మురిసిన నర్సక్కపల్లి
‘సిరికొండ’ సొంతూరులో సంబురాలు
పరకాల: నిన్నమొన్నటి వరకు పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలకే సుపరిచితుడైన సిరికొండ మధుసూదనాచారి నేడు తెలంగాణ రాష్ట్ర తొలిస్పీకర్‌గా అత్యున్నత పదవిని అలంకరించబోతున్నారు. తమ పల్లెబిడ్డ శాసనసభాపతిగా వ్యవహరించబోతుండడంతో పరకాల మండలంలోని నర్సక్కపల్లి మురిసిపోతోంది. గ్రామస్తులు ఆనందంతో స్వీట్లు పంపిణీ చేసి బాణసంచా కాల్చి సంబరం చేసుకున్నారు.
చారి కుటుంబ నేపథ్యం ఇదీ..
నర్సక్కపల్లికి చెందిన సిరికొండ వెంకటలక్ష్మి, వెంకటనర్సయ్య దంపతుల ఎనిమిదిమంది సంతానంలో మధుసూదనాచారి నాలుగోవాడు. తండ్రి స్వర్ణకారుడి గా కులవృత్తి చేసుకుంటూ కు టుంబాన్ని పోషించేవారు. చిన్నప్పటి నుంచే చదువులో ముం దుండే మధుసూదనాచారి ప్రతీ తరగతిలో ఫస్ట్ రావడంతో కొ డుకును ప్రోత్సహిస్తూ తండ్రి వెంకటనర్సయ్య ఉంగరం బహుమానంగా ఇచ్చేవారు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకున్న ‘సిరికొండ’ ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు పరకాలలో, డిగ్రీ వరంగల్‌లోని సీకేఎం కళాశాలలో, కేయూలో ఎంఏ పూర్తిచేశారు. అనంతరం మేనేజ్‌మెంట్ డిప్లొమాలో పీజీ చేసిన చారి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వద్ద పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేశారు.
1994లో తొలి విజయం
1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగిన చారి మాజీ మంత్రి మందాడి నర్సింహారెడ్డిపై విజయం సాధించారు. టీడీపీ చీలిక తరువాత ఎన్టీర్ టీడీపీలో చేరారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావానికి విశేష కృషి చేశారు. 2009లో భూపాలపల్లి నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన మధుసూదనాచారి ఓటమి పాలయ్యారు. అయినా పార్టీలో రాష్ట్రస్థాయిలో కీలక పదవుల్లో కొనసాగారు. రెండుసార్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు.
కేసీఆర్‌తో ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. ఆ సన్నిహితమే ఇప్పుడు ఆయనకు స్పీకర్ పదవిని కట్టబెట్టింది. స్పీకర్ పదవి కోసం పలువురి పేర్లు పరిశీలించిన సీఎం కేసీఆర్ చివరకు సిరికొండ వైపే మొగ్గుచూపారు. దీంతో ఆయన ఒక్కరితోనే నామినేషన్ వేయించి ఎన్నిక లాంఛనప్రాయం చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్‌గా నర్సక్కపల్లి బిడ్డకు అవకాశం రావడంతో గ్రామస్తులు పొంగిపోతున్నారు. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
నా శిష్యుడి ఎదుగుదల సంతోషంగా ఉంది
ఎమ్మెల్యేగా మధు ఎన్నికైనప్పుడు దగ్గరుండి అభినందించా. 1999 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కొంత బాధనిపించినా రాజకీయాల్లో రాణిస్తాడనే నమ్మకం ఉండేది. ఇంగ్లిష్‌పై పట్టున్న చారికి శాసనసభలోనే పెద్ద పదవి రావడం గొప్ప విషయం. జిల్లాలోనే ఎవరికీ ఇంతటి అరుదైన అవకాశం దక్కలేదు. చారి మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా.
- బాసాని వీరస్వామి, రిటైర్‌డ ఉపాధ్యాయుడు
పిలిచి మాట్లాడతాడు
మధు నా కళ్లముందే పెరిగాడు. పండుగలకు మా ఊరు వచ్చినప్పుడు నన్ను పిలిచి మాట్లాడతాడు. ఆయన మాటతీరు ఎంతో బాగుం టుంది. నాయనా, బాపూ అంటూ పలకరిస్తాడు. ఇప్పుడాయన కు పెద్ద పదవి రావడం ఆనందంగా ఉంది.
- కేశిరెడ్డి గోపాల్‌రెడ్డి, గ్రామస్తుడు
వచ్చేముందే ఫోన్ చేస్తాడు
చిన్నప్పటి నుంచి మధు అన్నతో కలిసి బాయిలళ్ల, చెరువులళ్ల ఈత కొట్టేది. ఊళ్లో ఆటలాడుకునేది. బాగా చదువుకున్న మధన్న పట్నం పోయిండు. ఎప్పుడైనా ఊరికి వచ్చేటప్పుడు ఫోన్ చేసి ఉండమని చెప్తాడు. పెద్ద పదవి వచ్చిదంటే చానా సంబురమైతంది. మా ఊరికి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా.
- ఆముదపు రాజీరు, బాల్యస్నేహితుడు
మా ఊరు రాష్ట్రానికి తెలిసింది
మధన్న స్పీకర్‌గా ఎన్నికవడంతో మా గ్రామం గురించి రాష్ట్రానికి తెలి సింది. గ్రామంలో అందరికీ రాజకీయాలపై అవగాహన ఉంది. తెలంగాణ రా ష్ట్రంలో మొదటి స్పీకర్‌గా సిరికొండ రికార్డు సృష్టించారు. సభను సజావుగా నడిపించి మంచి స్పీకర్‌గా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
- పాడి ప్రతాప్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకుడు