ఆమే యజమాని!
పరిగి: తరతరాల వివక్షకు తెర పడనుంది. పితృస్వామ్య వ్యవస్థలో కొత్త శకం ఆవిష్కృతం కానుంది. శతాబ్దాలుగా పురుషాధిక్యతయే పరంపరగా సాగిన సమాజంలో మహిళకు సరికొత్త గుర్తింపు దక్కనుంది. కుటుంబ యజమానురాలిగా చరిత్రలో పేరు లిఖించుకోనున్న తరుణీ తరుణం ఆసన్నమైంది. గత ప్రభుత్వాలు పురుషులను కుటుంబ యజమానులుగా గుర్తిస్తూ రేషన్ కార్డుల అందజేయగా.. కొత్త రాష్ట్రంలో.. కొత్త సర్కారు మహిళల పేరిటఆహార భద్రతా కార్డులు అందజేయనుంది.
ఈ క్రమంలోనే వారంరోజుల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అధికార యంత్రాంగం ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. కుటుంబ యజమానుల స్థానంలో మహిళల పేర్లను చేరుస్తూ జాబితాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. మెట్టినింట ఇన్నాళ్లూ ఇల్లాలిగా.. తల్లిగా పలు పాత్రలు పోషిస్తూ వచ్చిన మహిళలు ఇకమీద అధికారికంగా కుటుంబ యజమానుల పాత్రలో ఒదిగిపోనున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో మొదటిసారిగా మహిళల పేరిట ‘ఇందిరమ్మ’ గృహాలు మంజూరు చేయగా.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ సర్కారు నిర్ణయంతో పూర్తి స్థాయిలో మహిళలు కుటుంబ యజమానుల అవతారమెత్తనున్నారు.
బియ్యంతో కలిపి మూడు సరుకులే..
అమ్మహస్తం పేరుతో గత ప్రభుత్వం సరఫరా చేసిన తొమ్మిది రకాల సరుకులకు ఇక స్వస్తి పలికారు. ప్రస్తుత ప్రభుత్వం ఒక వ్యక్తికి ఇచ్చే నాలుగు కిలోల బియ్యం స్థానంలో ఆరు కిలోలు ఇవ్వనుండగా బియ్యం తోపాటు అరకిలో చక్కెర, కిలో కందిపప్పు కలిపి మూడు రకాల సరుకులు మాత్రమే ఆహారభద్రతా పథకంలో సరఫరా చేస్తున్నారు.