మంచిర్యాల మార్కెట్‌లో బండరాళ్లతో తూకం వేస్తున్న వ్యాపారి
మంచిర్యాలక్రైం: తూనికలు, కొలతల శాఖలో మోసాలను అరికట్టే వారే లేకుండాపోయారు. ఈ శాఖలో ఉన్నతాధికారి నుంచి సిబ్బంది వరకు పోస్టులు ఖాళీగా ఉండడంతో తూకాలు, ధరల్లో మోసాలు జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లా లో అసలు ఈ శాఖ కార్యాలయం ఎక్కడుందో కూడా చాలా మందికి తెలియదంటే అతిశయోక్తి కాదు.
ఇదే అలుసుగా తీసుకుంటున్న వ్యాపారులు యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతు న్నారు. జిల్లా తూనికల శాఖలో ఒక్కో డివిజన్‌కు ఆరుగులు ఉద్యోగులు ఉండాలి. కానీ ప్రస్తుతం జిల్లా మొత్తం మీద ఆ శాఖలో ముగ్గురే పనిచేస్తుండడంతో మోసాలు పెరుగుతున్నాయి.
రెండు విభాగాలుగా దాడులు
తూనికలు, కొలతలశాఖ అధికారులు రెండు విభాగాలుగా దాడులు చేస్తారు. ఒకటి పారిశ్రామిక జోన్, రెండు కమర్షియల్ జోన్. పారిశ్రామిక జోన్‌లో పరిశ్రమలు, పెట్రోల్ బంకులు, వే బ్రిడ్జీలు, ఉత్పత్తి సంస్థలు వస్తాయి. కమర్షియల్ జోన్‌లో కిరాణా దుకాణాలు, సూపర్‌బజార్లు, చిన్నచిన్న సంస్థలు వస్తాయి.
ముఖ్యంగా ప్రజలకు ఎక్కువగా కమర్షియల్ జోన్‌తోనే సంబంధం. అయితే ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న అధికారులు పారిశ్రామిక జోన్ వ్యవహరాలపైనే దృష్టి సారిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో సామాన్యులు ప్రతీ కొనుగోలులో వ్యాపారుల చేతిలో మోసపోవాల్సి వస్తోంది.
రెండు జిల్లాలకు ఒక్కరే అధికారి
మంచిర్యాల, ఆసిఫాబాద్ రెండు జిల్లాలకు ఒక్కరే తూనికలు, కొలతలశాఖ అధికారి కావడంతో పర్యవేక్షణ కొరవడింది. ఒక్కో డివిజన్‌కు ఒక ఇన్‌స్పెక్టర్, ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లు, ఒక ల్యాబ్ అసిస్టెంట్, ఇద్దరు ఆఫీస్ సిబ్బంది ఉండాల్సి ఉండగా రెండు జిల్లాలకు కలిపి ఒక్కరే అధికారి ఉండడం గమనార్హం.
మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు, 311 గ్రామపంచాయతీ ఉన్నాయి. జిల్లాలో పారిశ్రామిక జోన్ విభాగంలో 46 పెట్రోల్ బంకులు, 15 వే బ్రిడ్జిలు సుమారు 120 వరకు ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి. కమర్షియల్ జోన్ విభాగంలో సుమారు 550 వరకు వ్యాపార దుకాణాలు ఉన్నాయి.
వీటిపై అధికారులు దాడులు చేసిన దాఖలాలు లేవు. వినియోగదారుల దినోత్సవం నిర్వహించడం అయితే ఈ శాఖ అధికారులు ఎప్పుడో మరిచిపోయారు. దీని వల్ల ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉన్నా.. సిబ్బంది కొరతతో పూర్తిగా వదిలేశారు.
కానరాని ల్యాబ్?
వ్యాపారులు చేసే ప్రతీ మోసం కంటికి కనిపిం చదు. దాన్ని శాస్త్రీయంగా పరిలిశీస్తే తప్ప వారు చేసే మోసం పసిగట్టలేం. అలాంటి తప్పులను పసిగట్టాలంటె తూనికల కొలతలశాఖకు కొన్ని కచ్చితమైన పరికరాలు, ల్యాబ్ వసతి, ఇతర యంత్రాలు ఉండాలి. ప్రస్తుతం జిల్లాలో అలాంటి యంత్రాలు, ల్యాబ్ లేవు.
ఏదో ఉదయం నుంచి సాయంత్రం వరకు సరదాగా బయటకు వెళ్లడం..రెండు కేసులు రాయడం, అందిన కాడికిదండుకోవడంతోనే సరిపెడుతున్నారు. పైగా వీరు చేసే దాడులను గోప్యంగా ఉంచుతున్నారు. ఇక కాగితాల్లో మాత్రం లెక్కలు పక్కగానే చూపిస్తున్నారు.
ఫిర్యాదులు స్వీకరించే వారేరి?
తూనికలు, కొలతలశాఖ అధికారులకు సమాచా రం ఇవ్వాలన్నా, ఫిర్యాదు చేయాలన్నా ఫోన్‌నంబర్, ఆ శాఖ కార్యాలయం ఎక్కడుందో కూడా చాలా మందికి తెలియదు. అలా తెలిసేలా ఎప్పు డూ ప్రచారం నిర్వహించిదీ లేదు.
కొద్దోగొ ప్పో చదువుకున్నవారు ఇంటర్‌నెట్‌లో ఫోన్ నంబర్ చూసి అధికారులకు సమాచారం ఇస్తున్నారు. ఫిర్యాదు చేసేందుకు కార్యాలయాన్ని వెతుక్కుంటూ వెళ్తూ అక్కడ ఎవరూ ఉండడంలేదు. ఎప్పుడు చూసినా కార్యాలయానికి తాళం వేసే ఉంటోంది.
తూకాల్లో మోసాలు
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతీ దుకా ణంలో ఎలక్ట్రానిక్ కాంటాలు వాడుతున్నారు. వీటిలో సాంకేతిక లోపాలు రావడంతో వినియోగదారులు మోసపోతున్నారు. చేతికాంటాల్లో కిలో బాట్లకు బదులు బండరాళ్లను వాడుతున్నారు. నిబందనల ప్రకారం ఏటా కాంటాలను అధికారులతో తనిఖీ చేయించి వాటిపై ముద్ర వేయిం చాలి.
కాని వ్యాపారులు ఏళ్ల తరబడి తనిఖీలు అలాగే వాడుతున్నారు. కిలోబాటు ఏడాదికి 50 గ్రాముల వరకు అరుగుదల ఉంటుంది. కాని వ్యా పారులు అదేమి పట్టించుకోవడంలేదు. దీంతో కిలోకు తూకంలో 50 గ్రాములు తేడా వస్తోంది. ఈ రకంగా వినియోగదారులు పెద్ద ఎత్తున మోసపోతున్నారు. అంతే కాకుండా కొంతమంది వ్యా పారులు వివిధ వస్తువులను ముందుగానే ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ఆ ప్యాకింగ్ కవర్లపై తయా రీ తేదీ, కంపెనీ వివరాలు పొందుపరుచడంలేదు.
సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం
సరిపడా సిబ్బంది లేక కార్యాలయానికి తాళం వేసి తనిఖీలకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలో కమర్షియల్, పారిశ్రామిక జోన్లలో తనిఖీలు చేస్తున్నాం. మార్కెట్‌లో చిన్నచిన్న కిరాణా దుకాణాల్లో కాంటాలను తనిఖీ చేసి కేసులు నమోదు చేస్తున్నాం. తూకాల్లో తేడాపై సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం.
– ఎండీ జలీల్, తూనికలు, కొలతలశాఖ మంచిర్యాల జిల్లా అధికారి
Comments
Please login to add a commentAdd a comment