
15 రోజుల్లో గొర్రెల పథకానికి సర్వే
⇒ 25 వరకు అన్ని జిల్లాలకు కేసీఆర్ కిట్లు
⇒ జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకానికి సంబం ధించి 15 రోజుల్లో గ్రామాల్లో సర్వే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వర్షాలు మొదలవగానే జూన్ 20లోగా గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 10న సీఎం కేసీఆర్ నిర్వహించే కలెక్టర్ల సమావేశానికి తగిన సమాచారంతో రావాలని సూచించారు. కలెక్టర్ల సదస్సులో సమీక్షించే అంశాలపై శుక్రవారం సచివాలయం నుంచి సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, భూసేకరణ సకాలంలో జరగకపొతే వ్యయం పెరిగే అవకాశమున్నందున ఈ అంశంపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. త్వరలో ప్రారంభించే కేసీఆర్ కిట్ల పంపిణీకి ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఈ నెల 25 లోగా కేసీఆర్ కిట్లు జిల్లా స్టోర్‌లకు చేరుకుంటాయని, ప్రతి ఆసుపత్రికి ఇవి చేరేలా చూడాలన్నారు. గర్భిణులకు అందించే ప్రోత్సాహకానికి సంబంధించి సాఫ్ట్‌వేర్ రూపొందిస్తున్నట్లు సీఎస్ చెప్పారు.
ఆసక్తిచూపే ప్రతి ఒక్కరికి గొర్రెల యూనిట్
గొల్ల, కుర్మ, యాదవ కులాల్లో 18 సంవత్సరాలు నిండి, గొర్రెల పెంపకానికి ఆసక్తి చూపే ప్రతి ఒక్కరికి యూనిట్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతమున్న సొసైటీల్లో కొత్త సభ్యుల నమోదు, కొత్త సొసైటీల ఏర్పాటు యుద్ధ ప్రాతిపదికన జరగాలని అన్నారు. సాదాబైనామాల క్రమబద్ధీకర ణకు సంబంధించిన వివరాలతో కలెక్టర్ల సదస్సుకు రావాలని సీఎస్ సూచించారు. మిషన్ భగీరథకు సంబంధించి స్థానిక కాంటాక్టర్లకు గ్రామాల్లో అంతర్గత పనుల అప్పగింత, జిల్లాల్లో పనుల పురోగతి, ప్రైవేటు వ్యక్తుల భూములలో పైపులైన్లు వేసే పనులపై సీఎం సమీక్షిస్తారని చెప్పారు.
సీఎస్‌తో పాటు ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ చందా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్. మీనా, ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.పి.ఆచార్య, సీఎంవో ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, ఆర్ధిక శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, పంచాయతీరాజ్ కమిషనర్ నీతూప్రసాద్, వైద్యశాఖ కమిషనర్ కరుణ, సెర్ప్ సీఈవో పౌసమిబసు, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా తదితరులు పాల్గొన్నారు.