
లక్ష్మీపురంలోని ఎత్తిపోతల పథకం
సుమారు 300 మంది రైతులు.. తలా రూ.1500 వసూలు చేసుకున్నారు. జమైన రూ.4,50,000లతో మూలన పడిన ఎత్తిపోతలకు మరమ్మతులు చేయించుకుని గోదావరి నీటిని తరలించు కుంటూ బీడు భూముల్లో సిరులు పండిస్తున్నారు.
భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం నుంచి అలువాల శ్రీనివాస్ : వారంతా చిన్న, సన్నకారు రైతులు.. పంట పొలాల్లో నీరు పారించుకునేందుకు అందరు రైతుల్లా ఏళ్ల తరబడి ప్రభుత్వ దయాదాక్షిణ్యాల కోసం ఎదురు చూడలేదు. రైతులందరూ ఒక్కటై కమిటీగా ఏర్పడి పైసాపైసా జమచేసి నిరుపయోగంగా మారిన ఎత్తిపోతల పథకానికి జీవం పోశారు. బీడువారుతున్న పొలాలకు గోదావరి నీరు పారించుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం లక్ష్మీపురం ‘నరసింహస్వామి ఎత్తిపోతల పథకం’ ఆయకట్టు రైతుల స్ఫూర్తిదాయక కథనం ఇది.
గోదావరిలో నీటి లభ్యతకు అనుగుణంగా ఇన్‌టేక్‌వెల్ నిర్మంచకపోవడంతో నీరందక పథకం ఏడాదిలోపే మూత పడింది. కాంట్రాక్టరు పట్టించుకోకపోవడంతో యంత్రాలు మూల నపడ్డాయి. పథకం తిరిగి ప్రారంభించేందుకు నిధులు కావాలంటూ ప్రజాప్రతినిధులకు రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం దక్కలేదు.
ఇదీ నేపథ్యం..
ఏటూరునాగారం మండలం లక్ష్మీపురం పరిధిలో 750 ఎకరా లకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం రూ.3.40 కోట్లతో 2007లో లక్ష్మీనర్సింహ ఎత్తిపో తల పథకం ప్రారంభించింది. నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ లక్మీపురం గ్రామ సమీపంలోని గోదావరిలో ఇన్‌టేక్ వెల్ నిర్మించి మూడు మోటార్లు ఏర్పాటు చేశారు.
కలిసికట్టుగా ముందుకు..
లక్ష్మీపురం ఎత్తిపోతల పథకం పునరు ద్ధరించాలంటూ రెండేళ్లు పాలకులను అడిగినా పట్టించుకోలేదు. దీంతో గ్రామంలోని రైతులు ఎత్తిపోతల యాజమాన్య కమిటీగా 2010లో ఏర్పడ్డారు. పథకం పరిధిలోకి వచ్చే వారంతా రూ.1500 చొప్పున కమిటీ వద్ద జమ చేశారు. సుమారు 300 మంది రైతుల నుంచి రూ.4,50,000 వసూలు చేశారు. వీటితో మూలకు పడిన మూడు 80 హార్స్‌పవర్ మోటార్లకు మరమ్మతులు చేశారు. గోదావరిలో నీటి మట్టానికి తగ్గట్టుగా కొత్తగా మరో ఇన్‌టేక్ వెల్‌ను రూ. 2.50 లక్షల వ్యయంతో నిర్మించారు. దీంతో 2010 ఖరీఫ్ సీజన్ నుంచి ప్రాజెక్టు పూర్తిగా ఉపయోగంలోకొ చ్చింది. దీంతో ఈ లక్ష్మీనర్సింహస్వా మి ఎత్తిపోతల ద్వారా సుమారు 750 ఎకరాలకు సాగు నీరు అందుతోంది.
కొత్త విద్యుత్ లైన్ కావాలి..
లక్ష్మీనర్సింహ ఎత్తిపోతల పథకంలోని మోటార్లు నిరంతరం నడవాలంటే ఎక్స్‌ప్రెస్ బ్రేకర్ విద్యుత్ లైన్ అవసరం. ప్రస్తుతం సాధారణ విద్యుత్ లైన్ ఉంది. దీనివల్ల నిత్యం సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. కొత్తలైన్ ఏర్పాటుకు మూడు లక్షల రూపాయల వ్యయం అవుతుంది. కనీసం ఈ సమస్యనైనా పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.