
రాచకొండ గుట్టల సమాచారాన్ని మ్యాప్ ద్వారా సీఎంకు వివరిస్తున్న రాజీవ్ శర్మ
* అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తాం: సీఎం కేసీఆర్
* విశ్వవిద్యాలయాలు నెలకొల్పే అంశంపైనా పరిశీలన
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి సినిమా, క్రీడా నగరాలను నిర్మిస్తామని.. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలో ఉన్న రాచకొండ గుట్టల ప్రాంతం ఇందుకు అనువుగా ఉన్నట్లు గుర్తించామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇక్కడ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశముందని చెప్పారు. హైదరాబాద్ నుంచి రాచకొండకు రెండు మార్గాల్లో నాలుగు లేన్ల రోడ్డును నిర్మిస్తామని చెప్పారు. ఈ మేరకు రాచకొండ గుట్టల ప్రాంతంపై సోమవారం మంత్రులు మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో కలిసి సీఎం ఏరియల్ సర్వే చేశారు.
తొలుత హైదరాబాద్ నుంచి ఉదయం 11.30కు హెలికాప్టర్‌లో వచ్చిన సీఎం కేసీఆర్ రాచకొండ కోటకు సమీపంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. గుట్టల ప్రాంతంలో ఉన్న భూముల వివరాలను నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సీఎం కేసీఆర్‌కు వివరించారు. అనంతరం రాచకొండ, ముచ్చర్ల, ఆమనగల్, కర్తాల్ మీదుగా శ్రీశైలం అడవుల వరకు దాదాపు 25 నిమిషాల పాటు ఏరియల్ సర్వే చేశారు. తిరిగి రాచకొండకు వచ్చిన సీఎం.. దాదాపు గంటసేపు మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి ఆ ప్రాంతంలో చేయాల్సిన అభివృద్ధి, కార్యాచరణపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
రాజధానికి దగ్గరలో..
రాచకొండ ప్రాంతం దాదాపు 31 వేల ఎకరాల్లో విస్తరించి ఉందని, పరిశ్రమలు, సంస్థలు, విద్యాలయాలు స్థాపించడానికి అనుకూలంగా ఉంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాజధానికి అత్యంత సమీపంలోని ఈ ప్రాంతంలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, ఈ భూములను ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న దానిపై అధికారులు దృష్టి సారించాలని సీఎం పేర్కొన్నారు. నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో హైదరాబాద్‌కు దగ్గరగా దాదాపు 40 వేల ఎకరాల భూమిని సేకరించి, పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటు చేయాలని... ఇందుకోసం ప్రతిపాదనలు తయారుచేయాలని ఆయన ఆదేశించారు. హైదరాబాద్ నుంచి రాచకొండకు ముచ్చర్ల, ఇబ్రహీంపట్నం మీదుగా నాలుగు లేన్ల రోడ్డు, జాతీయ రహదారిపై మల్కాపురం నుంచి మరో నాలుగు లేన్ల రహదారిని ఏర్పాటు చేయడం ద్వారా రవాణా సౌకర్యం కల్పించవచ్చని కేసీఆర్ పేర్కొన్నారు. అనంతరం ఇక్కడ ఫిలిం సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, స్పోర్ట్స్‌సిటీలతో పాటు గ్రీన్‌ఫీల్డ్ పరిశ్రమలు, సోలార్‌ఎనర్జీ పరిశ్రమలు, ఇతర సంస్థల ఏర్పాటు విషయాన్ని ఆలోచిద్దామని చెప్పారు.
రాళ్లు రప్పలున్న భూమిని కొనాలా?
అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఇష్టాగోష్టి సందర్భంగా సీఎం కేసీఆర్ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న సినీమ్యాక్స్ స్థలాన్ని తాను కొని ఉండాల్సిందని సీఎం చెప్పినట్లు సమాచారం. ‘‘గతంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కూడా గుట్టలే. అక్కడకు వెళ్లాలంటేనే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇరవయ్యేళ్ల కింద మా మామ స్నేహితుడు ఒకాయన ఇప్పుడు సినీమ్యాక్స్ ఉన్న స్థలాన్ని గజం రూ. 40 లెక్కన కొనుగోలు చేయాలని నాకు చెప్పడంతో చూసేందుకు వెళ్లాం. అక్కడకు వెళ్లడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. స్కూటర్ మీద వెళ్లడమే గగనమైపోయింది. కానీ ఆ భూమిని చూసి నాకు చాలా కోపం వచ్చింది. ఈ రాళ్లు, రప్పలున్న భూమి కొనమంటావా? అని అడిగాను. ఇంకోసారి అలాంటి భూములు చూపెట్టవద్దన్నాను. కానీ ఇప్పుడు అదే భూమి కోట్ల రూపాయలు పలుకుతోంది. ఇప్పుడు రాచకొండ గుట్టలను చూస్తే అదే గుర్తుకువస్తోంది..’’ అని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది.
బీడీఎల్ అనుమతిస్తేనే..
రాచకొండ గుట్టల్లో ఫిలింసిటీతో పాటు పరిశ్రమలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నా.. అందు కు రక్షణ పరిశోధన సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) అనుమతి అవసరం కానుంది. ఎందుకంటే ఈ గుట్ట ల్లో దాదాపు 18 వేల ఎకరాలను క్షిపణి ప్రయోగాల నిమిత్తం బీడీఎల్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందే లీజుకిచ్చిం ది. క్షిపణి ప్రయోగాలను పరిశీలించే సమయంలో ఆ భూ ములు పూర్తిగా బీడీఎల్ పరిధిలోకి వెళతాయి. మిగతా సమయంలో అటవీశాఖ అధీనంలోనే ఉండాలని, ఆ శాఖే ఆ భూముల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని లీజు ఒప్పందంలో ఉంది. ఇందుకోసం కేంద్రం రూ. 6కోట్లను రాష్ట్రానికి చెల్లించింది కూడా. రాచకొండలో సీఎం పర్యటన సందర్భంగా నల్లగొండ కలెక్టర్ ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. కేంద్రంతో మాట్లాడతానని సీఎం చెప్పినట్టు సమాచారం. అయితే కేంద్రం అనుమతిచ్చినా... క్షిప ణి ప్రయోగాల ప్రతిపాదన విరమించకుండా అక్కడ పరిశ్రమల స్థాపన అసాధ్యమని అధికారులు చెబుతున్నారు.
పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుంది: బీజేపీ
విలువైన చారిత్రక సంపద, పర్యావరణ సమతౌల్యం దెబ్బతినేలా రాచకొండ గుట్టల్లో ఫిలిం సిటీ నిర్మాణం చేపట్టడం సరికాదని బీజేపీ విమర్శించింది. ఇతర పార్టీలు, స్థానిక ప్రజల అభిప్రాయం తీసుకోకుండా అక్కడ ఫిలిం సిటీ నిర్మిస్తామని సీఎం పేర్కొనడం ఏకపక్షమని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యడు పేరాల చంద్రశేఖరరావు పేర్కొన్నారు. రాచకొండ గుట్టల ప్రాంతంలో వెలకట్టలేని చారిత్రక సంపద, పురాతన దేవాలయాలు, గిరిజన ప్రాంతాలున్నాయని.. వాటిని ధ్వంసం చేస్తూ ఫిలిం సిటీని నిర్మించడం సరికాదని చెప్పారు.