కొత్తగూడెం(ఖమ్మం) : సింగరేణి సంస్థ ఆవిర్భావ వేడుకలను పన్నెండేళ్లుగా నిర్వహిస్తున్నారు. అయితే మూడేళ్లుగా వీటిని నామమాత్రంగా నిర్వహిస్తూ కార్మికుల్లో స్ఫూర్తిని నింపలేకపోతున్నారు. ఉత్పత్తి లక్ష్యసాధన, బడ్జెట్ సాకులతో వేడుకలను నిర్లక్ష్యం చేయడం వల్ల కార్మికులు అసంతృప్తితో ఉన్నారు. వేడుకలు ప్రారంభించిన తొలినాళ్లల్లో వందేళ్ల సింగరేణి చరిత్ర, ఆవిర్భావం, సంస్థలో బొగ్గు వెలికితీతకు వినియోగిస్తున్న అధునాతన పరికరాలు, కార్మికుల రక్షణ, సంక్షేమం కోసం యాజమాన్యం తీసుకుంటున్న చర్యలను స్టాల్స్ ద్వారా వివరించేవారు. కార్మికుల కుటుంబాలను ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసి వారిలో స్ఫూర్తిని నింపేవారు. అంతేకాకుండా సింగరేణి జ్యోతిని వారం రోజుల పాటు అన్ని ఏరియాలలో తిప్పి ఆవిర్భావ దినోత్సవ వేడుకల ముగింపు రోజు సెంట్రల్ ఫంక్షన్ నిర్వహించే వేదిక వద్దకు తీసుకొచ్చి వెలిగించేవారు.
వేడుకలకు తగ్గిన ప్రాధాన్యం
సింగరేణి చరిత్ర, కార్మికుల స్ఫూర్తిపై యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కుదించేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో కంపెనీ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లో మూడు రోజులపాటు వేడుకలు నిర్వహించేది. మూడేళ్లుగా ఉత్పత్తి లక్ష్యసాధన సాకుతో కార్మికులకు వేడుకలను దూరం చేస్తోంది. రెండేళ్లుగా ఒక్కరోజుకే వేడుకలను పరిమితం చేసింది.
నిధుల్లోనూ కోత
2003 నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 23న సింగరేణి డే వేడుకలను ఘనంగా నిర్వహింస్తోంది. అప్పట్లో కంపెనీ విస్తరించి ఉన్న అన్ని ఏరియాల్లో వేడుకలు నిర్వహించడంతోపాటు ఏడాదికి ఒక ఏరియా చొప్పున సెంట్రల్ ఫంక్షన్ చేపట్టేది. ఇందుకోసం ఏటా *15 లక్షల వరకు ఖర్చు చేసింది. మూడేళ్ల నుంచి ఈ ఖర్చును కాస్తా లక్షకు పరిమితం చేసింది. ఒక్క ఏరియాలోనే ఆవిర్భావ వేడుకలు నిర్వహించి మిగిలిన ఏరియాలలో కార్యాలయాలకే పరిమితం చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడింది. సింగరేణి సంస్థకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని వేడుకలను ఘనంగా నిర్వహిస్తుందనే నమ్మకంతో కార్మికులు, వారి కుటుంబాల సభ్యులు ఎదురుచూస్తున్నారు.
కళతప్పిన సింగరేణి డే వేడుకలు
Published Mon, Dec 8 2014 1:57 AM | Last Updated on Sun, Sep 2 2018 4:18 PM
Advertisement
Advertisement