కరోనా వచ్చినా కంగారు పడలేదు! | Special Story About Australia Anzac Day | Sakshi
Sakshi News home page

కరోనా వచ్చినా కంగారు పడలేదు!

Published Sun, Apr 26 2020 4:07 AM | Last Updated on Sun, Apr 26 2020 1:56 PM

Special Story About Australia Anzac Day - Sakshi

యుద్ధ వీరులను స్మరించుకునేందుకు ఏటా ఏప్రిల్‌ 25న మెల్‌బోర్న్‌లో అంజాక్‌ దినోత్సవం ఘనంగా జరుపుతారు. అయితే లాక్‌డౌన్‌ వల్ల ఈసారి ప్రజలు ఈ ప్రాంతానికి రాకుండా ఎవరి ఇళ్ల ముందు వారు శనివారం యుద్ధ వీరులకు నివాళులు అర్పించారు.

మార్చి చివరి వారంలో ఆ దేశంలో సగటున నిత్యం నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 350.. ప్రస్తుతం ఆ సంఖ్య 15. మరికొద్ది రోజుల్లో ఆంక్షలు పూర్తిగా ఎత్తేసేందుకు అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.. ఇది 
ఆస్ట్రేలియా పరిస్థితి...

సాక్షి, హైదరాబాద్‌: ఇటలీ, స్పెయిన్, అమెరికా, యూకే.. కరోనా మారణహోమంలో సమిధలు.. ఆ జాబితాలో చేరిపోయే ప్రమాదముందని నెల రోజుల క్రితం వణికిపోయిన కంగారూల దేశం ఆస్ట్రేలియా అత్యంత వేగంగా కోలుకుంది. వైరస్‌ బారిన పడే వారి సంఖ్య పెరుగుదల వేగాన్ని కట్టడి చేసి, అనతికాలంలో బాధితులు వేగంగా కోలుకునేలా చర్యలు తీసుకుని విజయం సాధించింది. ఇక ప్రమాదం నుంచి దాదాపు బయటపడ్డట్టేనని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం కంగారూల దేశం చలికాలంలోకి ప్రవేశిస్తుండటంతో సగటు ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. ఈ క్రమంలో వైరస్‌ ధాటిని తట్టుకోవటం కష్టమన్న అభిప్రాయాలు తొలుత వ్యక్తమయ్యాయి. యూరప్‌తో పోలిస్తే ఆస్ట్రేలియాలో వైద్య సదుపాయాలు, వైద్యుల సంఖ్య తక్కువే. బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరిగితే ఇక చేతులెత్తేయటం తప్ప చేసేదేమీలేదన్న అభిప్రాయాలు వ్యక్తమైన తరుణంలో ఆ దేశం లాక్‌డౌన్‌ను నమ్ముకుని, దాన్ని పకడ్బందీగా అమలు చేయటం ద్వారా ప్రమాదం నుంచి గట్టెక్కింది. 

మన దేశమే స్ఫూర్తి..
వైరస్‌ విస్తరిస్తున్న తరుణం.. మార్చి రెండో వారం తర్వాత ఆస్ట్రేలియా అప్రమత్తమైంది. ఆ సమయంలో భారత్‌లో కొందరు ఆస్ట్రేలియా వాసులు చిక్కుకుని ఉన్నారు. వారిని రప్పించేందుకు చివరి తేదీ ప్రకటించి ఆలోగా వస్తే సరి లేకుంటే విమాన సర్వీసులుండవని తేల్చి చెప్పింది ప్రభుత్వం. అప్పటికి భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నా, ఇండియా మాత్రం ముందస్తు చర్యలు పకడ్బందీగానే ప్రారంభించింది. దీంతో కొందరు ఆస్ట్రేలియా వాసులు, యూరప్‌ పరిస్థితిని మదిలో ఉంచుకుని, ఆస్ట్రేలియా కంటే తమకు భారతే సేఫ్‌ అని, తాము ఇండియాలోనే ఉండిపోతామని పేర్కొన్నారు. ఇది ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా కూడా చర్యలకు ఉపక్రమించింది. వెరసి కరోనాను అడ్డుకునే క్రమంలో ఓ రకంగా చెప్పాలంటే ఆస్ట్రేలియాకు భారత్‌ చర్యలే స్ఫూర్తిగా నిలిచాయి. 

పూర్తి లాక్‌డౌన్‌ లేకున్నా..
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,695. ఇందులో చనిపోయింది కేవలం 80 మందే, అదే కోలుకున్నవారి సంఖ్య ఏకంగా 5,372. గత కొన్ని రోజులుగా ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ఆ దేశంలో ఎక్కువ కేసులు నమోదైంది సిడ్నీలో. ఇప్పుడు అక్కడ కూడా కొత్త కేసుల సంఖ్య అంత ఎక్కువగా నమోదు కావటం లేదు. ఇందుకు ఆ దేశ ప్రభుత్వం ఆంక్షలను కచ్చితంగా అమలు చేయటమే కారణం. మన దేశంలో పూర్తి లాక్‌డౌన్‌ అమల్లోకి తేగానే, అదే తరహా ఆంక్షల కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. కానీ ఆ దేశ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ పూర్తి లాక్‌డౌన్‌ కాకుండా, భారత్‌ తరహాలో కొన్ని ఆంక్షలను కఠినంగా అమల్లోకి తెచ్చారు.మందుల దుకాణాలు, పాలు, కూరలు, ఇతర నిత్యావసరాల కోసం ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు సంబంధిత దుకాణాలు తెరిచి ఉంటాయి. అవి మినహా మిగతావన్నీ మూసే ఉంటాయి. రెస్టారెంట్లలో కేవలం టేక్‌అవేకు మాత్రమే అనుమతి ఉంటుంది. రాత్రి 7 తర్వాత అన్నింటినీ మూసేసి రోడ్లపైకి జనాన్ని అనుమతించరు. కేసుల సంఖ్య అంతగాలేని కొన్ని ప్రాంతాలను మాత్రం దీని నుంచి మినహాయించి కొన్ని ఆంక్షలను మాత్రమే అమలు చేస్తున్నారు. ప్రజారవాణాను పూర్తిగా నిలిపేశారు. ఆంక్షలను మరింత కఠినతరం చేయటం కంటే, ఉన్నవాటిని పకడ్బందీగా అమలు చేయటమే ముఖ్యమని ఆ దేశ ప్రధాని చెప్పి.. చేసి చూపుతున్నారు.

పాజిటివ్‌ తేలితే ఇంట్లోనే చికిత్స
కరోనా పాజిటివ్‌ అని తేలినవారిలో ఆరోగ్య పరిస్థితి మామూలుగా ఉంటే వారిని ఇంట్లో ఐసోలేట్‌ చేసి ఆన్‌లైన్‌ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తూ వైద్య సాయం అందిస్తున్నారు. ఆరోగ్యం క్షీణిస్తేనే ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఆ దేశ రాజధాని కాన్‌బెర్రాలో 106 మందికి వైరస్‌ సోకగా, ప్రస్తుతం చికిత్స పొందుతోంది 8 మంది మాత్రమే. ముగ్గురు చనిపోగా మిగతా వారంతా కోలుకున్నారు. విచిత్రమేంటంటే మొత్తం బాధితుల్లో ఆసుపత్రిలో 14 మందికి మాత్రమే చికిత్స అందించారు.

ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌...
పెద్ద సూపర్‌మార్కెట్లు మినహా మిగతా చిన్నచిన్నకిరాణా షాపులకు కొనుగోలు దారులు వెళ్లకుండా కట్టడి చేశారు. కావాల్సిన వస్తువులు ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్‌ ఇస్తే దుకాణదారులు ప్యాక్‌ చేసి సిద్ధం చేస్తారు. కొనుగోలుదారులు దుకాణం ఎదుటకు రాగానే సిబ్బంది ఆ ప్యాక్‌ను వారి కారులో ఉంచుతారు. పెద్దపెద్ద సూపర్‌ మార్కెట్‌లకు మాత్రం వెళ్లొచ్చు. అయితే లోపల 8 మంది మాత్రమే ఉండాలి. వారు వెలుపలికి రాగానే అంతే సంఖ్యలో కొత్తవారు లోనికి వెళ్లాలి.

ముగ్గురు చేరితే అంతే
♦ ఒకచోట ఇద్దరు మాత్రమే ఉండేం దుకు అవకాశం కల్పించారు. మూడో వ్యక్తి చేరితే ముగ్గురికి 1,600 డాలర్లు చొప్పున పెనాల్టీ విధిస్తున్నారు. ఒకే కుటుంబ సభ్యులైతే ముగ్గురున్నా అనుమతిస్తారు. 
♦ అనవసరంగా రోడ్డుపైకి వస్తే 1,600 డాలర్ల పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. 
♦ విదేశాల నుంచి వచ్చిన వారిని స్వీయ గృహనిర్బంధం చేయించారు. వారిలో ఎవరికన్నా పాజిటివ్‌ అని తేలితే వారు కాంటాక్ట్‌ అయిన వారిని క్వారంటైన్‌ చేస్తున్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారు ఇంటి బయటకొస్తే 8 వేల డాలర్ల నుంచి 25 వేల డాలర్ల వరకు ఫైన్‌ కట్టాల్సి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది. ఫలితంగా ఒక్కరు కూడా ఆ నిబంధనను అతిక్రమించలేదు. ఒక్క పెనాల్టీ కూడా నమోదు కాలేదు. క్వారంటైన్‌లో ఉన్న అందరినీ జియో ట్యాగ్‌తో అనుసంధానించారు. వారి కదలికలను పరిశీలించేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. 
♦ ఇటీవల బ్రిస్బేన్‌లోని ఓ మైదానంలో స్థానిక భారతీయులు క్రికెట్‌ ఆడుతుంటే అధికారులు 1,600 డాలర్ల చొప్పున పెనాల్టీ విధించారు.

బడులు బంద్‌.. ఆన్‌లైన్‌లోనే చదువు
కరోనా విస్తరణ మొదలు కాగానే స్కూళ్లకు సెలవు ప్రకటించారు. కానీ విద్యార్థులు ఇళ్ల వద్ద ఉండే ఆన్‌లైన్‌ ద్వారా పాఠాలు వినాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు బడులకు వచ్చి ఆన్‌లైన్‌లో బోధిస్తున్నారు. అత్యవసర విభాగాల్లో దంపతులు పనిచేస్తుంటే, వారి పిల్లలను చూసుకునేవారు ఇళ్ల వద్ద లేని పక్షంలో వారు మాత్రం బడులకు వెళ్లే అవకాశం కల్పించారు. ఇక ఈ సమయంలో పెళ్లి చేసుకుంటే మొత్తం ఐదుగురికి మించి వేడుకలో ఉండకూడదని నిబంధన విధించారు. పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురు, ఇద్దరు సాక్షులు, ఒక ప్రీస్ట్‌కు మాత్రమే అనుమతి. ఎవరైనా మరణిస్తే మాత్రం అంత్యక్రియలకు పది మందికి అనుమతి ఇస్తున్నారు.
♦ లాక్‌డౌన్‌ వల్ల అన్ని కార్యాలయాలు మూతపడ్డాయి. ఉద్యోగులకు జీతం రావటం లేదు. అలాంటి వారికి పక్షం రోజులకు 550 డాలర్ల చొప్పున ప్రభుత్వమే చెల్లిస్తోంది. 
♦ జీతాలు లేనందున 6 నెలల వరకు ఇంటి అద్దెలు చెల్లించకున్నా ఖాళీ చేయించొద్దని యజమానులను ప్రభుత్వం ఆదేశించింది.
♦ ఆరు నెలల పాటు గృహ రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ తర్వాత వడ్డీ లేకుండా ఆ మొత్తాన్ని చెల్లించే వెసులుబాటు కల్పించింది.

ఇండియా తీరుకు ప్రశంసలు..
‘భారీ జనాభా ఉన్న చైనా విజయవంతంగా కరోనాను కట్టడి చేసింది. దీంతో తదుపరి విపరీత పరిణామాలకు 130 కోట్ల జనాభా ఉన్న ఇం డియా వేదికవుతుందన్న అభిప్రాయం వ్యక్తమైం ది. మీడియా ఇలాంటి కథనాలు ప్రసారం చేసిం ది. కానీ యూఎస్, యూరప్‌ అతలాకుతలం అవుతుండగా భారత్‌ మాత్రం ఇప్పటికీ సురక్షితంగా ఉండటాన్ని యావత్తు ఆస్ట్రేలియా మీడియా ప్రశంసిస్తోంది. ఇండియా ముందుగా మేల్కొని లాక్‌డౌన్‌ చేయటం వల్లనే ఇది సాధ్యమైందని పేర్కొంటోంది. మరికొంతకాలం భారత్‌ పకడ్బందీగా వ్యవహరిస్తే ప్రమాదం తప్పినట్టేనని అంచనా వేస్తోంది. ఆస్ట్రేలియా మాత్రం ఆంక్షలను ఏమాత్రం ఉల్లంఘనలు లేకుండా అమలు చేస్తున్నందున అనతికాలంలోనే కోలుకుంది. జనాభా తక్కువ ఉండటం కూడా దీనికో కారణం. లాక్‌డౌన్‌ ఆంక్షలు మరింత బలంగా అమలు చేయటమే భారత్‌కు శ్రీరామ రక్ష’
– మహీధర్‌రావు, ఇండిపెండెంట్‌ కన్సల్టెంట్, కాన్‌బెర్రా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement