
పార్టీలకు నాయకులు కరువు
టీడీపీ వాళ్లను అరువు తీసుకెళుతున్నాయని బాబు ధ్వజం
వలసలపై ఎవరినీ విమర్శించబోనని వ్యాఖ్య
‘మిషన్ కాకతీయ’ కమీషన్లతో తమ ఎమ్మెల్యేలకు ఎర
కేసీఆర్‌పై రేవంత్, ఇతర నేతల ధ్వజం
మహబూబ్‌నగర్: సొంతంగా నాయకులను తయారు చేసుకోలేక టీడీపీ నేతలను ఇతర పార్టీలు అరువు తెచ్చుకుంటున్నాయని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఒక్కరు పోతే వంద మంది నాయకులను తయారు చేసుకునే సత్తా తమ పార్టీకి ఉందని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన టీడీపీ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. ‘తెలంగాణలో టీడీపీని దెబ్బతీసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. కొందరు నాయకులు పార్టీకి అన్యాయం చేసినా కార్యకర్తలే కాపాడుతున్నారు. సామాన్య కార్యకర్తలను ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేస్తే.. వారు పార్టీని వదలడం బాధాకరం. ఇలాంటి విషయాల్లో ఎవరినీ విమర్శించదలచుకోలేదు. మన నాయకులను వేరే పార్టీలు అరువు తెచ్చుకుంటున్నాయి. సొం తంగా నాయకులను తయారు చేసుకోలేకపోవడం వారి బలహీనత. కార్యకర్తల సహాయంతో వంద మంది నాయకులను తయారు చేసుకునే సత్తా పార్టీకి ఉంది’ అని టీడీపీ అధినేత వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలపడం టీడీపీ అభిమతం కాదని, రెండు రాష్ట్రాలను కలిపి బలమైన శక్తిగా రూపొందించాలన్నదే తన ఆశయమని చంద్రబాబు పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎస్సీలను వర్గీకరించి మాదిగలకు రిజర్వేషన్లు కల్పించినా.. తర్వాతి ప్రభుత్వాలు లోపాలను సరిచేయలేదన్నారు. రాష్ర్ట విభజన తర్వాత తెలంగాణలో మాదిగలు, ఆంధ్రప్రదేశ్‌లో మాలలు ఎక్కువగా ఉన్నందు న ఈ విషయంపై ఆలోచన చేస్తున్నట్లు తెలి పారు.అంతకుముందు శంషాబాద్ మీదుగా మహబూబ్‌నగర్ వస్తూ బుద్వేల్ వద్ద చంద్రబాబు మాట్లాడారు. తెలంగాణలో టీడీపీని నామరూపాల్లేకుండా చేయడం ఎవరితరం కాదన్నారు. ఆంధ్ర, తెలంగాణ తనకు రెండు కళ్లలాంటివని, 2019లో తెలంగాణలో టీడీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యమని పేర్కొన్నారు.
కమీషన్ల డబ్బుతో ఎమ్మెల్యేల కొనుగోలు
‘మిషన్ కాకతీయ’ కమీషన్లతో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్ కొనుగోలు చేస్తోందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. ఎన్నికల హామీల అమలులో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. టీడీపీ నుంచి వెళ్లిన నేతలతో రాజీనామాలు చేయించి తిరిగి గెలిపిస్తే రాజకీయ సన్యాసం చేస్తామని టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్ చేశారు. కాగా, రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. వందలాది మంద్రి ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణను కేసీఆర్ తన కుటుంబంతో కలిసి దోచుకుతింటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘శాసనసభలో నన్ను కళ్లలోకి కళ్లు పెట్టి సూటిగా చూడలేనోడివి... నువ్వు మా పార్టీని ఖాళీ చేస్తావా? తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని జోకుడుగాళ్లు అంటున్నరు. మందేస్తే తప్ప కాలు కదపని నువ్వు జాతిపితవా’’ అని రేవంత్ ఘాటుగా వ్యాఖ్యానించారు. పార్టీ ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, వివేక్‌గౌడ్, సాయన్న, గాంధీ, సీనియర్ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రమేశ్ రాథోడ్, నర్సిరెడ్డి కూడా ప్రసంగించారు.
ఎమ్మార్పీఎస్ రచ్చ
చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఒక్కసారిగా సభలో గందరగోళం సృష్టించారు. పోలీసుల కళ్లుగప్పి సభావేదిక సమీపానికి దూసుకొచ్చి కుర్చీలు, చెప్పులు విసిరారు. తేనెటీగలను ప్లాస్టిక్ కవర్‌లో తెచ్చి సభ మధ్యలో విడిచారు. టీడీపీ కార్యకర్తలు కూడా కుర్చీలు విసరడంతో ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలు, పోలీసులతోపాటు ఓ పత్రికా ఫొటోగ్రాఫర్‌కు గాయాలయ్యాయి. జెండాలు ఊపుతూ నిరసన తెలిపిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీలు విదిల్చి చెదరగొట్టారు.