నీట మునిగిన పసి ప్రాణాలు
► ఈతకని వెళ్లి ఆరుగురు
► చిన్నారుల మృత్యువాత
► మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు
కొత్తపేట (హన్వాడ)/రఘునాథపాలెం: దాదాపుగా అందరూ పదేళ్లలోపు చిన్నారులే. ఈత సరదా వారి ప్రాణాలను బలి తీసుకుంది. ఆ చిన్నారుల తల్లిదండ్రుల జీవితాల్లో విషాదాన్ని నింపింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతిచెందగా.. ఖమ్మం జిల్లాలో ఇద్దరు అన్నదమ్ములు సహా ముగ్గురు చనిపోయారు.
ఈతకని వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం కొత్తపేటలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కర్రె రంగయ్య, చెన్నమ్మ దంపతుల కుమారులు సాయికుమార్ (10), శివకుమార్ (8) అదే గ్రామానికి చెందిన రాజు, అంజమ్మ దంపతుల కుమారుడు శివ (10).. వెంకటమ్మ కుంటతండా సమీపంలోని ఓ చిన్నపాటి కుంటలో మరో స్నేహితుడితో కలసి ఈతకు వెళ్లారు. కుంట లోతును గమనించని ఈ ముగ్గురు చిన్నారులు ఒక్కొక్కరుగా లోనికి వెళ్లి అక్కడే చిక్కుకుపోయారు. వీరితోపాటు వచ్చిన మరో స్నేహితుడు శివ భయాందోళనకు గురై ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలియజేశాడు.
వెంటనే అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు కుంటలో చిక్కుకున్న చిన్నారులను బయటికి తీశారు. అప్పటికే సాయికుమార్, శివకుమార్, శివ మృతిచెందారు. మృతుల్లో సాయికుమార్, శివకుమార్ అన్నదమ్ములు కాగా, శివ వారి బాబాయి కొడుకు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతిచెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. హన్వాడ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని మార్చురీకి తరలించారు.
ఖమ్మం జిల్లాలో చెరువులో మునిగి ముగ్గురు
ముగ్గురు చిన్నారులు చెరువులో మునిగి మృత్యువాత పడ్డ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. రఘునాథపాలెం మండలం ఈర్లపుడికి చెందిన కరీంసాహెబ్‌కు ఇద్దరు కుమారులు. బల్లేపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నాగుల్‌మీరా (12) ఏడోతరగతి, నజీర్ (9) నాలుగో తరగతి చదువుతున్నారు. చింతకాని మండలం తమ్మినేని పాలేనికి చెందిన కరీంసాహెబ్ మేనకోడలి కుమారుడు అబ్దుల్ రెహమాన్ (7) దసరా సెలవులకు ఈర్లపుడికి వచ్చాడు. కరీంసాహెబ్ బంధువు బైక్‌పై బహిర్భూమికి వెళ్తుండగా ముగ్గురు చిన్నారులు అతడి వెంట వెళ్లారు.
పంగిడి చెరువు వద్దకు చేరుకున్నాక, ఆయన బహిర్భూమికి వెళ్లగా చిన్నారులు ఆటలాడుకుంటూ పక్కనే ఉన్న చెరువులో పడి మృత్యువాత పడ్డారు. మిషన్ కాకతీయలో భాగంగా పంగిడి చెరువులో గతేడాది పనులు చేపట్టారు. చెరువులో అక్కడక్కడ గుంతలు ఉన్నాయని, ఇది గమనించని చిన్నారులు అందులో దిగి మృతి చెంది ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలిని వైరా ఎమ్మెల్యే మదన్ లాల్, డీఎస్పీ సురేశ్‌కుమార్ సందర్శించారు. మరోవైపు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని నాగులపేట గ్రామంలో స్నానానికని వెళ్లి.. నిర్మల్ జిల్లా దస్రాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్(25) గల్లంతయ్యాడు. నాగులపేట కెనాల్‌లో ప్రవాహానికి కొట్టుకుపోయాడు.
హైదరాబాద్‌లో ఇద్దరు యువకులు..
హైదరాబాద్: ఈత సరదా ఇద్దరు విద్యార్థుల ప్రాణం తీసింది. హైదరాబాద్‌లోని కై సర్‌నగర్‌కు చెందిన ఎస్.కె.సరుుద్, రహీం, అస్లాం, ఎస్.కె.యూనస్, ఎస్.కె.మహ్మద్, ఎస్.కె.సలీం దేవేందర్‌నగర్‌లోని క్వారీ గుంతలో ఈత కొట్టేందుకు ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో వెళ్లారు. వారిలో ఈత సరిగా రాని రహీం (21), అస్లాం (17)లు క్వారీగుంతలోని లోతు ప్రాంతంలోకి వెళ్లడంతో మునిగిపోయారు. తోటి స్నేహితులు ప్రయత్నించినప్పటికీ వారి ప్రాణాలు కాపాడలేకపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. రహీం, అస్లాంల మృతదేహాలను బయటకు తీయించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. రహీం బీటెక్, అస్లాం బీకాం చదువుతున్నారు.