సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డిని శాసనసభ స్పీకర్‌గా నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. బాన్సువాడ అసెంబ్లీ స్థానం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్‌రెడ్డి పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. సీనియర్ శాసనసభ్యుడిగా శ్రీనివాస్‌రెడ్డికి ఉన్న అనుభవం శాసనసభ నిర్వహణకు బాగా ఉపయోగపడుతుందని కేసీఆర్ యోచిస్తున్నారు. ఆంగ్లంపై శ్రీనివాస్‌రెడ్డికి పట్టు ఉండటంతో సభ నిర్వహణలో కూడా ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్ అధినేత ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారు. కేసీఆర్ గత ప్రభుత్వంలోనూ పోచారానికి కీలకమైన వ్యవసాయ శాఖను అప్పగించారు.
శ్రీనివాస్‌రెడ్డిని ఉన్నతమైన పదవిలో నియమించే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ రోజు దగ్గర పడుతుండటంతో కొత్త స్పీకర్ ఎన్నికపై కేసీఆర్ దృష్టి సారించారు. స్పీకర్ పదవి కోసం పోచారంతో పాటు మరో నలుగురు సీనియర్ ఎమ్మెల్యేల పేర్లను కూడా ఆయన పరిశీలిస్తున్నారు. మహిళలకు ఈ పదవిని ఇవ్వాలని భావిస్తే మెదక్ ఎమ్మెల్యే ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి, బీసీ వర్గాలకు అయితే ఈటల రాజేందర్, ఎస్సీ వర్గానికి ఇవ్వాల్సి వస్తే కొప్పుల ఈశ్వర్, ఎస్టీ వర్గం నుంచి డి.ఎస్. రెడ్యానాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, కేసీఆర్ మాత్రం పోచారం వైపే మొగ్గు చూపుతున్నారని, చివరి నిమిషంలో సమీకరణలు మారితే తప్ప శ్రీనివాస్‌రెడ్డి నియామకం ఖాయమేనని టీఆర్‌ఎస్ అధిష్టాన వర్గాలు చెబుతున్నాయి.
తాత్కాలిక స్పీకర్ నియామకం
ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌ను తాత్కాలిక స్పీకర్‌గా నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తిస్థాయి స్పీకర్ ఎన్నిక జరిగే వరకు ముంతాజ్‌ఖాన్ ఈ బాధ్యతలను నిర్వహిస్తారని, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తారని మంగళవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తాత్కాలిక స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌ను అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహచార్యులు కలసి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment