
సాక్షి, నాంపల్లి(హైదరాబాద్): హైదరాబాద్‌లోని నాంపల్లిలో ప్రతిఏటా జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) బుధవారం రాత్రికి అగ్నికి ఆహుతైంది. క్షణాల్లోనే అక్కడున్న వందల స్టాళ్లు బూడిద అయ్యాయి. దీంతో తమకు న్యాయం చేయాలంటూ నష్టపోయిన స్టాల్ నిర్వాహకులు గురువారం సొసైటీ ముందు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో వ్యాపరస్తులు సొసైటీ ముట్టడికి యత్నించారు. దీంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు.
మేమేంటో చూపిస్తాం: స్టాల్ నిర్వాహకులు
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చెలరేగిన మంటలతో లక్షల రూపాయలు నష్టపోయామని వ్యాపరస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు నష్ట పరిహారం చెల్లించాలంటూ సొసైటీ సభ్యులను డిమాండ్ చేస్తున్నారు. 30 నిమిషాల్లో అధికారులు వచ్చి మాట్లాడకపోతే ఆందోళన మరింత ఉదృతం చేస్తామని పేర్కొన్నారు. తమకు న్యాయం చేస్తామని సోసైటీ సభ్యులు హామీ ఇవ్వకపోతే తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. సకాలంలో ఫైరింజన్లు రాకపోవటం వల్లే తమ స్టాళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయని వారు ఆరోపిస్తున్నారు.