సాక్షి నెట్‌వర్క్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, కరెంటు కోతలు వెరసి రైతు బలవన్మరణాల బలిపీఠం ఎక్కుతున్నాడు. చేతికి అందాల్సిన పంటలు ఎండు ముఖం పట్టడం, పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీరే మార్గం కనిపించక శనివారం ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం చేయగా, అందులో భార్య మృతి చెందింది. జిల్లాలోని నాగర్‌కర్నూల్ మండలం పుల్జాలకు చెందిన గోరింట్ల శ్రీశైల (30), సాంబయ్య దంపతులు మూడెకరాల్లో పత్తి సాగు చేశారు.
దీనికోసం రూ. 3.50 లక్షల అప్పు చేశారు. పంట చేతికిరాక.. అప్పులు తీరే మార్గం కనిపించక మనస్తాపానికి గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరూ ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పటించుకున్నారు. శ్రీశైల మృతి చెందగా, సాంబయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం కారేపల్లికి చెందిన రైతు రమావత్ రవి(28) తనకున్న మూడెకరాల్లో ఆరుసార్లు బోర్లు వేయగా ఐదు వట్టిపోయాయి. ఒకదాంట్లో మాత్రమే నీరు పడింది. దీంతో ఒక ఎకరానే సాగు చేశాడు. విద్యుత్ కోతల నేపథ్యంలో ఆ పంటకూ నీరందక ఎండిపోయింది. రూ.3 లక్షల వరకు అప్పు అయ్యింది.
దీంతో శుక్రవారం అర్ధరాత్రి ఉరి వేసుకున్నాడు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్‌కు చెందిన దశరథ (51) తనకున్న నాలుగెకరాల్లో సాగుచేసిన పత్తి పంట కోసం రూ.2 లక్షల అప్పు చేశాడు. దీన్ని తీర్చే దారి కనపడక చెట్టుకు ఉరి వేసుకున్నాడు. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడుకు చెందిన రైతు ఎస్‌కే ఖాజామియా(55), గీసుకొండ మండలం గట్టుకిందిపల్లెకు చెందిన రైతు పులిసారంగం(40) క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా కల్హేర్ మండలం మునిగేపల్లికి చెందిన రైతు ఎర్ర భీమయ్య (35) అప్పులు తీర్చే మార్గంలేక అక్టోబర్ 28న ఇంటి నుంచి వెళ్లి, శనివారం శవంగా కనిపించాడు. కాగా, కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో నేత కార్మికుడు ఉరగొండ మల్లేశం(55) అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.