సిట్టింగ్ సీట్లకు బైబై!
- ఖైరతాబాద్, గోషామహల్‌లను వీడే యోచనలో దానం, ముఖేష్
- నాంపల్లి, ముషీరాబాద్ నుంచి పోటీ?
- అప్జల్‌సాగర్‌లో రేపు దానం కీలక సమావేశం
సాక్షి, సిటీబ్యూరో: స్థానికంగా వ్యతిరేకత.. గతం లో సహకరించిన మిత్రపక్షం దూరం కానుండ టం.. వెరసి నగర కాంగ్రెస్ పార్టీలో వీవీఐపీల పరి స్థితి డైలమాలో పడింది. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే మళ్లీ గెలవలేమన్న భయం వారిని వెంటాడుతోంది. దీంతో వారు వచ్చే ఎన్నికల్లో పక్క నియోజకవర్గాల నుండి పోటీ చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఖైరతాబాద్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దానం నాగేందర్ నాంపల్లిపై దృష్టి సారించారు.
ఈ క్రమంలో బుధవారం నాంపల్లి నియోకజవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో అఫ్జల్‌సాగర్‌లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాను ఆసిఫ్‌నగర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన కోసం పనిచేసిన వారందరినీ ఈ సమావేశానికి ఆయన ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.
ఖైరతాబాద్ నియోకజవరగలో గడిచిన ఐదేళ్లలో చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలేవీ చేపట్టకపోవటం, స్థానిక నాయకుల ప్రవర్తన పార్టీకి పూర్తి స్థాయిలో చెడ్డపేరు తేచ్చింది. దీనికి తోడు మైనారిటీ, సీమాంధ్రుల మనోభావాలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఉండటంతో దానం తనకు ఖైరతాబాద్ సురక్షితం కాదన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ముఖేష్ సైతం..
మరో తాజా మాజీ మంత్రి మూల ముఖేష్‌గౌడ్ సైతం ప్రస్తుత గోషామహల్ స్థానాన్ని వీడే అవకాశం కనిపిస్తోంది. సికింద్రాబాద్ ఎంపీ లేదా ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. గత ఐదేళ్లలో గోషామహల్ వాసులకు అందుబాటులో ఉండకపోవటం ఆయనకు మైనస్ కానుంది. దీనికితోడు గత ఎన్నికల్లో అభ్యర్థిని పోటీకి నిలపకుండా ముఖేష్‌కు సహకరించిన ఎంఐఎం, తదనంతర పరిణామాలతో ఆయన తీరుపై గుర్రుగా ఉంది.
ఈ స్థానంలో ఎంఐఎం సహకారం లేకుండా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లే దు. ఈ కారణంగానే ముఖేష్ స్థానమార్పిడికి ప్రయత్నిస్తున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఓ వైపు ఎన్నికల షెడ్యూల్ జారీ అయి పోలింగ్ గడువు ముంచుకొస్తున్నప్పటికీ ముఖేష్ నియోకజవర్గంలో కార్యకర్తలు, నాయకులకు దూరంగా ఉంటున్నారు.
అడపాదడపా ఆయన కుమారుడు విక్రమ్‌గౌడ్ కొంతమంది నాయకులను కలిసి వెళ్తున్నారు. ముఖేష్‌గౌడ్ ఆశిస్తున్నట్లుగా సికింద్రాబాద్ లోక్‌సభ లేదా ముషీరాబాద్ శాసనసభ స్థానంలో ఏదో ఒకటి తనకు కేటాయించక, గోషామహల్ స్థానం నుంచి పోటీ చేయాల్సి వస్తే, తన కుమారుడు విక్రంగౌడ్‌ను బరిలోకి దించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు సైతం అంగీకరిస్తున్నారు.