ఆ లైసెన్స్‌తో చిక్కితే జైలే... | Special Story On Traffic Rules And Conditions In Hyderabad | Sakshi
Sakshi News home page

పెనాల్టీ కిక్‌

Published Wed, Aug 1 2018 9:05 AM | Last Updated on Tue, Sep 4 2018 5:53 PM

Special Story On Traffic Rules And Conditions In Hyderabad - Sakshi

సిటీజనులు పాయింట్లతో పరేషాన్‌ అవుతున్నారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడితే లైసెన్స్‌ ఎక్కడ రద్దవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. నగర పోలీసులు ప్రవేశపెట్టిన ట్రాఫిక్‌ పెనాల్టీ పాయింట్ల విధానం ఫలితాలిస్తోంది. నగరవాసుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాదిలో కేవలం ముగ్గురే 12 పాయింట్ల పరిమితిని దాటడంతో వారి లైసెన్స్‌లు రద్దు చేసిన పోలీసులు... 25 స్టేషన్ల పరిధిలో ఏకంగా 4.47 లక్షల పాయింట్లు విధించారు. ఈ విధానం ప్రారంభించి బుధవారం నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 

సాక్షి, సిటీబ్యూరో: నగర రహదారులపై తీవ్రమైన ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడే వారికి పెనాల్టీ పాయింట్స్‌ విధించే ప్రక్రియ ప్రారంభమై ఏడాది పూర్తయింది. గతేడాది ఆగస్టు 1న ప్రారంభమైన ఈ విధానంలో ఇప్పటి వరకు మొత్తం 4.47 లక్షల పాయింట్లు విధించారు. ఇది పూర్తిగా సాంకేతికంగా అమలవుతోంది. ఎలాంటి అవకతవకలకు, పొరపాట్లకు ఆస్కారం లేకుండా ట్రాఫిక్, ఆర్టీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. దేశంలోనే తొలిసారిగా ప్రారంభమైన ఈ విధానం ప్రాథమికంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో అమలులోకి వచ్చింది. వాహనచోదకులు ఎక్కువ పాయింట్లు పొందాలన్నది తమ అభిమతం కాదని, కేవలం వారిలో క్రమశిక్షణ పెంపొందించేందుకే ఆర్టీఏ సహకారంతో ఈ విధానం అమలు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. గడిచిన ఏడాది కాలంలో 12 పాయింట్లు పూర్తి చేసుకున్న ముగ్గురి డ్రైవింగ్‌ లైసెన్సులు రద్దు కాగా... మరో 21 మంది దీనికి దగ్గర్లో ఉన్నట్లు పేర్కొన్నారు.

పెనాల్టీ పాయింట్స్‌ విధానం మొత్తం వాహనచోదకుడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఆధారంగా జరుగుతుంది. పోలీసులు ఓ ఉల్లంఘనుడిని పట్టుకున్నప్పుడు అతడి లైసెన్స్‌ నెంబర్‌ సేకరించడం ద్వారా దాన్ని తమ ట్యాబ్, పీడీఏ మెషిన్‌లో ఎంటర్‌ చేస్తారు. దాని ద్వారా అతడి లైసెన్స్‌పై పెనాల్టీ పాయింట్స్‌ నమోదయ్యేలా చూస్తున్నారు. ఈ–చలాన్‌ విధానంలో వాహనచోదకుడి లైసెన్స్‌ నెంబర్‌ తెలుసుకునే అవకాశం లేకపోవడంతో ప్రస్తుతానికి పెనాల్టీ పాయింట్స్‌ను స్పాట్‌ చలాన్‌లకే వర్తింపజేస్తున్నారు. మరోపక్క ఈ–చలాన్‌ విషయంలోనూ వీటిని చెల్లించేప్పుడు ఉల్లంఘనలకు పాల్పడిన సమయంలో వాహనం ఎవరు నడిపారన్నది? తెలుసుకునే ప్రయత్నం చేయాలని భావిస్తున్నారు. ఫలితంగా భవిష్యత్తులో వాహనం ఆధారంగా దాని యజమానికీ పాయింట్లు విధించాలని యోచిస్తున్నారు.  

కొన్నింటికి మినహాయింపు...  
గతేడాది ఆర్టీఏ విభాగం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం హెల్మెట్‌/సీట్‌బెల్ట్‌ ధరించకపోవడం నుంచి వాహనం నడుపుతూ ఎదుటి వ్యక్తి మృతికి కారణం కావడం వరకు మొత్తం 24 రకాలైన ఉల్లంఘనలకు కనిష్టంగా ఒకటి నుంచి గరిష్టంగా 5 వరకు పెనాల్టీ పాయింట్స్‌ విధించే ఆస్కారం ఉంది. 24 నెలల కాలంలో 12 పాయింట్స్‌ వస్తే సదరు వాహనచోదకుడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ను ఆర్టీఏ అధికారులు సస్పెండ్‌ చేస్తారు. తొలినాళ్లల్లో నగర పోలీసులు అన్నింటికీ పాయింట్స్‌ విధించారు. అయితే ఈ 24 రకాలైన ఉల్లంఘనల్లోనూ అనేక సందర్భాల్లో కొన్నింటిలో వాహచోదకుడి ప్రమేయం ఉండనివిగా, ఎదుటి వ్యక్తికి, వాహనచోదకుడికి ఎలాంటి ముప్పు కలిగించనివిగా గుర్తించారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు పొల్యూషన్‌ అండ్‌ కంట్రోల్‌ సర్టిఫికెట్‌ లేకపోవడం, వాహనానికి ఇన్సూరెన్స్‌ లేకపోవడం, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకపోవడం వంటి ఉల్లంఘనలకు పెనాల్టీ పాయింట్స్‌ విధించవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అత్యంత ప్రమాదకరమైన, ప్రమాదాలు/మరణాలకు కారకంగా మారే ఉల్లంఘనలకే వీటిని విధిస్తున్నారు.

24 నెలలు...12 పాయింట్లు  
ప్రాథమికంగా రెండేళ్ల కాలాన్ని పెనాల్టీ పాయింట్స్‌కు గడువుగా నిర్దేశించుకున్నారు. ఈ కాలంలో పెనాల్టీ పాయింట్స్‌ 12కు చేరితే డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఏడాది రద్దవుతుంది. మళ్లీ కొత్త లెక్కింపు ప్రారంభమవుతుంది. ఒకవేళ అది మళ్లీ పునరావృతమైతే మూడేళ్లు లైసెన్స్‌ రద్దు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. లెర్నింగ్‌ లైసెన్స్‌ వారికి ఈ పాయింట్లు 5 వస్తే చాలు... లైసెన్స్‌పై వేటు పడుతుంది. గడిచిన ఏడాది కాలంలో మొత్తం 4.47 లక్షల పెనాల్టీ పాయింట్స్‌ విధించారు. కాచిగూడ, ఫలక్‌నుమా, ఎస్సార్‌నగర్‌ ప్రాంతాలకు చెందిన ముగ్గురు ద్విచక్ర వాహన చోదకులకు 12 పాయింట్స్‌ పూర్తయ్యాయి. దీంతో వీరి లైసెన్సుల్ని సస్పెండ్‌ చేయించారు. వీరిలో ఇద్దరిపై 14 పాయింట్లు, మరొకరిపై 18 పాయింట్స్‌ నమోదైన్నట్లు అధికారులు తెలిపారు. మరో 21 మంది వాహన చోదకులపై ఇప్పటికే 12 పాయింట్స్‌ నమోదయ్యాయి. వీరిలో ఎవరికైతే మరొక్క పాయింట్‌ పడుతుందో వారి లైసెన్స్‌ సస్పెండ్‌ అవుతుందని అధికారులు చెప్పారు. ఇలా వచ్చిన పాయింట్లను తగ్గించుకొని ఉపశమనం పొందే మార్గమూ ఉంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లో రహదారి నిబంధలనలు, ప్రమాదాల నివారణ అంశాలపై నిర్వహించే తరగతులకు హాజరైతే అప్పటి వరకు లైసెన్స్‌ హోల్డర్‌ ఖాతాలో ఉన్న పాయింట్ల నుంచి మూడు తగ్గిస్తారు. అయితే 24 నెలల కాలంలో రెండుసార్లు మాత్రమే ఇలాంటి ఆస్కారం ఉంది.

ఉల్లంఘనలు, పాయింట్లు ఇలా...
ఆటోలో డ్రైవర్‌ సీటులో అదనంగా ప్రయాణికుల్ని ఎక్కించుకుంటే: 1
సరుకు రవాణా వాహనాల్లో ప్రయాణికుల్ని తరలిస్తే: 2
హెల్మెట్, సీట్‌బెల్ట్‌ లేకుండా వాహనం నడిపితే: 1
రాంగ్‌రూట్‌లో వాహనం నడిపితే: 2
నిర్దేశిత వేగాన్ని మించి గంటకు 40 కి.మీ లోపు వేగంతో వెళ్తే: 2
నిర్దేశిత వేగాన్ని మించి గంటకు 40 కి.మీ కంటే ఎక్కువ వేగంతో వెళ్తే: 3
రాష్‌ డ్రైవింగ్‌/సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌/సిగ్నల్‌ జంపింగ్‌: 2
డ్రంకన్‌ డ్రైవింగ్‌/రేసింగ్‌/ఓవర్‌ స్పీడింగ్‌: 3
మద్యం తాగి ఫోర్‌వీలర్‌/లారీ/సరుకు రవాణా వాహనం నడిపితే: 4
మద్యం తాగి ప్రయాణికులుండే ఆటో/క్యాబ్‌/బస్సులు నడిపితే: 5
జిగ్‌జాగ్‌ డ్రైవింగ్‌/సౌండ్, ఎయిర్‌ పొల్యూషన్‌/నో పార్కింగ్‌: 2
ఇన్సూరెన్స్‌ లేకుండా వాహనం నడిపితే: 2
అనుమతి పత్రం లేకుండా ప్రమాదకర వస్తువులు తరలిస్తే: 2
ఎదుటి వారి భద్రతకు ప్రమాదం వాటిల్లేలా/గాయపడేలా నడిపితే: 2
నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసి ఎదుటి వారి మృతికి కారణమైతే: 5
వాహనం నడుపుతూ చైన్‌ స్నాచింగ్, దోపిడీలకు పాల్పడితే: 5  

సిటీజనుల్లో ‘12’ భయం...  
ఓ వాహనచోదకుడికి పెనాల్టీ పాయింట్స్‌ విధింపు ప్రారంభమైన తర్వాత అతడికి ఉండే గడువు కేవలం 24 నెలలు మాత్రమే. ఒకటో పాయింట్‌ పడిన తర్వాత రెండేళ్లలో 12 పాయింట్ల విధింపు పూర్తయితే అతడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ సస్పెండ్‌ అవుతుంది. ఈ భయం నగవాసుల్లో పట్టుకుంది. తొలిసారి ఉల్లంఘనకు పాల్పడి... పెనాల్టీ పాయింట్‌ పడిన వారు రెండోసారి అలాంటి పొరపాటు చేయడానికి వెనకాడుతున్నారు. ఆ తర్వాత నుంచి వీలైనంత వరకు రహదారి నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారు. ఏడు పెనాల్టీ పాయింట్స్‌ దాటితే వాహనం స్వాధీనం చేసుకొని ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో (టీటీఐ) కౌన్సిలింగ్‌కు హాజరు కావడాన్ని నగర ట్రాఫిక్‌ పోలీసులు పక్కా చేశారు. ఇలా ఇప్పటికే 1,600 మందికి ఈ ప్రక్రియను చేపట్టారు. గడిచిన ఏడాదిలో ఉల్లంఘనల నమోదు తీరును పరిశీలిస్తే ‘అనుభవం’ తర్వాత వాహనచోదకుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. అత్యధిక కేసుల్లో ఒక్క పాయింట్‌ పడిన తర్వాత గరిష్టంగా రెండో పాయింట్‌ మాత్రమే పడుతోందని, ఆపై ఉల్లంఘనులు జాగ్రత్తగా వ్యవహరిస్తూ వీలున్నంత వరకు రోడ్డు నిబంధనలు పాటిస్తున్నారని అధికారులు పేర్కొంటున్నారు.

ఆ లైసెన్స్‌తో చిక్కితే జైలే...  
పెనాల్టీ పాయింట్స్‌ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అనేక మంది ఉల్లంఘనలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉంటున్నారు. అయినప్పటికీ ట్రాఫిక్‌ నిబంధనల అమలు విషయంలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్‌ విభాగం అధికారుల వద్ద ఉండే పీడీఏ మెషిన్లు ఆర్టీఏ సర్వర్‌తోనూ అనుసంధానించి ఉంటాయి. దీంతో ఏఏ లైసెన్సులు సస్పెన్షన్‌కు గురయ్యాయి? అనేది తక్షణం తెలుస్తుంది. వాహన చోదకుల్లో ఎవరైనా సస్పెండ్‌ అయిన డ్రైవింగ్‌ లైసెన్స్‌/దాని ప్రతిని వినియోగించి వాహనం నడుపుతుంటే ఆ విషయాన్ని క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసే పోలీసులు పీడీఏ మెషిన్ల ద్వారా తేలిగ్గా గుర్తిస్తారు. అలాంటి వారిపై చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకొని కోర్టులో హాజరు పరుస్తారు. ఇలాంటి ఉల్లంఘనకు పాల్పడిన వారికి గరిష్టంగా మూడు నెలల వరకు జైలు శిక్షపడే ఆస్కారం ఉంది.– ఎల్‌ఎస్‌ చౌహాన్, ట్రాఫిక్‌ డీసీపీ–1

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement