పరిగి: ఖైదీలు ప్రతిఒక్కరూ చదువుకోవాలని ఎస్పీ అన్నపూర్ణ సూచించారు. శుక్రవారం రాత్రి ఆమె పరిగి సబ్‌జైల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలతో ఆమె మాట్లాడారు. జైలులో అందుతున్న సదుపాయాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ఆమె ఖైదీలకు పలకలు, నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ అన్నపూర్ణ మాట్లాడుతూ.. ఖైదీలు ప్రతిఒక్కరూ విద్యావంతులు కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. చదువుకుంటేనే సమాజంలో ఏది మంచో.. ఏది చెడో తెలుసుకునే అవకాశం ఉందని చెప్పారు.
చదువు మనకు విజ్ఞానాన్ని అందజేస్తుందన్నారు. చదువుతోనే మనం నాగరికులుగా మారగలమని వివరించారు. ఈ భూ ప్రపంచంలో మిగతా ప్రాణుల మనిషిని ఉన్నతస్థాయిలో నిలిపింది చదువేనని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మనిషి విద్యావంతుడైనప్పుడు ఆత్మగౌరవం పెరుగుతుందని ఆమె వివరించారు. జైలులో ఉన్న ప్రతిఖైదీ చదువుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ అన్నపూర్ణ సూచించారు. ఇక్కడ నేర్చుకున్న చదువును తమ ఇళ్లకు వెళ్లిన తర్వాత కొనసాగించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అశ్ఫక్, ఎస్‌ఐ కృష్ణ, జైలు సూపరింటెండెంట్ తిర్మల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment