టీఆర్‌ఎస్‌లో చేరనున్న ఆరుగురు ఎమ్మెల్యేలు? | Six Congress MLAs To Join TRS Very Soon | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో చేరనున్న ఆరుగురు ఎమ్మెల్యేలు?

Published Sat, Jan 12 2019 2:22 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Six Congress MLAs To Join TRS Very Soon - Sakshi

కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఇప్పటికే డీలాపడ్డ కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. మాజీ హోంమంత్రి, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సహా ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అధికార టీఆర్‌ఎస్‌లో చేరడానికి రంగం సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. సంక్రాంతి తర్వాత ఈ చేరికలు ఉంటాయని, ఆ తరువాత మరో నలుగురైదుగురు రెండో విడతలో టీఆర్‌ఎస్‌లో చేరతారని విశ్వసనీయ సమాచారం. మొదటి విడత పార్టీలో చేరతారని భావిస్తున్న సబితా ఇంద్రారెడ్డికి రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందని, ఏ కారణం వల్ల అయినా ఆ చాన్స్‌ దక్కకపోతే ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డికి చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌ ఇస్తారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఆ స్థానం నుంచి కార్తీక్‌కు సీటు ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్నది టీఆర్‌ఎస్‌ వర్గాల నుంచి అందిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయాలని కార్తీక్‌రెడ్డి ఆశించినా పొత్తులో భాగంగా హస్తం పార్టీ ఆ సీటును టీడీపీకి కేటాయించడంతో అది సాధ్యపడలేదు. చెవేళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున కొండా విశ్వేశ్వర్‌రెడ్డికే అవకాశం దక్కుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో సబితారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే ఎల్బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం కూడా దాదాపుగా ఖాయమైందని అంటున్నారు. తన నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందేందుకు వీలుగా టీఆర్‌ఎస్‌లో చేరితే ఎలా ఉంటుందని సుధీర్‌రెడ్డి తన సన్నిహిత నేతలు, కార్యకర్తలతో ఇప్పటికే సమాలోచనలు జరిపినట్లు తెలిసింది.

‘గ్రేటర్‌’లో కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతే...!
మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, ఎల్బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరితే గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతు కానుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 24 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇటీవలి ఎన్నికల్లో కేవలం మహేశ్వరం, ఎల్బీ నగర్‌ సీట్లనే గెలుచుకోగలిగింది. ఇప్పుడు సబిత, సుధీర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడం దాదాపుగా ఖాయమైందని టీఆర్‌ఎస్‌ కీలక నేత ఒకరు శుక్రవారం ‘సాక్షి’కి చెప్పారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్‌ ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉండగా ఇప్పుడు గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం పార్టీ ఫిరాయిస్తే గ్రేటర్‌లో పార్టీ పరిస్థితి మరింతగా దిగజారుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీలో పరిణామాలు శరవేగంగా మారుతున్నా, చక్కదిద్దే బాధ్యతను ఎవరూ తీసుకోవడం లేదని ఆయన వాపోయారు. సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన వారంలోపే సీఎల్పీ నేతను ఎన్నుకునే ఆనవాయితీ ఉండగా ప్రస్తుతం నెల దాటినా కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్షం సమావేశం ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో నైరాశ్యానికి ఇదీ కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికితోడు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ టీడీపీతో పొత్తు ఉంటుందని ఢిల్లీ వర్గాలు స్పష్టం చేస్తుండటంతో కాంగ్రెస్‌ నేతలు, ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. టీడీపీతో పొత్తు శాసనసభ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతీసినా పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడం ఆవేదన కలిగిస్తోందని, ఈ కారణంగానే పార్టీ మారాలన్న ఆలోచన వస్తోందని ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు...
శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిన జిల్లా ఖమ్మం ఒక్కటే. ఈ జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు టీఆర్‌ఎస్‌లో చేరతామని కొన్ని రోజుల కిందటే వర్తమానం పంపినట్లు సమాచారం. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. వారితోపాటు నిజామాబాద్‌ జిల్లా నుంచి గెలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జె. సురేందర్‌ కూడా టీఆర్‌ఎస్‌లో చేరతారని అంటున్నారు. సురేందర్‌తో టీఆర్‌ఎస్‌ నేతలు చర్చలు జరిపారని, ఆయన చేరిక లాంఛనమేనని ఆ పార్టీ వర్గాలు ధ్రువీకరించాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement