బాలురను బలిగొన్న స్విమ్మింగ్‌పూల్‌ | Children Died In Swimming Pool In Mahabubnagar | Sakshi
Sakshi News home page

Published Sat, May 19 2018 10:16 AM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

Children Died In Swimming Pool In Mahabubnagar - Sakshi

జడ్చర్ల : అభం..శుభం తెలియని బాలురు వారు.. వేసవిలో సరదాగా ఈత నేర్చుకుందామన్న కుతూహలంతో ఇద్దరు చిన్నారులు సమీపంలోని స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్లారు.. అక్కడ తోటిపిల్లలు ఈతపడటం చూసి ఉత్సాహంతో వారు సైతం ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండానే అందులో దూకేశారు. ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉం డటంతో ఇద్దరూ మునిగిపోయి మృతిచెందారు. ఈ సంఘటన శుక్రవారం జడ్చర్ల– మహబూబ్‌నగర్‌ మధ్యలోని జాలీహిల్స్‌లో చోటుచేసుకుంది. సీఐ బాలరాజుయాదవ్‌ కథనం ప్రకారం.. మండలంలోని శంకరాయపల్లితండాకు చెందిన నరేష్‌(13), చేతన్‌(13)తోపాటు అతని తమ్ముడు వంశీలు కలిసి తండా నుంచి సమీపంలోని జాలీహిల్స్‌లోని స్విమ్మింగ్‌పూల్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఈత కొట్టేందుకు ఇద్దరికి కలిపి రూ.70 చెల్లించి నిర్వాహకులతో టికెట్లు తీసుకున్నారు. టికెట్‌ ఇచ్చిన నిర్వాహకులు బాలురను స్విమ్మింగ్‌పూల్‌లోకి అనుమతించి వారు గదిలోకి వెళ్లిపోయారు. టికెట్‌ తీసుకున్న బాలురు ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండానే స్విమ్మింగ్‌పూల్‌లోకి దిగారు. అయితే నీటిమట్టం దాదాపు ఆరడుగులపైనే ఉండడంతో నీట దిగిన బాలురు ఇద్దరూ ఈత రాకపోవడంతో మునిగిపోయారు. స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగకుండా పైన ఉన్న చేతన్‌ తమ్ముడు వంశీ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి బాలురను బయటకు తీసి ఏనుగొండ ఎస్‌వీఎస్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 

చిన్నమ్మ ఇంటికి వచ్చి.. 
నరేష్‌ శంకరాయపల్లితండాకు చెందినవాడు. ఇతని తల్లి బుజ్జి ఆశ కార్యకర్తగా పనిచేస్తుండగా తండ్రి హర్యా కావేరమ్మపేట గ్రామ పంచాయతీలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. నరేష్‌ షాద్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఏడో తరగతి పూర్తి చేశాడు. చేతన్‌ తిమ్మాజీపేట మండలం పుల్లగిరి చింతగట్టుతండాకు చెందిన సాలీ, లక్ష్మణ్ణ కుమారుడు. లక్ష్మణ్‌ కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోగా తల్లి సాలి హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి ప్రాంతంలో కూలీ పనులు చేసుకుంటూ చేతన్‌ను చదివిస్తుంది. చేతన్‌ కూడా ఏడో తరగతి పరీక్షలు రాశాడు. అయితే వేసవి సెలవులు కావడంతో చేతన్‌ శంకరాయపల్లిలో ఉంటున్న చిన్నమ్మ దగ్గరకు వచ్చాడు. చిన్నమ్మ బుజ్జి కుమారుడు నరేష్‌తో కలిసి వెళ్లి ఇద్దరూ నీటిలో మునిగిపోయి మృతిచెందారు. 

ఆదుకోవాలంటూ రాస్తారోకో.. 
బాధిత కుటుంబాలకు నిర్వాహకులు, ప్రభుత్వపరంగా ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బాధిత కుటుంబాల సభ్యులు, బంధువులు జా లీ హిల్స్‌ ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చే పట్టారు. రాస్తారోకోకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మ ల్లురవి మద్దతు పలికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, రూ.40 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చె ల్లించాలని డిమాండ్‌ చేశారు. బాధ్యతారాహిత్యం గా వ్యవహరించిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాస్తారోకోతో దాదాపు రెండుగంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. సంఘటనా స్థలానికి డీఎస్పీ భాస్కర్‌గౌడ్‌ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement