ఎంతో హాయి సైకిల్ సవారి | Smart Bycycles In Metro Stations | Sakshi
Sakshi News home page

ఎంతో హాయి సైకిల్ సవారి

Published Thu, Nov 23 2017 9:00 AM | Last Updated on Tue, Sep 4 2018 3:39 PM

Smart Bycycles In Metro Stations - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రూట్లలో సైకిల్‌ సవారీ.. సిటీజన్లకు ఓపక్క ఆనందాన్ని పంచుతునే.. ఆరోగ్యాన్నీ అందించేలా అధికారులు చూస్తున్నారు. అందుకు అనుగుణంగా మూడు మార్గాల్లో 64 స్టేషన్ల వద్ద సైకిల్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. తొలివిడతగా మియాపూర్, జేఎన్‌టీయూ, కేపీహెచ్‌బీ, ఫోరంమాల్, హైటెక్‌సిటీ కూడలి వద్ద వీటిని ఏర్పాటు చేస్తారు. సొంత వాహనాల అవసరం లేకుండా హైదరాబాద్‌ సైక్లింగ్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వీటిని అందుబాటులోకి తేనున్నారు. తొలి అరగంటకైతే ఉచితంగానే సైకిల్‌ను తీసుకోవచ్చు. అంతకు మించితే అద్దె చెల్లించాలి. అయితే వీటి అద్దె ఎంతనేది ఇంకా నిర్ణయించలేదు.

400 స్టేషన్లు..10 వేల సైకిళ్లు..
నగరంలోని మెట్రో స్టేషన్లలో దశలవారీగా 400 సైకిల్‌ స్టేషన్లను ఏర్పాటు చేయడంతో పాటు పదివేల సైకిళ్లను ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉంచేందుకు హైదరాబాద్‌ సైక్లింగ్‌ క్లబ్, మెట్రోరైలు, యూఎన్‌ హ్యాబిటేట్‌ అనే సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం రూ.100 కోట్ల విలువైనది కావడం విశేషం.

అంతా ‘స్మార్ట్‌’గా అద్దె
సైకిల్‌ను అద్దెకు తీసుకోవాలంటే స్మార్ట్‌ఫోన్, స్వైప్‌కార్డు ఉండాల్సిందే. ఇందుకోసం ప్రత్యేకంగా స్మార్ట్‌ బైక్‌యాప్‌ను రూపొందించనున్నారు. మొబైల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేశాక.. సైకిల్‌పై ఉన్న క్యూఆర్‌కోడ్‌పై చూపిస్తే సైకిల్‌ తాళం తెరచుకుంటుంది. మరో సైకిల్‌ స్టేషన్‌లో దీన్ని అప్పగించగానే ప్రయాణించిన సమయాన్ని బట్టి అద్దె చెల్లించాలి. ఇందుకోసం మెట్రో స్టేషన్ల వద్ద స్వైప్‌ కార్డులను తీసుకోవాలి. ఆధార్, క్రెడిట్‌కార్డు వంటి వివరాలు పరిశీలించిన తరవాతనే సైక్లింగ్‌ క్లబ్‌లో సభ్యత్వం ఇస్తారు. మూడు, 6, ఏడాదిపాటు సైకిలింగ్‌ క్లబ్‌లో సభ్యత్వం తీసుకోవచ్చు.

స్మార్ట్‌ సైకిల్‌ ప్రత్యేకతలు..
అంతర్జాతీయ ప్రమాణాలు గల ఈ స్మార్ట్‌ బైక్‌ సైకిళ్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు.  
గేర్లు ఉండడం వల్ల తొక్కడం సులువు. శ్రమ అవసరం లేకుండా హాయిగా ప్రయాణించవచ్చు.
ఆడ, మగ, చిన్నారుల ఎత్తును బట్టి సీటు ఎత్తును మార్చుకోవచ్చు.  
సామగ్రి పెట్టుకోవడానికి ముందుభాగంలో లగేజీ క్యారియర్‌ ఉంటుంది.
ప్రతీ సైకిల్‌కూ క్యూఆర్‌ కోడ్, ప్రత్యేకంగా సంఖ్య కేటాయిస్తారు.
ఒక్కో సైకిల్‌ ఖరీదు రూ.70 వేలు. ఇందులో 40 శాతం కస్టమ్స్‌ డ్యూటీయే.
మౌలిక వసతులు, సాఫ్ట్‌వేర్‌ సిబ్బంది, నిర్వహణ కలిపితే ఒక్కో సైకిల్‌కు లక్ష వ్యయం అవుతుంది.
ప్రతీ సైకిల్‌ను జీపీఎస్‌ వ్యవస్థతో అనుసంధానిస్తారు.
కంట్రోల్‌ రూమ్‌ నుంచి సైకిల్‌ సంఖ్య ఆధారంగా పర్యవేక్షిస్తారు.
బేగంపేట్‌లో తాత్కాలికంగా సైకిల్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఒక్కో సైకిల్‌ ఖరీదు రూ. 70 వేలు వసతులు, నిర్వహణ వ్యయం ఒక్కో సైకిల్‌కు రూ. లక్ష

నగరానికి చేరిన స్మార్ట్‌ సైకిళ్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement