సాక్షి, సిటీబ్యూరో: వాహనాలకున్న బ్లాక్‌ఫిల్‌్మను తొలగించడంపై నగర ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. ఫిల్మ్ను తొలగించడంతో పాటు వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్‌లను కూడా వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నామని నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నల్లద్దాలతో వెళ్లే కార్లు, బస్సులపై రూ.వెయ్యి జరిమానా విధించడమే కాకుండా అక్కడికక్కడే ఆ వాహనాలను ఆపి ట్రాఫిక్ సిబ్బంది వాటిని తొలగిస్తారన్నారు. ఈ వాహనాలపై కూడా ఈ చలాన్లు జారీ అవుతాయని, ఇప్పటికే చాలా మంది వాహనదారుల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని సూచించారు.
కొందరు బ్లాక్‌ఫిల్మ్ స్థానంలో లైట్ కలర్ ఫిల్మ్ వాడుతున్నారని, ఇది కూడా వాడవద్దని హెచ్చరించారు. తమకు ఆర్టీఏ అనుమతి ఉందంటూ వాహనదారులను మభ్యపెట్టే ప్రయత్నం చేసి బ్లాక్‌ఫిల్‌్మను కార్లకు ఫిక్స్ చేస్తున్న కారు డెకార్స్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎండ రావద్దని షేడ్స్, కర్టెన్స్ వాడుతున్నారని, హై ఎండ్ కార్లలో బ్లాక్ స్క్రీన్ డ్రా చేసే అవకాశాలు ఉండడంతో ఈ విధంగా వ్యవహరించడం కూడా చట్టవిరుద్ధమన్నారు. ఆర్టీసీ, ప్రైవేట్ స్కూల్ బస్సులు కూడా విండో అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తొలగించాలని ఆయన సూచించారు.