సాక్షి, హైదరాబాద్: సమాజహితం కోసమే బుద్ధిజం, మార్క్సిజం, అంబేడ్కరిజం పుట్టుకొచ్చాయని ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి ప్రొఫెసర్ గేబ్రియల్ డిట్రిచ్ అన్నారు. 3 సిద్ధాంతాల సారాంశం బహుజన హితమేనని పేర్కొన్నారు. శనివారం ఇక్కడ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కారల్‌మార్క్స్ 200వ జయంతి కార్యక్రమంలో ‘సమకాలీన భారతీయ సమాజంలో కారల్‌మార్క్స్ ప్రాధాన్యత’ అంశంపై డిట్రిచ్ కీలకోపన్యాసం చేశారు. పారిశ్రామిక విప్లవం అనంతరం జర్మనీలో కార్మిక ఉద్యమాలకు నాందిగా దాస్ క్యాపిటల్, కమ్యూనిస్టు మ్యానిఫెస్టో సిద్ధాంతాలను మార్క్స్ ప్రతిపాదించారని అన్నారు.
భారత పరిస్థితులకు అన్వయించడానికి అంబేడ్కర్ సిద్ధాంతాన్ని గ్రహించాలని, కుల సంఘర్షణను ప్రధానంగా తీసుకొని, మతపరమైన వివక్షను బుద్ధిజం ద్వారా పోగొట్టాలని అంబేడ్కర్ భావించారని అన్నారు. ‘సాక్షి’ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ మార్క్స్, ఎంగిల్స్ కమ్యూనిజానికి బీజాలు వేసిన ప్రాన్స్, జర్మనీ, బ్రిటన్, బ్రెజిల్ కార్మికులతో సంబంధాలు కలిగి ఉన్నారని, వారితో కలిసి జీవించి, సన్నిహితంగా మెలిగి తమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారన్నారు.
నేటికీ నూరుశాతం మార్క్సిజాన్ని అర్థం చేసుకొన్నవారు లేరన్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ బుద్ధిజం, మార్క్సిజం, అంబేడ్కరిజంలు గతిశీలమైనవన్నారు. కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, నవ తెలంగాణ పత్రిక సంపాదకుడు వీరయ్య, దళిత్ స్టడీస్ డైరెక్టర్ సత్యనారాయణ, విశ్రాంత ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు పాల్గొన్నారు.
బహుజన హితం కోసమే బుద్ధిజం, మార్క్సిజం, అంబేడ్కరిజం
Published Sun, May 6 2018 3:10 AM | Last Updated on Sun, May 6 2018 3:10 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment