
అమ్మకు అండగా నిలవండి..
- కేటీఆర్‌ను కదిలించిన కమలమ్మ దీనగాథ
- మంత్రి ట్విట్టర్‌లో ‘సాక్షి’ కథనం
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన సామల కమలమ్మ(85) దీన గాథపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కమలమ్మకు ఐదుగురు కుమారులు.. ఇద్దరు కూతుళ్లు ఉన్నా.. నిలువ నీడలేక.. కుమారుల నిర్లక్ష్యానికి గురైంది. ఈ సంఘటనపై ‘అమ్మను గెంటేశారు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మంత్రి కె. తారక రామారావు స్పందించారు. ‘సాక్షి’ కథనాన్ని తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆమెకు అండగా ఉండాలని అధికార యంత్రాంగానికి ఫోన్ చేసి ఆదేశించారు. డీఆర్వో జీవీ శ్యామ్‌ప్రసాద్‌లాల్ వెంటనే కమలమ్మతో మాట్లాడి ఆమెతో ఫిర్యాదు స్వీకరించారు.
అమ్మను గెంటేశారు..
ఆమె కుమారులు ఐదుగురికీ సోమవారం నోటీసులు జారీ చేశారు. కమలమ్మతో జిల్లా సంక్షేమాధికారి (డీడబ్ల్యూవో) సరస్వతి మాట్లాడారు. మూడో కుమారుడు శ్రీనివాస్ వద్ద కమలమ్మ ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆర్‌ఐ రాజేంద్రప్రసాద్ కమలమ్మ ఇంటికి వెళ్లి పండ్లు అందించారు. భీవండిలో ఉండే కుమారుడు రమేశ్‌తో రెవెన్యూ అధికారులు ఫోన్‌లో మాట్లాడా రు. బుధవారం సిరిసిల్లకు వచ్చేందుకు రమేశ్ అంగీకరించాడు. జిల్లా అధికారుల సమక్షంలో కమలమ్మ కొడుకులకు కౌన్సెలింగ్ నిర్వహించి.. ఆమెకు నీడ కల్పించేలా చర్యలు తీసుకుంటామని డీఆర్వో శ్యామ్‌ప్రసాద్‌లాల్ తెలిపారు. కన్నతల్లిని పోషించకుంటే కొడుకులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కాగా, ఐదుగురు కొడుకులతోపాటు తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని, ఎవరూ సాదకున్నా సచ్చేంత వరకు తానే వండుకుని తింటానని కమలమ్మ తెలిపింది.