
అందని ద్రాక్ష.. క్షమాభిక్ష
గాంధీ జయంతికి కనిపించని కదలిక
- ఖైదీలకు క్షమాభిక్షపై సర్కారు మీమాంస
- వెలువడని ఉత్తర్వులు
సాక్షి, హన్మకొండ: చేసిన తప్పునకు పశ్చత్తాపపడి తిరిగి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని ఆశిస్తున్న ఖైదీలు, మరికొంత కాలం జైలుజీవితాన్ని గడపకతప్పదు. గాంధీజయంతి సందర్భంగా ప్రభుత్వం తరఫున తీపి కబురు అందుతుందేమోనేని ఆశిం చిన ఖైదీలకు నిరాశే ఎదురైంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైళ్లో వెయ్యి మంది వరకు ఖైదీలు ఉండగా వీరిలో సత్ప్రవర్తన కలిగి ప్రభుత్వం ఇచ్చే క్షమాభిక్షకు అర్హులైన ఖైదీలు 50 మంది వరకు ఉన్నారు.
రెండోఏడు : శిక్షాకాలంలో సత్ప్రవర్తనతో మెలిగే ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర, గణతంత్ర, గాంధీజయంతి వంటి జాతీయపండుగల సమయంలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తోంది. రాష్ట్రంలో చివరి సారిగా 2013 గాంధీజయంతి సందర్భంగా క్షమాభిక్షను ప్రసాదించారు. అప్పటి నుంచి 2014, 2015 సంవత్సరాల్లో గణతంత్ర, స్వాంత్రదినోత్సం, గాంధీజయంతిల సంధర్భంగా ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు.
క్షమాభిక్షకు ఎవరు అర్హులు : జైళ్లో శిక్ష కాలంలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీల శిక్షాకాలాన్ని తగ్గించడాన్ని రెమిషన్ అంటారు. ఈ రెమిషన్‌లు సాధారణ, ప్రత్యేక, ప్రభుత్వ అని మూడు రకాలుగా ఉన్నాయి. జైళ్లశాఖ నిబంధనల ప్రకారం 1) సత్ప్రవర్తనతో మెలిగితే నెలకు రెండు రోజులు 2) రోజువారి విధులను సక్రమంగా నిర్వర్తిస్తే నెలకు మూడు రోజులు 3) ఏడాది కాలంలో ఏ తప్పు చేయకుండా ఉంటే 20 రోజులు రెమిషన్ ఇస్తారు. దీన్ని సాధరణ రెమిషన్ అంటారు. ఇలా కాకుండా దుస్తులు ధరించడంలో పొదుపు, జైలు అధికారుల విధుల్లో సహాకారం అందించడం, చేతివృత్తులను బోధించడం, పరిశ్రమ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించడం, కొన్ని ప్రత్యేక సంధర్భాల్లో జైలు అధికారులకు సహాకరించడం, అధికారులను దాడుల నుంచి కాపాడటం వంటి పనులు చేసిన వారికి ఏడాదికి 30 నుంచి 60 రోజుల పాటు శిక్షాకాలంలో కోత విధిస్తారు. దీన్ని ప్రత్యేక రెమిషన్ అంటారు. సాధారణ, ప్రత్యేక రెమిషన్‌లు కలిపితే ఖైదీ శిక్షాకాలంలో మూడోవంతుకు మించకుండా ఉండాలి. అంటే ఒక ఖైదీకి పదేశ్లు శిక్షపడితే అందులో రెమిషన్ మూడేళ్లు మించకూడదు. అంటే సత్ప్రవర్తన కారణంగా మూడేళ్లకు మించి శిక్షాకాలాన్ని తగ్గించుకునే వీలులేదు.
ప్రభుత్వ రెమిషన్ : ఖైదీల సత్ప్రవర్తనతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల స్థితి గతులను పరిగణలోకి తీసుకుని వారి శిక్షాకాలాన్ని తగ్గించడాన్ని ప్రభుత్వ రెమిషన్ అంటారు. ప్రభుత్వం రెమిషన్ ఇవ్వాలంటే విడుదల తేది నాటికి (గణతంత్ర, స్వాతంత్ర, గాంధీజయంతి) ఆ ఖైదీ ఏడేళ్ల వాస్తవ శిక్ష అనుభవించి రెమిషన్‌తో కలిపి పదేళ్ల శిక్ష పూర్తి చేయాలి. అదే మహిళలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధుల విషయంలో ఐదేళ్ల వాస్తవ శిక్షతో పాటు రెమిషన్‌తో కలిపి ఏడేళ్ల శిక్షా కాలాన్ని పూర్తి చేసి ఉండాలి. ఇలా చేసిన ఖైదీలను జాతీయ పండుగలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది.
క్షమాభిక్షకు అర్హులు కానీవారు : మత సంబంధమైన కేసులు, ఉరిశిక్ష నుంచి జీవితఖైదుగా మారడం, ప్రభుత్వ ఉద్యోగులకు హత్య చేయడం, నిత్యావసర వస్తువుల అక్రమరవాణా నిరోధక చట్టం, మానవ హక్కుల ఉల్లంఘన చట్టం, ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, మహిళలపై నేరాలకు సంబంధించి 354, 376, 498(ఏ) వంటి సెక్షన్ల కింద జీవిత ఖైదు అనుభవిస్తున్న వారు, పెరోల్‌పై విడుదలై సకాలంలో రాని వారు, మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల కేసుల్లో శిక్షలు పడ్డవారు. కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక చట్టాల పరిధిలో శిక్షలు పడిన ఖైదీలు క్షమాభిక్షకు అర్హులు కారు.