సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రజల్లో రకరకాల భయాలు పెరుగుతున్నాయి. కొన్ని పరిస్థితుల్లో గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని తాజాగా ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. జనంతో కిక్కిరిసిపోయిన చోట్లు, సరైన గాలి, వెలుతురు రాని గదుల్లో కరోనా బాధితులుంటే వారి ద్వారా ఇతరులకు వైరస్ సులభంగా వ్యాపిస్తుందనే భావనను తోసిపుచ్చలేమని స్పష్టం చేసింది. కరోనా సోకినా లక్షణాలు బయటకు కనిపించని అసింప్టమేటిక్ బాధితుల నుంచి కూడా వైరస్ గాలి ద్వారా సోకే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోని భయాలు, ఆందోళనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సాక్షితో సైకియాట్రిస్ట్‌లు డా. ఎమ్మెస్ రెడ్డి, డా. నిశాంత్, సైకాలజిస్ట్ డా.సి.వీరేందర్ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యాంశాలు... వారి మాటల్లోనే...
వాతావరణంలో వ్యాప్తిపై భయాలొద్దు
వాతావరణంలో ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో గాలిలో వైరస్ ఎక్కువసేపు బతికుండే అవకాశాలు లేవు. బయటకు వెళితే చాలు కరోనా వచ్చేస్తుందనే భయాలు వద్దు. అయితే మాస్క్‌లు ధరించడం, మనుషుల మధ్య దూరం, చేతులు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం మాత్రం అన్నివేళల్లో తప్పనిసరి. కోవిడ్ విస్తరిస్తున్న కొద్ది ప్రజల్లో కొత్త భయాలు, ఆదుర్దాలు పెరుగుతున్నాయి. ఈ భయాలతోనైనా మాస్క్‌లు, ఇతర జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిస్తే మంచిదే. కూరగాయలు, బయటి నుంచి తీసుకొచ్చే వస్తువులను సబ్బునీళ్లతో కడుక్కోవడం ఉత్తమం. తమకు ఈ లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తోంది, కోవిడ్ వస్తుందేమో లేక ఇప్పటికే వచ్చిందేమో నన్న భయాలు, ఆందోళనలు, అనుమానాలతో ప్రస్తుతం మమ్మల్ని స్వయంగా సంప్రదించడమో లేక ఫోన్లోనే సలహాలు, సూచనలు కోరుతున్నవారున్నారు. –డాక్టర్ ఎమ్మెస్ రెడ్డి, ప్రముఖ సైకియాట్రిస్ట్
గాలి, వెలుతురు బాగా ఉండేలా చూడాలి
ప్రజల్లో ఆరోగ్య సంబంధ ఆందోళన పెరుగుతోంది. తాజాగా గాలి నుంచి సోకుతుందేమోనన్న వార్తలతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే తప్పనిసరిగా మాస్క్, హ్యాండ్ శానిటైజేషన్, వ్యక్తుల మధ్య దూరాన్ని పాటించడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో, ఇళ్లలోనూ మంచి, గాలి వెలుతురు ఉండేట్టు చూసుకోవాలి. మనుషులు మరీ దగ్గరగా గుమికూడకుండా నోరు, ముక్కు మూసి ఉంచేలా మాస్క్‌లు ధరించాలి. ఆఫీసులు, మూసి ఉన్న ప్రాంతాలు, ఇళ్లలో గాలి బయటకు వెళ్లే అవకాశం లేని చోట్ల ఏసీలు వంటివి ఉన్న ప్రాంతాల్లో ఒకేచోట గుంపుగా చేరరాదు. కరోనా వ్యాప్తికి ముందు గొంతులో గరగరగా ఉన్నా, దగ్గు, తుమ్ము వచ్చినా కోవిడ్ వచ్చిందేమో, ఇక బతకమేమోనన్న భయంతో ఫోన్లు వచ్చేవి.
ఇప్పటికే తమకు సోకిందేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బయటికి వెళ్లి వచ్చామని, మొన్న కలిసిన వారికి పాజిటివ్ వచ్చింది వారి నుంచి మా ద్వారా ఇంట్లోవాళ్లందరికీ వస్తుందా అన్న సంశయాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా లక్షణాలున్న వారితో పాటు 30, 40 శాతం దాకా అనుమానాలు, భయాలతోనే టెస్ట్‌లు చేయించుకోవడంతో హెల్త్‌కేర్ సిస్టమ్‌పై ఒత్తిడి పెరుగుతోంది. పాజిటివ్ రాగానే ఏదో అయిపోతుందని భయపడవద్దు. ఇది తీవ్రస్థాయిలో ఉన్న వారికి మాత్రమే ప్రమాదమని గ్రహించాలి. చెస్ట్ ఎక్స్‌రే, సీటీ స్కాన్‌తోనే సివియారిటీ తెలుస్తోంది. చాలామందికి గొంతులో ఇన్ఫెక్షన్‌తోనే వైరస్ వెళ్లిపోతోంది. ఊపిరితిత్తులను చేరుకోవడం లేదు. పాజిటివ్ వచ్చినా ఏమీ కాదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అనవసర ఆందోళనలకు గురికావొద్దు.
–డాక్టర్ నిశాంత్, సైకియాట్రిస్ట్
చైతన్యపరచాలి: సైకాలజిస్ట్ డా.సి.వీరేందర్
కోవిడ్ మహమ్మారి ఆలోచనలు ప్రజలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆందోళనలకు గురిచేస్తున్నాయి. కరోనా వైరస్ కంటే దీనికి సంబంధించిన ఆలోచనలు, భయాలు వీరిని ఎక్కువగా బాధిస్తున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత ఒత్తిడికి గురికావడంతో, వారిలో మానసిక ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఈ వైరస్‌ది గాలి ద్వారా వ్యాపించే గుణం కాబట్టి తుమ్ములు, దగ్గుల ద్వారా వెలువడే తుంపర్లతో వ్యాప్తి జరుగుతోందని మాస్క్ ఇతర జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయితే బహిరంగ ప్రదేశాల్లో వైరస్ ప్రవేశించాక కాలుష్యం కారణంగా కొంతసేపు గాలిలోనే ఉండిపోయే అవకాశాలున్నాయి. సాధారణంగా ప్రజలు ముందు తమకేమీ కాదు, ఈ వైరస్ తమకు వ్యాపించదు, తనకు తప్ప ఇతరులకు వస్తుంది అనే భావనతో ‘డినయెల్ మోడ్’(తిరస్కరణ) ఉంటారు. ఒకవేళ వ్యాధి వచ్చాక కూడా అదీ తమకు రాలేదనే భ్రమల్లోనే ఉంటారు.
మొదట విదేశాల్లో వచ్చినపుడు రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉండడం, వేడి ప్రదేశం కాబట్టి భారత్‌లో రాదని అనుకున్నారు. ఆ తర్వాత ఇక్కడా రావడంతో డిప్రెషన్ మోడ్‌లోకి వెళ్లారు. ఇప్పుడు ఎట్లా వస్తుందో, ఎవరి నుంచి వస్తుందో తెలియక ‘యాక్సెప్టెన్స్ మోడ్’(అంగీకరణ)లోకి వెళ్లిపోయి, వచ్చిన దాంతో కలిసి జీవించాలన్న భావనతో చాలా మంది ఉంటున్నారు. యాక్సెప్టెన్స్ మోడ్‌లో కొందరు మరికొంత ముందుకెళ్లి వచ్చేది రాకతప్పదు అన్నట్టుగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. అయితే పాజిటివ్ వచ్చిన వారు ఏం చేయాలి ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాధి తీవ్రత పెరిగితే ఎవరిని సంప్రదించాలి? వంటి వాటితో పాటు ›ఆదుర్దా, ఆందోళనలు, అనుమానాలు దూరం చేసేందుకు ప్రజలను చైతన్యపరిచే, జాగరూకులను చేసే మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతైతే ప్రస్తుతం బాగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment