రెండు రాష్ట్రాలకూ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే
ప్రత్యేక రాష్ట్ర హోదా, పన్నులు మినహాయింపును రెండు రాష్ట్రాలకు ఇవ్వాలని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేక హోదా అంటూ కొంతమంది ప్రజల మధ్య గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రత్యేక హోదాకు, పన్నుల మినహాయింపు అంశానికి సంబంధం లేదని చెప్పారు. ఒకవేళ ప్రత్యేక హోదా, పన్నుల మినహాయింపు లాంటి అంశాలలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయాలని చూస్తే, పార్లమెంటులో తమ సత్తా ఏంటో చూపిస్తామని వినోద్ కుమార్ హెచ్చరించారు.