సాక్షి, హైదరాబాద్: పట్టణాల్లో పారిశుధ్యంపై ప్రత్యేకదృష్టి సారించాలని, ఇందుకోసం పారిశుధ్య సిబ్బంది, వైద్య శాఖాధికారులతో కలిసి సమన్వయం చేసుకోవాలని తమ శాఖ అధికారులకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పట్టణంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసిన నేపథ్యంలో.. ఈ సమయంలో పట్టణాల్లో ఖాళీగా ఉన్న రోడ్లపైన మరమ్మతులను వెంటనే చేపట్టాలని సూచించారు. పట్టణాల్లో ప్రస్తుతం అసంఘటిత రంగ కార్మికుల ఉపాధి అవకాశాలకు కొన్ని ఇబ్బందులు ఏర్పడటంతో రూ.5 భోజనం (అన్నపూర్ణ కౌంటర్లు) కొనసాగించాలని, ఆయా కౌంటర్ల వద్ద గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఇళ్లులేని వారిని ఆయా పట్టణాల్లోని నైట్‌షెల్టర్లకు తరలించాలని సూచించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన లేదా కరోనా వ్యాధి లక్షణాలున్న వారితో సన్నిహితంగా మెలిగి, ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్న పౌరులను ఇళ్లకే పరిమితంచేస్తూ, వారిపై నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్లను మంత్రి కోరారు. అలాగే, ఆయన పరిశ్రమలు, ఐటీ శాఖలపైనా సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖ విభాగాధిపతులతో టెలిఫోన్లో మాట్లాడారు.
ఆ ప్రాంతాల్లో నిరంతరం పారిశుధ్యం
పారిశ్రామికవాడలు, ఐటీ పార్కుల్లో నిరంతరం పారిశుధ్య పనులను కొనసాగించాలని కేటీఆర్ ఆదేశించారు. ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీలు ఈ బాధ్యతను తీసుకోవాలన్నారు. ఈ మేరకు టీఎస్‌ఐఐసీ అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. పారిశ్రామికవాడల్లో పనిచేసే కాంట్రాక్టు, రోజువారీ కూలీల వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ నియంత్రణ కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను ఉపయోగించేందుకు ముందుకురావాలని మంత్రి కేటీఆర్ కంపెనీలను కోరారు. పట్టణ ప్రజలు ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని, ఈ డిమాండ్‌కు వీలుగా బ్యాండ్‌విడ్త్‌ను పెంచాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను మంత్రి కోరారు.
వారి విషయంలో ఆలోచించండి..
లాక్‌డౌన్ నేపథ్యంలో అత్యవసర సేవలు, వివిధ రంగాల సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులు దృష్టికి వచ్చాయని, వీరి విషయంలో పోలీసులు కొంత సానుకూలంగా వ్యవహరించేలా చూడాలని హోంమంత్రి మహమూద్ అలీతో పాటు డీజీపీ మహేందర్‌రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవలు, వివిధ రంగాల సిబ్బంది మూవ్‌మెంట్ కోసం పోలీస్ సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని వారిని కోరారు. ప్రస్తుతం సమాజమంతా ఆపత్కాలంలో ఉన్నందున లాక్‌డౌన్ నిబంధనలకు ప్రజలంతా సహకరించాలని కోరారు.
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
Published Wed, Mar 25 2020 3:08 AM | Last Updated on Wed, Mar 25 2020 3:08 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment