తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
సాక్షి, హైదరాబాద్: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) లేవనెత్తిన అంశాలపై ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. తెలంగాణ రెవెన్యూ మిగులు రాష్ట్రం కాదు.. లోటు రాష్ట్రమని 2017 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరపు నివేదికలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వేలెత్తి చూపింది. పద్దుల తీరును సైతం తప్పుబట్టింది. ఏకంగా అప్పుగా తెచ్చిన నిధులను ప్రభుత్వం ఆదాయంగా చూపించిందని ఆక్షేపించింది. కాగ్ ప్రస్తావించిన అంశాలను ఆధారంగా చేసుకుని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రంగా విమర్శలకు దిగింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, అప్పుల తీరు, ఆర్థిక నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని ఎండగట్టారు. ఈ పరిస్థితులన్నీ అధికార పార్టీని కలవరపాటుకు గురి చేశాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ముగిసే ఆఖరి రోజున ప్రభుత్వం కాగ్ నివేదికలను సభ ముందుంచింది.
దీంతో కాగ్ నివేదికల్లో వెల్లడించిన అంశాలపై ప్రభుత్వం తరఫున తమ వంతు వివరణను బహిరంగంగా చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. కాగ్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న సీఎం వాస్తవానికి కాగ్ తమ ఆడిట్‌లో గుర్తించిన లోటుపాట్లు, ఆడిట్ లొసుగులేమన్నా ఉంటే ముందుగానే ఆర్థిక శాఖకు సమాచారం అందిస్తుంది. ప్రభుత్వం నుంచి తగిన వివరణను కోరుతుంది. ఇది ప్రతి ఏటా ఆనవాయితీగా జరిగే అడిటింగ్ ప్రక్రియగానే అధికార వర్గాలు భావిస్తున్నాయి. భారీగా అవినీతి అవకతవకలు జరిగినట్లు కాగ్ వేలెత్తి చూపితే తప్ప ప్రభుత్వానికి జరిగే నష్టమేమీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. కానీ తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచీ మిగులు రాష్ట్రం, ధనిక రాష్ట్రం అని ప్రభుత్వం పదే పదే చెప్పిన అంశాన్ని నీరుగార్చేలా కాగ్ వ్యాఖ్యలు చేయడాన్ని సీఎం కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. ఆర్థిక శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన ముఖ్యమంత్రి ఒక రోజంతా కాగ్ ప్రస్తావించిన అంశాలపైనే సమీక్షించారు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచీ ఆర్థిక నిర్వహణ పకడ్బందీగా ఉందని ఈ సందర్భంగా విశ్లేషించుకున్నారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించి కాగ్ ఇచ్చిన నివేదికలు.. అక్కడ జరిగిన లోటుపాట్లు.. కొన్నింటిని కాగ్ దాచిపెట్టిన తీరును సైతం ఈ సందర్భంగా సీఎం అధికారులతో చర్చించినట్లు సమాచారం.
అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి యోచన
దేశంలో గుణాత్మక మార్పు రావాలనే లక్ష్యంతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఇటీవలే పిలుపునిచ్చారు. ఈ సమయంలో కాగ్ తమ నివేదికలో వెల్లడించిన అంశాల వెనుక రాజకీయంగా తమను ఇరుకున పెట్టే ఉద్దేశమేదైనా ఉందా.. అనే కోణంలోనూ సీఎం కేసీఆర్ పార్టీ ముఖ్యులు, అధికారులతో చర్చించినట్లు సమాచారం. ఒక దశలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కాగ్ నివేదిక.. ప్రతిపక్షాల విమర్శలన్నింటినీ తిప్పి కొట్టేందుకు ముఖ్యమంత్రి సిద్ధపడ్డారు. చివరి నిమిషంలో మీడియా సమావేవానికి బదులు ఒకరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి, అందులోనే కాగ్‌పై సమగ్రంగా చర్చించే ఏర్పాట్లు చేయాలని సీఎం అభిప్రాయపడ్డట్లు తెలిసింది.
కానీ కాగ్‌పై చర్చిస్తే ఈ విషయాన్ని మరింత పెద్దగా చేసినట్లుగా ఉంటుందని, ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు సూచించినట్లు సమాచారం. మరోవైపు కొత్త ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్) రద్దు చేసే అంశంపై సీఎం ఇదే సందర్భంగా అధికారులతో చర్చించినట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన సీపీఎస్, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి మినహాయించాలని కేంద్రాన్ని కోరాలని, అందుకు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి తీర్మానం చేస్తే ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment