ఎస్‌ఎల్‌బీసీ పనులకు అడుగడుగునా అడ్డంకులు
11ఏళ్లుగా ముందుకుసాగని సొరంగం పనులు
ఆలస్యంతో ప్రభుత్వంపై రూ. 3వేల కోట్ల భారం
మంత్రి ఆదేశాలతోనైనా వేగవంతమయ్యేనా?
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్‌ఎల్‌బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) పనులు కొనసా..గుతూనే ఉన్నాయి. 11ఏళ్లు గడిచినా.. అంచనా వ్యయం రెట్టింపు అయినా ఓ అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి! అన్న చందంగా జరుగుతున్నాయి. భూసేకరణ సమస్యతో పాటు పర్యవేక్షణాలోపంతో పనులు నత్తను తలపిస్తున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా మహబుబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు సాగునీరు అందించాలన్న ప్రతిపాదన 1983 నుంచీ ఉంది. అప్పటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడంతో 2005లో సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఎస్‌ఎల్‌బీసీకి అనుమతిచ్చారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యను తీర్చడంతో పాటు సుమారు మూడులక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టుకు రూ.2813కోట్ల పరిపాలన అనుమతులు లభించాయి. రూ.1,925కోట్లతో న్యూఢిల్లీకి చెందిన జయప్రకాష్ అసోసియేట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. తీరా2006లో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. 2008 మార్చి 25న దేవులతండా సీ పాయింట్ వద్ద టన్నెల్ బోరింగ్ మిషన్(టీబీఎం)ను అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. వాస్తవానికి పనులు 2010లోనే పూర్తికావాల్సి ఉన్నా భూసేకరణ సమస్యకు తోడు అప్పట్లో కృష్ణానదికి వరదలు రావడంతో సొరంగం వరదనీటితో పోటెత్తింది. ఇందులో ఎవరి నిర్లక్ష్యం ఎలా ఉన్నా మొదటి అంచనా విలువకు మించి రూ.617కోట్లు అదనంగా ఖర్చయినా టన్నెల్ మాత్రం ఇంకాపూర్తికాలేదు.
పెరిగిన అంచనావ్యయం
43.930 కి.మీ పనులు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు 26.403 కి.మీ సొరంగం మాత్రమే పూర్తయింది. దోమలపెంట శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి ప్రారంభమైయ్యే టన్నెల్-1 ఇన్‌లెట్ డ్రిల్లింగ్‌తో పాటు అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి టన్నెల్-1 అవుట్‌లెట్ డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నాయి. 2015లో యంత్రాలు ఇబ్బంది పెట్టడంతో అవుట్‌లెట్ పనులు ఏడాది పాటు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇటీవల రెండు మిషన్లు పనిచేస్తున్నాయి. ప్రాజెక్టు మొదటి అంచనా వ్యయం భారీగా పెరిగింది. ప్రభుత్వం సవరించిన బడ్జెట్ అంచనా విలువ రూ.5811కోట్లకు చేరింది. మరింత ఆలస్యమైతే మరో రూ.3వేల కోట్లు అదనపుభారం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గురువారం భారీనీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రాజెక్టును సందర్శించారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు పూర్తి నత్తనడకన కొనసాగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. గురువారం ప్రాజెక్టును సందర్శించిన ఆయన పనులు వేగవంతం కాకపోతే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఏడాది 2కి.మీ చొప్పున!
ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు 8ఏళ్లలో 26.403 కి.మీ మాత్రమే పూర్తికాగా, మరో 17.527కి.మీ పూర్తిచేయాల్సి ఉంది. ప్రభుత్వం 2018నాటికి చివరి గడువుగా నిర్ణయించింది. గత మే నుంచి ఇప్పటివరకు రెండు కి.మీ మేర సొరంగం మాత్రమే పూర్తయింది. ఈ లెక్కన మరో 9 ఏళ్లయినా ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తయ్యేలా కనిపించడం లేదు. టన్నెల్-1ఇన్‌లెట్ నుంచి 20.5కి.మీ పనులు పూర్తిచేయాల్సి ఉండగా ఇప్పటివరకు 11.346 కి.మీ సొరంగం పూర్తిచేశారు. ఇంకా ఇక్కడినుంచి 9.154 కి.మీ పనులు పూర్తిచేయాల్సి ఉంది. టన్నెల్-1 అవుట్‌లెట్ నుంచి 23.430కి.మీ పనులకు ఇప్పటివరకు 15.057కి.మీ పూర్తయింది. మరో 8.373 కి.మీ సొరంగం తవ్వాల్సి ఉంది. ప్రాజెక్టు ప్రగతిపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించినా.. సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నా ఫలితం లేకపోయింది.
అమ్రాబాద్ ఎత్తిపోతల అదేతీరు
ఎస్‌ఎల్‌బీసీ నుంచి అమ్రాబాద్ మండలానికి ఎత్తిపోతల ద్వారా 20వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని తెలంగాణ ఇంజనీర్ల ఫోరం ప్రకటించింది. కానీ ఇంతవరకు అధికారులు ఆ మాటే ఎత్తడం లేదు. ఎస్‌ఎల్‌బీసీ నుంచి అచ్చంపేట ప్రాంతానికి ఎంతనీరు అందుతుందో స్పష్టత లేదు. ఎత్తయిన కొండలపై ఉన్న అమ్రాబాద్‌కు ఎత్తిపోతల ద్వారా నీరు ఇస్తామని చెప్పడం చూస్తే విస్మయం కలిగిస్తుందని మేధావులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను వేగవంతం చేయాలి. పనుల జాప్యంలో స్పేర్‌పార్ట్స్ లేవని, ఇతర కారణాలను ఏజెన్సీ వారు చూపిస్తున్నారు. పనుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
- ఈ నెల 19న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలనలో మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలు.
ఇన్నాళ్లూ నత్తకు నడకలు నేర్పిన టన్నెల్ పనులు మంత్రి ఆదేశంతోనైనా వేగిరం అవుతాయో లేదో చూడాలి.
నత్తే నయం!
Published Wed, May 25 2016 12:14 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM
Advertisement
Advertisement