జనహర్ష భూములను సర్వే చేయాలి
ఇబ్రహీంపట్నం రూరల్: జనహర్ష రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వేలాది ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్, భూదాన, పేదల భూములను ఆక్రమించి ప్రజల్ని, వినియోగదారుల్ని మోసం చేస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల పొలం, నిరుపేదలకు ఇళ్ల స్థలాల్నిస్తామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఆక్రమణదారుల నుంచి భూముల్ని స్వాధీనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాల యంలో సోమవారం ఆయన విలేకరు లతో మాట్లాడారు.
జనహర్ష రియల్ ఎస్టేట్ అధినేతలు పేదలు సాగు చేసుకునే వ్యవసాయ పొలాల్ని అనుమతుల్లేకుండా ఇష్టారాజ్యంగా కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చారని ఆరోపించారు. సుమారు 10వేల ఎకరాల భూముల్ని ఆక్రమించారన్నారు. మంచాల మండలంలోని లింగంపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోల్, పోల్కంపల్లి, నాగన్‌పల్లి, నైల్లి, సీతారాంపేట, చర్లపటేల్‌గూడ గ్రామాల్లో రైతులు సాగు చేసుకుం టున్న పొలాలపై కన్నేసి వారిని బెదిరించి కారుచౌకగా కొనుగోలు చేశారని మండిపడ్డారు. జనహర్షలో ఏ ఒక్క వెంచర్‌కూ లేఅవుట్ పర్మిషన్ లేదన్నారు. కలెక్టర్, ఆర్డీఓ ఈ భూములపై సర్వే నిర్వహించి ఆక్రమణలో ఉన్నవాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు.
తప్పుడు డాక్యుమెంట్లు..
జనహర్ష రియల్ ఎస్టేట్ సంస్థ గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వినియోగదారుల్ని మోసం చేస్తోందని పోల్కంపల్లి పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మణరావు ఆరోపిం చారు. జనహర్ష ఆగడాలను నివారించాలని ఆయన శేఖర్‌గౌడ్‌తో కలిసి చర్చిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీరి చర్యలను తప్పుబడుతూ గ్రామ పంచాయతీ అధికారులు గతంలో నోటీసులు కూడా జారీ చేసినప్పటికీ సదరు సంస్థ వినకుండా ఇష్టారాజ్యంగా తన వ్యవహారాన్ని కొనసాగిస్తోందని అన్నారు. నాగన్‌పల్లి గ్రామంలో 258, 259, 260 సర్వే నంబర్లలో గ్రామ పంచాయతీ సిబ్బంది హద్దురాళ్లను సైతం తొలగించినా వాటిని భేఖాతరు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ టౌన్ అధ్యక్షుడు ముత్యాల శ్రీహరి, నాయకులు బాబు, కృష్ణ, రాఘవేందర్, శివ తదితరులు పాల్గొన్నారు.