
అమ్మను గెంటేశారు..
సిరిసిల్ల: ‘నా వాటాలో ఏన్నాళ్లుంటావ్’ అంటూ ఓ కొడుకు కన్నతల్లిని ఇంట్లో నుంచి గెంటేసి.. తాళం వేసుకొని వెళ్లిపోయాడు. నాలుగు రోజులుగా చెట్టు కింద బతికిన 86 ఏళ్ల ఆ తల్లిని మరో కొడుకు చేర దీసినా.. ఇంట్లోకి మాత్రం రానివ్వలేదు. కుల పెద్దలను ఆశ్రయించినా.. ఆ కొడుకులు వినకపోవడంతో ప్రస్తుతం ఆరుబయట జీవనం సాగిస్తోందా తల్లి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వెలుగు చూసిన ఈ ఉదంతం వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన సామల కమలమ్మ, సిద్ధిరాములు దంపతులు. వీరికి కుమారులు మీనయ్య, శ్రీనివాస్, రమేశ్, సురేశ్, లక్ష్మీనారాయణ, కూతుళ్లు వసంత, వశ్చల ఉన్నారు.
నేత కార్మికుడైన సిద్ధిరాములు మంచి ఇల్లు కట్టుకుని.. పిల్లల పెళ్లిళ్లు చేశాడు. 12 ఏళ్ల కిందట ఆయన అనారోగ్యంతో మరణిం చాడు. అప్పట్నుంచి కమలమ్మ కొడుకులు, కూతుళ్లు ఉన్నా వాళ్ల వద్ద ఉండలేక ఒంటరిగా జీవిస్తుంది. చిన్న కిరాణా షాపు నడుపుకుంటూ ఆసరా పింఛన్, రేషన్ బియ్యంతో బతుకు సాగిస్తోంది. కాగా, తల్లిదండ్రులు సంపాదించిన సుమారు రూ.30 లక్షల విలువైన ఇంటిని కొడుకులు పంచుకున్నారు. మూడో కుమారుడు రమేశ్ భివండిలో ఉంటున్నాడు. అతడి వాటాగా వచ్చిన ఇంట్లోనే కమలమ్మ ఉంటోంది. నాలుగు రోజుల క్రితం రమేశ్ వచ్చి కమలమ్మ సామగ్రి బయట పడేసి, ఇంటికి తాళం వేసి భివండి వెళ్లిపోయాడు. కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. మిగతా కొడుకుల వద్దకు వెళ్లి.. ‘నేను ఎక్కడ ఉండాలే.. నాకు ఇంత నీడ చూపుండ్రి’ అని వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. కుల పెద్దలు జోక్యం చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది.
తలదాచుకునేందుకు నీడలేక రోడ్డు పక్కన వంట చేసుకుంటూ కనిపించగా.. స్థానికులు జోక్యం చేసుకోవడంతో రెండో కుమారుడు శ్రీనివాస్ వచ్చి తల్లిని తీసుకెళ్లినా.. ఇంట్లోకి మాత్రం రానివ్వలేదు. దీంతో ఆరుబయటనే ఆమె ఉంటోంది. ‘నా కొడుకులు యాడుంటవని అంటున్నరు.. కాళ్లు కాలుతున్నయి.. గాలి వత్తలేదు.. నాలుగు రోజులు బతికే ముసలిదాన్ని.. ఎవరూ పట్టించుకుంటలేరు.. ఇప్పుడు వాళ్లకు తల్లి వద్దు.. పెళ్లాలే కావాలే.. ఆ దేవునింట్ల మన్నువొయ్య.. నన్ను తీసుకపోతలేడు.. సావన్నా వత్తలేదు.. ఒంటరిగా వంట చేసుకుంటూ బతుక బుద్ధిగావట్లేదు’అని కమలమ్మ రోదించడం కలచివేసింది.