పర్యటించినపుడు మెదక్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. అదిప్పుడు నెరవేరబోతుందన్న ఆనందం అంబ రాన్నంటుతోంది. ప్రస్తుతం మెదక్ జిల్లాలో 30,33,288 జనాభా ఉండగా, పది అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కాగా మెదక్ జిల్లాను మూడు ముక్కలు చే యడం ఖాయమని తెలుస్తోంది.
మెదక్ జిల్లాకు నడిబొడ్డున ఉంది మెదక్ పట్టణం. మం జీర నది ఒడ్డున, ప్రపంచ ప్రసిద్ధి పొందిన కరుణామయుని కోవెలకు నిలయమై, శత్రుదుర్భేద్యమైన ఖిల్లాకు నిదర్శనంగా.. సుమారు 70 వేల జనాభాతో విరాజిల్లుతోంది మెదక్ పట్టణం. నిజాం కాలంలో నాలుగు జిల్లాలకు సుభాగా ఉండేది. ప్రస్తుతం మెదక్ పేరుతో జిల్లా ఉన్నప్పటికీ సంగారెడ్డి కేంద్రంగా పాలన కొనసాగుతోంది. పాలకుల సౌకర్యం కోసమే ఈ మార్పు జరిగిందన్న ఆరోపణలున్నాయి. సుమారు 60 ఏళ్లుగా జిల్లా కేంద్రం కోసం పోరాటం జరుగుతూనే ఉంది. అప్పట్లో సామాజిక ఉద్యమకారుడు రాందాస్ మెదక్ జిల్లా కేంద్రం కోసం 40 రోజుల పాటు ఆమరణ దీక్ష చేశారు. అనంతరం మెదక్ జిల్లా కేంద్ర సాధన సమితి, రిటైర్డ్ ఉద్యోగులు, యువకులు, అడ్వకేట్లు ఉద్యమానికి ఊపిరి పోస్తూనే ఉన్నారు.
జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తాం..
24 ఏప్రిల్, 2014లో మెదక్ పట్టణానికి ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ నూటికి నూరు పాళ్లు మెదక్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తిరిగి డిసెంబర్ 2014లో మెదక్ జిల్లా కేంద్రం పక్కా అని తెలిపారు. ఈ మేరకు మెదక్ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలతో మెదక్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
భూముల ధరలకు రెక్కలు
మెదక్ కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటవుతుందన్న ప్రచారంతో పట్టణంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం మెదక్ భూముల ధరలు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ రేట్లను తలదన్నుతున్నాయి. ఇటీవల పట్టణంలోని అజంపురాలో 300 గజాల స్థలం ఏకంగా రూ.కోటి పలకడం పట్టణ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. అలాగే, ఆటోనగర్‌లో 500 గజాలు గల 4 షట్టర్లు రూ.1.22 కోట్లకు విక్రయించారు. జిల్లా కేంద్రం ఏర్పాటు ప్రకటనతో చాలామంది రియల్టర్లు పట్టణానికి దూరంగా ఉన్న బీడు భూములను కూడా కొనేసి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యుడు మెదక్ పట్టణంలో ఇల్లు కట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు.