- ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఆందోళనలు
- పార్టీ బలోపేతానికి మహాసభల్లో కార్యాచర ణ రూపొందిస్తాం
- ‘సాక్షి’తో సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : తెలంగాణ ఉద్యమానికి తమ పార్టీ జిల్లాలో ఊపిరిలూదిందని, ప్రత్యేక రాష్ట్ర సాధనలో తమ పాత్ర కీలకమని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి మరిన్ని ఉద్యమాలు నిర్వహిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు తెలిపారు. ఈనెల 17, 18 తేదీలలో భద్రాచలంలో పార్టీ జిల్లా మహాసభలు జరుగుతున్న సందర్భంగా ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. జిల్లా అభివృద్ధి కోసం భవిష్యత్ కార్యాచరణ, ప్రజా ఉద్యమాలను నిర్మించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
మూడు సంవత్సరాలుగా జిల్లాలో అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని కదిలించామని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్, గిరిజనులకు పోడు భూముల పట్టాలు తమ ఉద్యమ ఫలితమేనని చెప్పారు. భవిష్యత్తులోనూ ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని, ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం, గిరిజనులకు అటవీ హక్కుల చట్టం తదితర అంశాలపై పోరాడుతామని వివరించారు. అవి ఆయన మాటల్లోనే...
‘దేశవ్యాప్తంగా కార్పొరేట్ శక్తులు, బూర్జువా వర్గాలు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి పూనుకుంటున్నాయి. గత ఎన్నికల్లో వామపక్ష శక్తులు బలంగా ఉన్న చోట విపరీతంగా డబ్బు ఖర్చుచేయడంతో పాటు రకరకాల ప్రలోభాలకు పాల్పడ్డారు. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో వామపక్షాలు అగ్రభాగాన నిలవడం కొన్ని శక్తులకు, సంస్థలకు కంటగింపుగా మారింది. అందుకే వామపక్ష వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించారు.
పార్టీ బలోపేతానికి కృషి..
జిల్లాలో అన్ని మండలాల్లో సీపీఐ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి జరుగుతోంది. స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రత్యేక ఆందోళనలు చేపట్టాము. పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక వైఖరిని ప్రజలకు వివరిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం చేపట్టాల్సిన పనులు, కొత్త ప్రాజెక్టుల కోసం ప్రత్యేక ఆందోళనలు నిర్వహించడం, ప్రజల్లో రాజకీయ, సైద్ధాంతిక అవగాహన కల్పించడం ద్వారా కొద్ది రోజుల్లో పూర్వ వైభవాన్ని సాధిస్తాం...
సమస్యలపై వామపక్షాలు పోరాడుతాయి...
ఖమ్మం జిల్లా వామపక్ష ఉద్యమానికి పురిటిగడ్డ.. సైద్ధాంతికంగా కొన్ని విభేదాలున్నా సమస్యల పరిష్కారానికి కలిసి పోరాడుతున్నాము. ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో వామపక్షాలు ఐక్యంగా చేపట్టిన పలు ఆందోళనలకు ప్రజల మద్దతు లభించింది. భవిష్యత్తులో మరిన్ని ఐక్య ఉద్యమాలు నిర్మిస్తాం. ఇక ముందు కూడా ప్రధానమైన సమస్యలపై కలసి పోరాడేందుకు సీపీఐకి ఎటువంటి ఇబ్బంది లేదు. వామపక్ష ఉద్యమంలో ఎన్నికలు ఒక అంకం మాత్రమే. ప్రజా ఉద్యమాలతో ఎన్నికల ఫలితాలను పోల్చడం సరికాదు.
కాంగ్రెస్‌తో పొత్తు కలిసి రాలేదు..
2014 ఎన్నికల్లో జిల్లాలో సీపీఐకి కాంగ్రెస్‌తో పొత్తు అంతగా కలిసి రాలేదు. ఒకటి, రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల కాంగ్రెస్ శక్తులు కమ్యూనిస్టు అభ్యర్థులకు ఓట్లు వేయలేదు. దీనికితోడు మిగిలిన పార్టీలు ఎన్నడూ లేనంతగా విచ్చలవిడిగా చేసిన ఖర్చు కూడా సీపీఐ ఓటమికి కారణమైంది. మిత్రపక్షం సహకారం పూర్తిస్థాయిలో లభించకపోవడం, ఎన్నికల్లో పెరిగిన ధన ప్రభావం ఓటమికి కారణమని మా సమీక్షలో తెలిసింది.
మహాసభల్లో ప్రత్యేక కార్యాచరణ...
17 నుంచి జరిగే జిల్లా మహాసభల్లో విస్తరణ దిశగా కార్యాచరణ రూపొందిస్తాము. జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు అవకాశాలున్నాయి. ఐక్యంగా ముందుకు వెళ్లనున్నాము. జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలన్నింటిపైనా చర్చించి వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నాము. అధికార, ప్రతిపక్షాలు చేస్తున్న కార్యక్రమాలు, చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి కమ్యూనిస్టు పార్టీ మార్గంలో పయనించాలని ఆహ్వానిస్తాము. గ్రామ గ్రామాన కమ్యూనిస్టు ఉద్యమం బలోపేతం అయ్యేందుకు ఈ మహాసభలు వేదిక కానున్నాయి. జిల్లా నలుమూలల నుంచి హాజరయ్యే 600 మంది ప్రతినిధుల సలహాలు, సూచనలు స్వీకరిస్తాము.
భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు...
ప్రధానంగా పోడు భూముల సమస్య జిల్లా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోం ది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నాము. సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్‌చేస్తూ ప్రత్యేక ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తున్నాము. పారిశ్రామిక ప్రగతికి జిల్లాలో సానుకూలంగా ఉన్నందున స్థానిక వనరులకు అనుగుణంగా పరిశ్రమ లు రూపొందించాలని ఆందోళన చేపడతాము. సంక్షేమ పథకాల అమలు కోసం పోరాటాలు నిర్వహిస్తాము.ప్రజాసంఘాల బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తాము’.