ఎస్సైల బదిలీలకు..పొలిటికల్ బ్రేక్
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో పోలీస్‌శాఖపై అధికార పార్టీ పెత్తనం మొదలయ్యిందా..? ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. గత నెల 4వ తేదీన జిల్లాలో 31 మంది ఎస్సైలకు బదిలీ అయ్యింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి నుంచి జిల్లాకు 11 మంది ఎస్సైలు పోస్టింగులపై వచ్చారు. తమను సంప్రదించకుండా జరిగిన ఈ బదిలీలు కుదరవని అభ్యంతరం చెప్పడంతో ఎస్సైల పోస్టింగులకు బ్రేక్ పడింది. తమకు సంబంధం లేకుండా బదిలీలపై వచ్చిన పోలీసు అధికారులను విధుల్లో చేరకుండా అడ్డుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అసలు తమకు తెలియకుండా జరిగిన బదిలీలను రద్దు చేయాలని టీఆర్‌ఎస్ నేతలు పట్టుబట్టారు. దీంతో ఆ ఉత్తర్వులను తాత్కాలికంగా అభయెన్సులో పెట్టారు. దీంతో ఆయా స్టేషన్ల ఎస్సై, సీఐల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం స్థానిక ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకోగలిగిన వారు మాత్రం డ్యూటీలో చేరిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి అంతగా లేకున్నా, అక్కడి టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు మాత్రం ప్రభావితం చేయగలుతున్నారు. మొత్తంగా జిల్లాలోని పదుల సంఖ్యలో పోలీస్‌స్టేషన్లు ఇన్‌చార్జ్‌ల ఏలుబడి కిందకు మారిపోయాయి. సైబరాబాద్ నుంచి 11 మంది ఎస్సైలకు జిల్లాలో పోస్టింగు ఇచ్చారు.
కానీ, ఇక్కడ వారు విధుల్లో చేరలేదు. ఇదే తరహాలో ఒకరిద్దరు సీఐలు సైతం గడిచిన నెల రోజులుగా విధుల్లో చేరలేకపోయారు. చౌటుప్పల్‌రూరల్ సీఐ సోమవారం విధుల్లో చేరారు. ఈ పోస్టింగు నెలరోజులుగా ఖాళీగానే ఉంది. మిర్యాలగూడ టుటౌన్ సీఐగా ఉన్న ప్రకాశ్ నెలరోజుల క్రితం బదిలీపై హైదరాబాద్‌లో ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేశారు. అప్పటి నుంచి సీఐ పోస్టు ఖాళీగానే ఉంది. ఇటీవలే సీఐగా పాండురంగారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ విధుల్లో చేరలేదు. నకిరేకల్ సీఐ పోస్టింగు సైతం ఖాళీగానే ఉంది. రాజకీయ కారణాలతోనే ఎస్సైల బదిలీలు నిలిచిపోయాయన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది. జిల్లాలోని వివిధ స్టేషన్లలో పనిచేసిన వారికి బయటి ప్రాంతాలకు బదిలీ కావడంతో వారు వెంటనే రిలీవ్ అయ్యారు. వారి స్థానంలో సైబరాబాద్, తదితర ప్రాంతాల నుంచి పోస్టింగులు పొందిన వారికేమో విధుల్లో చేరడానికి ప్రతిబంధకాలు ఎదురైనట్లు చెబుతున్నారు.
ఆయా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమకు కావాల్సిన వారికోసమే అడ్డుకున్నారన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. భూదాన్‌పోచంపల్లి పోలీస్‌స్టేషన్‌కు మొదట ఒక ఎస్సైకి పోస్టింగు ఇచ్చారు. ఆయన్ను కాదంటే మరొకరికి కూడా పోస్టింగు ఇచ్చారు. రెండో అధికారి కూడా తమక అక్కర్లేదని పట్టుబడడంతో ఖాళీగా పెట్టారు. ఇప్పుడు ఇన్‌చార్జ్ ఎస్సై అజమాయిషీలో ఈ స్టేషన్ నడుస్తోంది. అధికార పార్టీ నేతలు అభ్యంతరం పెట్టడం వల్ల బదిలీ ఉత్తర్వులను అభయెన్సులో పెట్టారని, మళ్లీ కొత్త బదిలీ ఉత్తర్వులు జారీ చేయడం కానీ, పాత ఉత్తర్వులపై అభయెన్సును ఎత్తివేస్తే కానీ ఆయా స్టేషన్లకు ఎస్సైలు వచ్చి విధుల్లో చేరేలా కనిపించడం లేదు.