
సాక్షి, ఆదిలాబాద్ : మేడారం సమక్క, సారక్క జాతరకు ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని 6 డిపోల నుంచి 304 బస్సులను ప్రత్యేకంగా నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ అన్నారు. సోమవారం సాయంత్రం ప్రయాణ ప్రాంగణంలో ఆరు డిపోలకు సంబంధించిన అధికారులతో జాతరకు సంబంధించి బస్సుల కేటాయింపు, తదితరాలపై సమావేశమయ్యారు. గత జాతరకు 68వేల మంది భక్తులు ఆర్టీసీ సేవలు వినియోగించుకున్నారని, ఈ మేరకు 80 వేల మంది భక్తులను సరిపడా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ డిపో నుంచి 55 కేటాయించినట్లు పేర్కొన్నారు. వీటిని చెన్నూర్ నుంచి మేడారం వరకు నడపుతామన్నారు.
ఆసిఫాబాద్ నుంచి మొత్తం 65 బస్సులు కేటాయించగా.. ఆసిఫాబాద్ నుంచి 10, బెల్లంపల్లి నుంచి 55 బస్సులు నడుపుతామన్నారు. భైంసా డిపో 35 బస్సులను సిర్పూర్ నుంచి, నిర్మల్ డిపో 52 బస్సులను మందమర్రి నుంచి, మంచిర్యాల డిపో నుంచి 97 బస్సులను నడుపుతున్నామని వెల్లడించారు. ప్రైవేటు వాహనాలు ఆలయం దగ్గరకు చేర్చవని, సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఆగుతాయని, ఆర్టీసీ బస్సులైతే ఆలయం వరకూ వెళ్తాయని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. భక్తులు ఈ సదావకాశాన్ని సద్వినియోగించుకుని సమ్మక్క, సారలమ్మ కృపకు పాత్రులు కావాలన్నారు. సమావేశంలో డీవీఎం రమేశ్, డీఎం శంకర్‌రావు, పీవో విలాస్‌రెడ్డి, ఏవో బాలస్వామి, ఏఎం కల్పన, శ్రీకర్, రిజర్వేషన్ ఇన్‌చార్జి హుస్సేన్, ఆర్‌ఎం కార్యాలయ ఉద్యోగి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment