తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంక్షోభంతోనే తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతు ఆత్మహత్యలపై సోమవారం అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగాలన్నారు. సమస్య పక్కదారి పట్టకుండా అన్ని రాజకీయ పార్టీలు దీనిపై సహకరించి..పరిష్కారం దిశగా సాగాలని కోరారు. రైతుల ఆత్మహత్య, విద్యుత్ సమస్యపై చర్చ ప్రజాస్వామ్యయుతంగా సాగాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ రావడం లేద న్నారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్‌ను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల వద్దకు రాజకీయ జేఏసీ వెళ్తుందని, సమగ్ర సర్వే జరిపి, దీనిపై అధ్యయనం చేస్తుందని తెలిపారు. గతంలో రైతులకు సంబంధించి జయతీఘోష్ ఇచ్చిన నివేదిక, రైతు సంఘాల నిజనిర్ధారణ కమిటీల నివేదికలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉన్న దృష్ట్యా ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల వినియోగాన్ని ఆపేయాలని జేఏసీ నాయకుడు రఘు డిమాండ్ చేశారు. గ్యాస్‌తో విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని, అందుకోసం రిలయన్స్ నుంచి గ్యాస్ ఇప్పించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో టీఎన్‌జీవో అధ్యక్షులు దేవిప్రసాద్, జేఏసీ నాయకులు అహ్మద్ మహ్మద్ ఖాన్, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.
కరెంటుతో ముడిపడిన రైతు ఆత్మహత్యలు
Published Mon, Nov 10 2014 2:26 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
Advertisement
Advertisement