స్పీడ్‌ గన్స్‌, కెమెరాలు | Speed Guns And Cameras For Vehicle Speed Control In Telangana | Sakshi
Sakshi News home page

స్పీడ్‌ గన్స్‌, కెమెరాలు

Published Tue, Jul 3 2018 2:37 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Speed Guns And Cameras For Vehicle Speed Control In Telangana - Sakshi

స్పీడ్‌ గన్స్‌, కెమెరాలు

సాక్షి, సిద్దిపేట : రాజీవ్‌ జాతీయ రహదారి.. ఇటీవల తరచూ ప్రమాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది.. ఆ రహదారిపై ప్రయాణించాలంటేనే జనం జంకుతు న్నారు.. అయితే ఇకపై ఆ పరిస్థితి మారనుంది. రాజీవ్‌ రహదారిపై రక్షణ చర్యలు చేపట్టేందుకు సిద్దిపేట జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలు, వాటికి గల కారణాలు తెలుసుకుని, అవి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం రిమ్మనగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం, మానకొండూరులో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలతో అధికారులు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. ఈ మేరకు సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామి రెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌తోపాటు బీవోటీ డీజీఎం విజయభాస్కర్‌రెడ్డి సమావేశమయ్యారు.

ప్రమాదాలపై అధ్యయనం
మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట నుంచి సిద్దిపేట, కరీంనగర్‌ జిల్లాల మీదుగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాల ప్రాంతం వరకు 207 కిలోమీటర్ల మేర రాజీవ్‌ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించారు. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో గల పలు జాతీయ రహదారులను ఈ దారి కలుపుతుంది. సిద్దిపేట జిల్లాలో ఈ రహదారి ములుగు మండలం వంటిమామిడి నుంచి బెజ్జంకి వరకు సుమారు 125 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ రహదారి పనులపై అప్పట్లోనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

ఎక్కడా పార్కింగ్‌ లేదు!
రాజీవ్‌ రహదారిపై ఎక్కడిపడితే అక్కడ ఉన్న మూల మలుపులు, తొమ్మిది అంగుళాల ఎత్తు మాత్రమే ఉన్న డివైడర్‌ వల్ల ప్రమాదాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. ఇసుక వాహనాలు, ఎక్స్‌ప్రెస్‌లు మితిమీరిన వేగమే ప్రమాదాలకు కారణం అని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. వీటిని నిరోధించేందుకు ఓఆర్‌ఆర్‌ మాదిరిగా స్పీడ్‌ కంట్రోలింగ్‌ సిస్టమ్‌ (స్పీడ్‌ గన్స్‌) ఏర్పాటు చేయనున్నారు. 207 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారిపై ఎక్కడా పార్కింగ్‌ సౌకర్యం లేదు. కొన్ని సందర్భాల్లో ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీన్ని నివారించేందుకు సిద్దిపేట జిల్లాలోని 95 కిలోమీటర్ల పొడవున 7 పార్కింగ్‌ సదుపాయం కల్పించేందుకు స్థల సేకరణ చేస్తున్నారు. 

సీసీ కెమెరాల ఏర్పాటు..
గుర్తుతెలియని వాహనాలను గుర్తించడంతో పాటు రహదారిపై జరిగే ఇతర నేరాలను అరికట్టేందుకు సిద్దిపేట జిల్లా పరిధిలో రాజీవ్‌ రహదారిపై 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా రహదారి వెంట ఉన్న గ్రామాల్లో రోడ్డు దాటే సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటి నివారణకు ప్రతి గ్రామంలో లైటింగ్, ఇతర రక్షణ చర్యలు చేపట్టనున్నారు. జీబ్రా క్రాసింగ్‌ పెయింటింగ్, ప్రమాద సూచికలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. డివైడర్ల ఎత్తు పెంపు విషయంపై బీవోటీ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. అలాగే సిద్దిపేట సరిహద్దులోని పొన్నాల వద్ద ఫ్లైఓవర్‌ బ్రిడ్జి మంజూరు ప్రక్రియకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లు తెలిసింది.

రహదారికి ఇరువైపులా పార్కింగ్‌
‘ప్రమాదాలకు ప్రధాన కారణం డ్రైవర్లకు విశ్రాంతి లేకపోవడం. దీన్ని నివారించేందుకు సిద్దిపేట జిల్లా పరిధిలోని 75 కిలోమీటర్లలో అవసరమైన చోట పార్కింగ్‌ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు ప్రభుత్వ భూమి గుర్తించాలని ఆర్డీవోలు, తహశీల్దారర్లకు ఆదేశాలు జారీ చేశాం. మితిమీరిన వేగాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టే విషయంపై పోలీస్‌ కమిషనర్‌తో చర్చించాం.’
– వెంకట్రామిరెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్‌


ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళిక
‘రాజీవ్‌ రహదారిపై రోజూ ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. దీన్ని నివారించేందుకు జిల్లా కలెక్టర్‌ చొరవతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. పార్కింగ్, స్పీడ్‌ కంట్రోల్, సీసీ కెమెరాల ఏర్పాటు మొదలైన చర్యలు తీసుకుంటున్నాం. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతాం.
– జోయల్‌ డేవిస్, సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌

రక్షణ చర్యలు చేపడుతున్నాం. 
రహదారిపై ప్రమాదాలు నివారించేందుకు రక్షణ చర్యలు చేపడుతున్నాం. రామునిపట్ల, లింగారెడ్డిపల్లి గ్రామాల వద్ద లైటింగ్‌ ఏర్పాటు, మార్కింగ్‌లు, ఇతర గుర్తులను తెలిపేలా ఎప్పటికప్పుడు పెయింటింగ్‌ చేస్తున్నాం.
– విజయ భాస్కర్‌రెడ్డి, బీవోటీ, డీజీఎం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement