సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియా వల్ల మంచితోపాటు చెడు కూడా జరుగుతోంది. నిజానికి తప్పుడు సమాచారమే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తోంది. ఇటీవల జరుగుతున్న ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి సున్నితమైన అంశాల్లో నియంత్రణ చర్యలు చేపట్టేందుకు పోలీస్ శాఖ ప్రయత్నిస్తుంటే సోషల్ మీడియా సంస్థలు సహకరించడం లేదు. దీంతో కేసులు పెరుగుతున్నాయి.. దర్యాప్తు మాత్రం ముందుకు సాగడం లేదు.
‘బిహార్ కిడ్నాప్ గ్యాంగ్’ కలకలం
ఇటీవలి కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ‘బిహార్ కిడ్నాప్ గ్యాంగ్’ప్రచారం ప్రజలతోపాటు పోలీస్ శాఖను వణికించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎక్కడో జరిగిన దాన్ని రాష్ట్రంలో జరిగినట్లు సోషల్ మీడియాలో పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసులు భావించారు. ఇందుకోసం సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు సైబర్ క్రైమ్ పోలీసులు లేఖలు రాశారు. తొలుత ఆ వీడియో పోస్టు అయిన ఐపీ అడ్రస్ వెల్లడించాలని, ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి ప్రజలు భయాందోళనకు గురికాకుండా నియంత్రించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. అయితే ఈ విజ్ఞప్తిని రెండు ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు తిరస్కరించాయి. దీంతో పోలీస్ శాఖ ఆందోళనలో పడింది. ఇక చేసేది లేక.. ఆ వీడియో ఇక్కడిది కాదని, ఎక్కడో జరిగిందాన్ని ఇక్కడ ఆపాదించడం మంచిది కాదని ప్రజలను అప్రమత్తం చేస్తూ వస్తున్నారు.
గతంలోనూ ఇదే ధోరణి
రాష్ట్ర ముఖ్యమంత్రిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో హైదరాబాద్ నగర కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పోస్టుకు సంబంధించిన ఐపీ అడ్రస్ కావాలని, ఎవరు పోస్టు చేశారో తెలుసుకొని చర్యలు తీసుకోవాల్సి ఉందని సంబంధిత సోషల్ మీడియా సంస్థకు మెయిల్ పెట్టారు. కానీ ఆ సంస్థ పోలీస్ శాఖ విజ్ఞప్తిని తిరస్కరించింది. తాము ఐపీ అడ్రస్ వెల్లడించలేమని తేల్చిచెప్పింది. దీంతో ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక కేసు మూసివేయాల్సి వచ్చిందని నగర కమిషనరేట్ అధికారులు తెలిపారు. అలాగే నగర కమిషనరేట్ పరిధిలో ఓ యువతిని అసభ్యకర సందేశాలు, అశ్లీల ఫొటోలతో వేధిస్తున్న ఓ యువకుడిని పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నించగా.. సోషల్ మీడియా సంస్థ ఐపీ అడ్రస్ వివరాలిచ్చేందుకు వెనుకాడింది. దీంతో ఈ కేసునూ మూసివేశారు.
కేంద్ర హోంశాఖ సమన్వయం
రెండేళ్ల కిందటి వరకు ఎఫ్‌ఐఆర్ ఆధారంగా దర్యాప్తు అధికారులు కోరిననట్లుగా సోషల్ మీడియా సంస్థలు ఐపీ అడ్రస్‌లు ఇచ్చేవి. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటూ సైబర్ నేరాల నియంత్రణకు లీగల్ వింగ్‌ను ఏర్పాటుచేసింది. అన్ని రాష్ట్రా ల్లోని సైబర్ నేరాలకు సంబంధించి కావాల్సిన సోషల్ మీడియా ఐపీ అడ్రస్‌లను ఈ లీగల్ విభాగం సమన్వయం చేస్తూ వచ్చింది. కానీ కొన్ని నెలల నుంచి ఈ విభాగానికి కూడా సోషల్ మీడియా సంస్థలు ఐపీ అడ్రస్ ఇవ్వడం లేదు.
పెరిగిపోతున్న కేసులు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయి. బ్యాంకు మోసాలు, క్రెడిట్ కార్డు లూటీ, మెయిల్ హ్యాకింగ్స్, ఫోర్స్ సైట్, చైల్డ్ పోర్నోగ్రఫీ.. ఇలా అనేక రకాల సైబర్ నేరాలు ఏటా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటి నియంత్రణకు కృషి చేయాల్సిన సోషల్ మీడియా సంస్థలు దర్యాప్తు విభాగాలకు సహకరించకపోవడంపై పోలీస్ శాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది. నేరాలకు పాల్పడ్డ వారి వివరాలు మాత్రమే అడుగుతున్నామని, ఇతర సాధారణ వ్యక్తుల ఐడెంటిటీని కోరడం లేదని విన్నవించినా పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏటా వందల కేసులు పెండింగ్‌లో ఉండటం, ఆధారాల్లేక మూసివేయాల్సిన పరిస్థితి రావడంపై అధికారుల్లో ఆందోళన మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment