సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటైన సింధు నాగరికతకు చెందిన ప్రజల గురించి మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ప్రకారం దక్షిణాసియా ప్రాంత ప్రజల్లో అత్యధికులు ఇరాన్ ప్రాంతం నుంచి రైతులని చెబుతున్నారు. ఆ కాలానికి చెందిన రాఖీగఢీ నగరం (ప్రస్తుత హరియాణా రాష్ట్రం) నుంచి సేకరించిన సుమారు 60 అస్తిపంజర నమూనాల సాయంతో జన్యు పరిశోధనలు జరపగా.. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన సీసీఎంబీ శాస్త్రవేత్త కె.తంగరాజ్ తెలిపారు.
సుమారు 5 వేల ఏళ్ల కింద ఇరాన్ ప్రాంత రైతులు తొలుత యూరప్‌వైపు వలస వెళ్లారని.. ఆ తర్వాత 1,500 సంవత్సరాల కింద తిరిగి సింధు నాగరికత ప్రాంతానికి వచ్చారని తమ పరిశోధనల ద్వారా తెలిసిందని వివరించారు. దక్షిణాసియా ప్రాంతంలోని అనేక గిరిజన తెగల ప్రజల జన్యువులు, ఇరానియన్ల జన్యువుల మధ్య సారూప్యత ఉండటానికి ఇదే కారణమని తెలిపారు. దీన్ని బట్టి దక్షిణాసియా ప్రాంతంలో వ్యవసాయాన్ని పశ్చిమ ప్రాంతాల వారు నేర్పింది కాదని కూడా తెలుస్తోందని, స్థానిక పశుకాపరులే వ్యవసాయాన్ని ప్రారంభించినట్లు అర్థమవుతోందని వివరించారు.
అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధన
సింధు నది నాగరికతతో పాటు పురాతన యుగానికి చెందిన సుమారు 524 మంది వ్యక్తుల జన్యువులను అమెరికా, యూరప్, మధ్య, దక్షిణాసియా ప్రాంత శాస్త్రవేత్తలు, సీసీఎంబీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా పరిశోధించారు. వీరి జన్యు క్రమాలను నమోదు చేసి ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని ప్రజల జన్యు క్రమాలతో పోల్చగా.. దక్షిణ, మధ్య ఆసియా ప్రాంత ప్రజల పూర్వీకుల వివరాలు కొన్ని తెలిశాయి. ఇతర చారిత్రక ఘట్టాలను కూడా పరిగణనలోకి తీసుకుని పరిశీలించగా.. యురేసియా ప్రాంతంలో ప్రజలు వేటాడటం నుంచి వ్యవసాయానికి ఎప్పుడు మళ్లారన్న అంశంతో పాటు ఇండో–యూరోపియన్ భాషల విస్తృతి ఎలా మొదలైందన్న అంశంపై స్పష్టత వచ్చింది.
యురేసియా ప్రాంత స్టెప్పీలు (సంచార తెగలు) ఇండో–యూరోపియన్ భాషలను ప్రపంచం నలుమూలలకు చేర్చారని దశాబ్దాలుగా ఉన్న స్టెప్పీ ప్రతిపాదనకు ఈ పరిశోధనలు బలం చేకూరుస్తున్నాయి. స్టెప్పీ (కుర్గాన్) హైపోథీసిస్ ప్రకారం అనటోలియా (ప్రస్తుత టర్కీ) ప్రాంత రైతులు అటు పశ్చిమ దిక్కుకు.. ఇటు తూర్పువైపూ ప్రయాణించారు. ఇందుకు తగ్గట్టుగానే దక్షిణాసియా ప్రాంత ప్రజల జన్యువుల్లో అనటోలియా ప్రాంత ప్రజలకు సంబంధించిన ఆనవాళ్లేవీ లేవని ఈ పరిశోధనల్లో పాల్గొన్న మరో శాస్త్రవేత్త హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన డేవిడ్ రీచ్ తెలిపారు. ఈ పరిశోధన వివరాలు సెల్, సైన్స్ జర్నల్స్ తాజా సంచికల్లో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment