సోంపేటకు.. మళ్లీ షాకు! | Sompeta shock .. again! | Sakshi
Sakshi News home page

సోంపేటకు.. మళ్లీ షాకు!

Published Sat, Nov 29 2014 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM

సోంపేటకు.. మళ్లీ షాకు!

సోంపేటకు.. మళ్లీ షాకు!

  • ‘పచ్చ’ ప్రభుత్వం పవర్ దగారక్తమోడిన చోటే మళ్లీ
  •  థర్మల్ విద్యుత్ కేంద్రంరగులుతున్న శ్రీకాకుళం..
  •  ఉద్యమ బాట పడుతున్న జనం
  • సాక్షి, హైదరాబాద్: కలత నిద్రలో ఉన్న సోంపేటను చావు దెబ్బ తీసేందుకు సర్కారు సిద్ధమైంది. రక్తపు మరకలు మాయకముందే మరో రణాన్ని పురికొల్పే తెరచాటు వ్యూహాన్ని రచించింది. వారం పది రోజుల్లోనే గతంలో ప్రతిపాదించిన థర్మల్ ప్రాజెక్టు జీవోను రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం, జపాన్‌లో గుట్టుచప్పుడు కాకుండా అంతకంటే భారీ ప్రాజెక్టు కోసం ఒప్పందం కుదుర్చుకుంది.

    గతంలో 2,500 మెగావాట్ల ప్రాజెక్టు ప్రతిపాదనకే అక్కడ రక్తపాతం చోటు చేసుకుంది. తాజాగా చంద్రబాబు సర్కారు 4 వేల మెగావాట్ల ప్రాజెక్టు స్థాపనకు రహస్యంగా ఒప్పందాలు చేసుకుంది.  జపా న్ పర్యటనలో ఉన్న సీఎం సోంపేట మండలం బారువాలో అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

    జైకా, నెడో, జపాన్ ఆర్థిక సహకార బ్యాంకులు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు అక్కడి సంస్థ ‘సుమితొమొ’తో  ఒప్పందం జరిగిందన్న వార్తతో శ్రీకాకుళం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పేరు, ఊరు మార్చి చంద్రబాబు జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. యుద్ధానికి సిద్ధమంటూ ప్రకటించారు.  
     
    నమ్మక ద్రోహం

    శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బీలా గ్రామంలో 2008లో 2,500 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని ప్రతిపాదించారు. నాగార్జున కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ ముందుకు రావడంతో అప్పట్లో ప్రభుత్వం 973 ఎకరాలను సోంపేట బీలా ప్రాంతంలో కేటాయించింది. మరో 1500 ఎకరాలను రైతుల నుంచి సేకరించుకునేందుకు అనుమతిస్తూ 1107 జీవోను విడుదల చేసింది. దీన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు.

    ఇదే అదనుగా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆందోళనలు చేసింది. 2010లో సోంపేటలో జరిగిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పోలీసు కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. దీంతో నాగార్జున సంస్థ వెనక్కు తగ్గింది. దీన్ని టీడీపీ రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకుంది. కాల్పుల సందర్భంగా ఆ ప్రాంతానికొచ్చిన చంద్రబాబు 1107 జీవోను రద్దు చేసే వరకూ పోరాడాలని స్థానికులను పురమాయించారు. ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వస్తే జీవో రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సర్కారు ఇదే మాట చెప్పింది. ఇప్పుడు అదే ప్రాంతంలో అంతకన్నా మరింత ఎక్కువ సామర్థ్యం గల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
     
    సుమితొమొకే సర్వాధికారాలు..

    ప్రభుత్వం తాజాగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. సూపర్ క్రిటికల్ థర్మల్ ప్రాజెక్టు ఆర్థిక పెట్టుబడి మొత్తాన్ని జపాన్ సంస్థలే భరిస్తాయి. అంటే ఆ దేశానికి చెందిన సుమితొమొ సంస్థకే ప్రాజెక్టు నిర్వహణను అప్పగిస్తారు.
     
    ఆ స్థలం కాదు: ఏపీ జెన్‌కో సీఎండీ


    సుమితొమొ ఏర్పాటు చేసే థర్మల్ కేంద్రం కోసం మందస-బారువా మధ్య జాతీయ రహదారికి సమీపంలో స్థలాన్ని ఎంపిక చేశామని ఏపీ జెన్‌కో సీఎండీ విజయానంద్ తెలిపారు. సోంపేటకు దీనికి సంబంధం లేదన్నారు.
     
    దారుణం: మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్

    థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రతిపాదననే రద్దు చేస్తామన్న ప్రభుత్వం అంతకన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు కోసం ఒప్పందాలు చేసుకోవడం దారుణం. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తాం. ప్రాణాలకు తెగించి పోరాతాం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement