సారథులేరీ? | TRS And Congress Have No Leaders For New Districts | Sakshi
Sakshi News home page

సారథులేరీ?

Published Sun, Apr 1 2018 11:00 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

TRS And Congress Have No Leaders For New Districts - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ కొత్త జిల్లాలకు అధ్యక్షులు లేకుండానే నెట్టుకొస్తున్నాయి. జిల్లాల పునర్విభజన జరిగిన వెంటనే బీజేపీ, వైఎస్సార్‌సీపీ, సీపీఎం నూతన జిల్లాలకు కార్యవర్గాలను ప్రకటించాయి. వరుస వలసలతో కుదేలైన టీడీపీ జిల్లా అధ్యక్షుడిని నియమించేందుకు వెనుకంజ వేస్తోంది. సంస్థాగత నిర్మాణం లేకపోవడంతో ప్రధాన రాజకీయ పార్టీల కార్యకలాపాలు మొక్కుబడిగా సాగుతున్నాయి. మరోవైపు ఆయా పార్టీల్లో లీడర్లు, కేడర్‌ కట్టు తప్పి వ్యవహరిస్తున్నా నియంత్రించే పరిస్థితి కనిపించడం లేదు.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో 2016 అక్టోబర్‌లో ఆయా జిల్లాలకు పార్టీ నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేసేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ కసరత్తు చేసింది. పటాన్‌చెరులోని ఓ ప్రైవేటు రిసార్టులో సమావేశమైన ఉమ్మడి మెదక్‌ జిల్లా నేతలు కార్యవర్గం కూర్పుపై చర్చించి జాబితాలు సిద్ధం చేశారు. కొత్త జిల్లాల అధ్యక్షుడి ఎంపిక బాధ్యతను మాత్రం పార్టీ అధినేత సీఎం కేసీఆర్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడు, కార్యవర్గం ప్రకటన వాయిదా పడుతూ వచ్చింది. 2017 మార్చిలో సభ్యత్వ సేకరణపై దృష్టి పెట్టిన టీఆర్‌ఎస్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 
సంస్థాగత నిర్మాణంలో 51శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది.

గ్రామ, మండల స్థాయి కమిటీల ఏర్పాటుతో సరిపెట్టిన అధిష్టానం జిల్లా కమిటీపై స్పష్టత ఇవ్వలేదు. ఇదిలావుంటే 2017 అక్టోబర్‌లో 66 మందితో కూడిన రాష్ట్ర కార్యవర్గాన్ని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి ఫరీదుద్దీన్, చాగన్ల నరేంద్రనాథ్‌ ప్రధాన కార్యదర్శులుగా, బక్కి వెంకటయ్య, సపాన్‌దేవ్, రాధాకృష్ణశర్మ, పన్యాల భూపతిరెడ్డి, ఫారూక్‌ హుస్సేన్, గౌటి అశోక్‌ కార్యదర్శులుగా చోటు దక్కించుకున్నారు. చాగన్ల నరేంద్రనాథ్‌కు ఉమ్మడి మెదక్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు.

పన్యాల భూపతిరెడ్డి (సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక), వేలేటి రాధాకృష్ణ శర్మ (మెదక్, నర్సాపూర్, అందోలు), ఫరీదుద్దీన్‌ (పటాన్‌చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి)కి సమన్వయ బాధ్యతలు ఇచ్చారు. నరేంద్రనాథ్‌ సహా, మిగతా నేతలెవరూ ఇప్పటి వరకు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. కాగా ఉమ్మడి మెదక్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మురళీయాదవ్‌ సంగారెడ్డి జిల్లాతో పాటు నర్సాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.

కాంగ్రెస్‌దీ అదే పరిస్థితి
ఉమ్మడి మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి వ్యవహరిస్తుండగా, కొత్త జిల్లాల్లో అధ్యక్షుల నియామకం, కమిటీల ఏర్పాటుపై టీపీసీసీ శ్రద్ధ చూపడం లేదు. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టి.జయప్రకాశ్‌రెడ్డి దాదాపు ఖరారైనా, సిద్దిపేట, మెదక్‌ జిల్లా అధ్యక్షులపై ఏకాభిప్రాయం లేక వాయిదా పడింది. రాష్ట్ర స్థాయిలో కొత్త జిల్లాల అధ్యక్షుల నియామకంపై ఎలాంటి కసరత్తు జరగకపోవడంపై కాంగ్రెస్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో జిల్లాలో జరిగిన టీపీసీసీ బస్సు యాత్రకు ఉమ్మడి మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉన్నారు.

బస్సు యాత్ర ముగిసిన తర్వాత జిల్లా అధ్యక్షుడిని ప్రకటిస్తారనే ఊహాగానాలు వినిపించినా, టీపీసీసీ నుంచి ఆ దిశగా ఎలాంటి ప్రయత్నమూ కనిపించడం లేదు. ఇక ఉమ్మడి మెదక్‌ జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా వ్యవహరించిన శశికళ యాదవరెడ్డి, జిల్లాల పునర్విభజన తర్వాత సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. రేవంత్‌రెడ్డితో పాటు మెదక్, సంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షులు బట్టి జగపతి, శశికళ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పటాన్‌చెరు జెడ్పీటీసీ సభ్యుడు శ్రీకాంత్‌గౌడ్‌ ఆసక్తి చూపుతున్నా, నియామకంపై ప్రకటన వెలువడడం లేదు.

సంస్థాగతం.. అస్తవ్యస్తం
ప్రధాన రాజకీయ పార్టీలు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో సంస్థాగత నిర్మాణం లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో సమన్వయం లేక గ్రూపులుగా కొనసాగుతున్నారు. టీఆర్‌ఎస్‌లో ఆరంభం నుంచి పనిచేస్తున్నవారు, వివిధ పార్టీల నుంచి వచ్చిన చేరిన వారి మధ్య అంతరం నెలకొంది. ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉన్న వారినే దగ్గరకు తీసుకుంటుండడంతో, మిగతా నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌లో బలమైన నాయకత్వం ఉన్న సంగారెడ్డి, జహీరాబాద్, అందోలు, నర్సాపూర్‌లో ఏకతాటిపై పని చేస్తున్నారు.

బహుళ, బలహీన నాయకత్వాలు ఉన్న నారాయణఖేడ్, పటాన్‌చెరు, మెదక్, దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్‌ నియోజకవర్గాల్లో ఎవరికి వారే రీతిలో వ్యవహరిస్తున్నారు. జిల్లా అధ్యక్షులతో పాటు కార్యవర్గాలను ప్రకటిస్తే కొంత మేర పరిస్థితి మెరుగయ్యే అవకాశాలున్నా టీపీసీసీ పట్టించుకోకపోవడంపై కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement