కొత్త జిల్లాలు.. కొత్త ఉద్యోగులు కేటాయింపు!  | Adding New Staff To New District | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లాలు.. కొత్త ఉద్యోగులు కేటాయింపు! 

Published Thu, Jun 13 2019 12:25 PM | Last Updated on Thu, Jun 13 2019 12:34 PM

Adding New Staff To New District - Sakshi

సాక్షి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్‌ జిల్లాలో జిల్లా పరిషత్‌ ఉద్యోగుల పంపకాల కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇటీవలే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను ప్రకటించడం, జిల్లా పరిషత్, మండల పరిషత్‌ పాలక మండళ్లను ఎన్నుకునే ప్రక్రియ సైతం పూర్తి కావడంతో జెడ్పీల ఉద్యోగుల పంపకాలకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత జిల్లా పరిషత్, మండల పరిషత్‌ పాలక మండళ్ల పదవీకాలం వచ్చే నెల 4న పూర్తి కానుండడంతో ఆలోగా ఉద్యోగుల పంపకాల ప్రక్రియ పూర్తికి అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగులు, మండల పరిషత్‌ ఉద్యోగులు, వారి స్థానికత, చదివిన బోనాఫైడ్‌ సర్టిఫికెట్ల ఆధారంగా కొత్త జిల్లాలకు ఉద్యోగులుగా కేటాయించనున్నారు. ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పటికే సేకరించి పంచాయతీరాజ్‌ శాఖకు అందజేశారు. బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ అందుబాటులో లేకుంటే ఉద్యోగి సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. స్థానికత ఆధారంగానే ఉద్యోగులను ఆయా జిల్లాలకు కేటాయించనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఉమ్మడి మెదక్‌లో రెండు కొత్త జిల్లాలు..
పరిపాలనా సౌలభ్యం, అధికార వికేంద్రీకరణ (సపరేషన్‌ ఆఫ్‌ పవర్స్‌) ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబరు 11న కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి సంగారెడ్డి, సిద్దిపేట కొత్త జిల్లాలుగా ఏర్పాటయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా అమీన్‌పూర్, గుమ్మడిదల, కంది, మొగుడంపల్లి, సిర్గాపూర్, వట్‌పల్లి, నాగల్‌గిద్ద మండలాలను ఏర్పాటు చేశారు. దీంతో మండలాల సంఖ్య 26కు చేరింది. వీటికి కూడా ఉద్యోగులను కేటాయించనున్నారు. అలాగే, సిద్దిపేట జిల్లా (మొత్తం మండలాలు 23)లో నారాయణరావుపేట, మర్కూక్, సిద్దిపేట అర్బన్, కొమురవెల్లి, అక్కన్నపేట, రాయపోలు మండలాలు ఏర్పాటయ్యాయి.

మెదక్‌ జిల్లా (మొత్తం మండలాలు 20)లో హవేళీఘనాపూర్, మనోహరాబాద్, నార్సింగి, చిలప్‌చెడ్, నిజాంపేట) మండలాలు ఏర్పాటయ్యాయి. ఈ రెండు జిల్లాల్లోని కొత్త మండలాలకూ ఎంపీడీఓ తదితర ముఖ్య అధికారులను కేటాయించాల్సి ఉంది. కాగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సమయంలో జిల్లా పరిషత్, మండల పరిషత్‌ విభజనను మాత్రం చేపట్టలేదు. అప్పటికే ఐదేళ్ల కాలానికి ఎన్నికైన జెడ్పీ చైర్మన్లు, మండల పరిషత్‌ల అధ్యక్షుల కాల పరిమితి ముగియకపోవడంతో న్యాయపరమైన చిక్కులు వస్తాయనే ఉద్దేశంతో అప్పట్లో వీటి విభజనకు ప్రభుత్వం సాహసించలేదు. అయితే వచ్చే నెల 4తో ప్రస్తుత జెడ్పీ, ఎంపీపీల పదవీ కాలం పూర్తి కానుంది. వచ్చే నెల నుంచి కొత్త జెడ్పీ పాలక మండళ్లు కొలువుదీరనున్నాయి. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ఉమ్మడి మెదక్‌ జెడ్పీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వచ్చే నెల నుంచి మూడు జెడ్పీల్లో పాలన ప్రారంభం కానుంది.

జెడ్పీ ఉద్యోగుల పోస్టులు–ఖాళీలు ఇలా..
ఇప్పటికిప్పుడు ఉద్యోగుల నియామకం చేపట్టే అవకాశం లేకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగులను మూడు జిల్లాలకు సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ముగ్గురు జిల్లా పరిషత్‌ సీఈఓలను నియమించనున్నారు.

ఉమ్మడి జిల్లా పరిషత్‌లో మొత్తం 46 మంది వివిధ హోదాల్లో అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో సీఈఓ, డిప్యూటీ సీఈఓ, అకౌంట్‌ ఆఫీసర్, ఐదుగురు సూపరింటెండెంట్లు పోను, ఐదుగురు సీనియర్‌ అసిస్టెంట్లకు నలుగురు పని చేస్తున్నారు. ఒక పోస్టు ఖాళీగా ఉంది.
ఇద్దరు టైపిస్టులు, 20 మంది జూనియర్‌ అసిస్టెంట్లకు గాను 17 మంది ఉండగా, 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
డ్రైవరు ఒకరు, 10 మంది ఆఫీస్‌ సబార్డినేట్, వాచ్‌మెన్లకు గాను ఏడుగురు పని చేస్తున్నారు. మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 
ఇంకా ఒకరు టైలరింగ్‌ అండ్‌ ట్రైనింగ్‌ స్టాఫ్‌ (సేవిక) పని చేస్తున్నారు. 
మండల పరిషత్‌లలో ఇలా..

  • జిల్లాలోని మండల పరిషత్‌లలో మొత్తం 562 ఉద్యోగులకు గాను 359 మంది వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. వీటిలో 203 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 
  • ఉమ్మడి జిల్లాలో 46 మంది ఎంపీడీఓలకు 30 మంది పని చేస్తున్నారు. 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 
  • పంచాయతీరాజ్‌ ఏఈలు 46 మందికి 36 మంది మాత్రమే పని చేస్తుండగా, 9 పోస్టులు ఖాళీ ఉన్నాయి. 
  • మండల విద్యాధికారులు 46 మందికి గాను 46 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 
  • ఈఓపీఆర్డీలు 46 మందికి  31 మంది విధులు నిర్వహిస్తుండగా, 15 ఖాళీలు ఉన్నాయి. 
  • సూపరింటెండెంట్లు 46 మందికి 45 మంది పనిచేస్తుండగా, 1 పోస్టు మాత్రం ఖాళీగా ఉంది. 
  • సీనియర్‌ అసిస్టెంట్లు 46 మందికి గాను 45 మంది పని చేస్తున్నారు. ఒక పోస్టు ఖాళీగా ఉంది. 
  • జూనియర్‌ అసిస్టెంట్లు 46 మందికీ అందరూ విధుల్లో ఉన్నారు. 
  • టైపిస్టులు 46 మందికి 21 మంది మాత్రమే పని చేస్తుండగా 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 
  • డ్రైవర్లు 10 పోస్టులకు గాను ముగ్గురు మాత్రమే విధుల్లో ఉన్నారు. 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 
  • ఫీస్‌ సబార్డినేట్లు 184 మందికి గాను 101 మంది పని చేస్తుండగా 83 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర పోస్టులు ఖాళీగా లేవని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. 

ఉద్యోగుల విభజనపై నేడు భేటీ
జిల్లా పరిషత్‌ల విభజన, ఉద్యోగుల కేటాయింపు, కొత్త జిల్లాలకు భవనాలను సమకూర్చడం తదితర అంశాలపై చర్చించడానికి జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారులతో (జెడ్పీ సీఈఓ) రాజధాని నగరంలో ఈ నెల 13న గురువారం సమావేశం నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఇందులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఏ జిల్లాకు ఎంత మంది ఉద్యోగులను కేటాయించాలో వివరాలు తెలిసే అవకాశం ఉంది. వచ్చే నెల మొదటి వారం నుంచి కొత్త జిల్లా పరిషత్‌లు కొలువు దీరనున్నాయి. కొత్త జిల్లాలకు పూర్తిస్థాయి సీఈఓలను కేటాయించే అవకాశం ఉంది. – టి.రవి, జెడ్పీ సీఈఓ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement