
ఎస్పీ నాగేంద్రకుమార్‌కు వీడ్కోలు
పాలమూరు: బదిలీపై హైదరాబాద్‌కు వెళ్తున్న ఎస్పీ డి.నాగేంద్రకుమార్‌కు జిల్లా ఉన్నతాధికారులు బుధవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఎస్పీగా పనిచేసిన కాలంలో వృత్తిపట్ల ప్రదర్శించిన అంకితభావాన్ని కొనియాడారు. ముఖ్యంగా పోలీసు శాఖకు చేసిన సేవలను ప్రశసించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌పరేడ్ మైదానంలో నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కొత్త ఎస్పీ శివప్రసాద్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో పోలీసుల పాత్ర ఎంతో ముఖ్యమని, జిల్లా ఎస్పీగా పనిచేసి బదిలీపై వెళ్లిన నాగేంద్రకుమార్ మాదిరిగానే, కొత్త ఎస్పీ శివప్రసాద్ కూడా శాంతి భద్రతలపై ప్రత్యేకదృష్టి సారించాలని కోరారు. జిల్లాలో ఆయన చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఈ సందర్భంగా కలెక్టర్ ప్రస్తావించారు. జేసీ ఎల్.శర్మన్ మాట్లాడుతూ.. ఎస్పీ నాగేంద్రకుమార్ పోలీసుశాఖ పరంగా చేసిన సేవలను ప్రశంసించారు.
డీఆర్వో రాంకిషన్ మాట్లాడుతూ..జిల్లాలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో నాగేంద్రకుమార్ ప్రత్యేకదృష్టి సారించారని, ముఖ్యంగా ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టిన సందర్భంలో పోలీసులను అప్రమత్తం చేసి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించారని కొనియాడారు. ఏఎస్పీ మల్లారెడ్డి, ఓఎస్‌డీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బదిలీపై వెళ్లిన నాగేంద్రకుమార్‌కు వీడ్కోలు పలుకుతూ కొత్త ఎస్పీ పి.శివప్రసాద్‌కు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పాత, కొత్త ఎస్పీలను కలెక్టర్, జేసీ, డీఆర్వోతోపాటు పోలీసుశాఖలోని వివిధ స్థాయిల అధికారులు ఘనంగా సన్మానించారు. స్వామి వివేకానంద సేవాసమితి తరఫున ఎ.నటరాజ్, రామకృష్ణ, విశ్వహిందూ పరిషత్ తరఫున పటోళ్ల లకా్ష్మరెడ్డి, ఇతర సంస్థల ప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలో డీఎస్పీలు రామేశ్వర్, కృష్ణమూర్తి, చెన్నయ్య, ద్రోణాచార్య, గోవర్ధన్, శ్రీనివాసరెడ్డి, భరత్, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.